Monday, November 3, 2025

 *మహామంత్రి మాదన్న - 22* 
(చరిత్ర ఆధారిత నవల)
👳🏽

రచన : ఎస్.ఎమ్. ప్రాణ్ రావు


షాజహాను చక్రవర్తి తీవ్ర అస్వస్థతకి గురి అయ్యాడు. దర్బారుకి రావడం అటుంచి, తన మందిర గవాక్షం నుంచి ప్రజలకు దర్శనం కూడా ఇవ్వడం మానేశాడు. పూర్తిగా మంచానికి అతుక్కుపోయాడు. దాంతో పాలనా పగ్గాలు రాజముద్రతో సహా దారా చేతిలోకి వచ్చాయి. పెద్దకూతురు జహనారా తండ్రికి సేవ చేస్తూ తండ్రి మంచాన్ని అంటిపెట్టుకుని ఉండిపోయింది.

అంత:పురంలో చీమ చిటుక్కుమన్నా చప్పున గ్రహించే రోషనారా అన్ని విషయాలు కూపీ లాగింది. ఔరంగజేబు సామర్థ్యం, నిరాడంబర జీవన విధానం ఇష్టపడి, అతని పట్ల మొగ్గు చూపుతున్న ప్రముఖ సర్దారులకి ఉప్పు అందించింది. అంతే కాదు ఔరంగజేబుకి లేఖ పంపింది. మరణశయ్య మీద వున్న చక్రవర్తి రేపో
మాపో గుటుక్కుమంటాడని, ఈలోగానే దారాకి పట్టం కట్టే ప్రమాదముందని హెచ్చరించింది.

ఆ వర్తమానం అందుకున్న ఔరంగజేబు సింహాసనోత్సాహంతో ఉబ్బి తబ్బిబ్బు అయ్యాడు. కత్తులు నూరే సమయం, శతృవుల ఎత్తులను చిత్తు చేసే సమయం వచ్చిందని తీర్మానించుకున్నాడు. వెంటనే రంగంలోకి దిగాడు. దారాకి వ్యతిరేకంగా పోరాడుదామని మురాద్ కి తన ప్రత్యేక దూత ఇసా బేగ్ ద్వారా వర్తమానం పంపాడు. మొగలు సామ్రాజ్యాన్ని విభజించుకుందామని ప్రతిపాదించాడు. పంజాబ్, ఆఫ్ఘనిస్థాన్, కశ్మీర్, సింధు ప్రాంతాలు మురాద్ వాటాగా వస్తాయని నమ్మ బలికాడు. ఆ సువిశాల రాజ్యానికి మురాద్ ని స్వతంత్ర ప్రభువుగా గుర్తిస్తానని భరోసా ఇచ్చాడు. ఈ తిరుగుబాటు విజయం వల్ల లభించిన అపార యుద్ధ సంపదలో మూడో వంతుపై మురాద్ కి హక్కులుంటాయని హామీ ఇచ్చాడు. 

ఈ భరోసాని, హామీని ఎట్టి పరిస్థితుల లోనూ ఉల్లంఘించనని పవిత్ర ఖురాన్ మీద ప్రమాణం కూడా చేశాడు. తనకి రాజ్యకాంక్ష లేదని, ఐహిక సుఖాల మీద లాలస అసలు లేదని ధర్మపన్నాలు వల్లించాడు. దారా లాంటి కాఫిర్ చేతిలో మొగలు సామ్రాజ్యానికి పుట్టగతులుండ వని అందుకే ఆత్మ ప్రభోదాన్ని అనుసరించి తను యుద్ధానికి దిగుతున్నానని చిలుక పలుకులు పలికాడు. ఈ యుద్ధం కేవలం ఇస్లాం రక్షణార్ధమే జరుగుతుందని, విజయం సాధించాక ఏ పదవీ తనకి వద్దని సన్నాయి నొక్కులు నొక్కాడు. మొత్తం రాజ్యాన్ని మురాద్ కి ఇచ్చేసి తను మక్కా వెళ్లి దర్వేష్ గా శేషజీవితం గడుపుదామనే ఆలోచన కూడా వుందని ముక్తాయించాడు. 

ఔరంగజేబుతో పాటే చావో రేవో అనుకునే బృందం అతనికి వుంది. శతఘ్నిదళ ప్రవీణుడు ముర్షీద్ కులీ ఖాన్, మహా వీరుడు షేక్ మీర్, సేనానాయకులు హదిదాద్ ఖాన్, మహబ్బత్ ఖాన్, ఆయుధాగార సంరక్షకుడు మహమ్మద్ తాహిర్ ఇలా ఎందరో ఔరంగజేబుకి తలలో నాలుకగా మసులుతుంటారు. అందరిని మించి యుద్ధ వ్యూహాలలో చెయ్యి తిరిగిన వాడు, యుద్ధంలో మడమ తిప్పని వజ్ర యోధుడు మీర్జా మహమ్మద్ సయ్యద్ తన ఫరంగీ గన్నర్లతో అండగా వున్నాడు. ఇది ఔరంగజేబు గుండెకి పొంగు ఇచ్చింది.
📖

తండ్రి మీద రణభేరి మ్రోగించాడు ఔరంగజేబు. కొడుకు మవుజ్జంని ఔరంగబాద్ లో తన ప్రతినిధిగా నియమించాడు. గోలుకొండ, బీజాపూర్ సుల్తానులకి స్నేహపూర్వకమైన లేఖలు పంపి వాళ్లని తటస్థంగా వుండమని నిర్మొహమాటంగా హెచ్చరించాడు. తన జనానాని దౌలతాబాదు కోటలో సురక్షితం గా వుంచి యుద్ధానికి బయలుదేరాడు.

ఉజ్జయిని వైపు కదులుతుండగా డిప్లొపూర్ సరస్సు వద్ద మురాద్ కలిశాడు. సోదరుల సైన్యం కలిసికట్టుగా కదిలింది. మహారాజా జస్వంత్ సింగ్, ఖాసిం ఖాన్ ల నాయకత్వంలో వున్న మొగలు సేనతో తలపడింది. అయితే ఖాసిం ఖాన్, జస్వంత్ సింగ్ మధ్య సయోధ్య కొరవడింది. దాంతో ఖాసిం ఖాన్ సహాయ నిరాకరణ చెయ్యడమే కాకుండా, నిర్లిప్తంగా వుండిపోయాడు. దీనివల్ల అనేక మంది ముసల్మాను సైనికాధికారులు ఔరంగజేబు పక్షంలో చేరారు. ఆ యుద్ధం లో మురాద్ మొగలు సేనాని ఇఫ్లెకార్ ఖాన్ ని వధించాడు. వెన్ను జూపకుండా పోరాడిన జస్వంత్ సింగ్ గాయాల పాలయ్యాడు. వెంటనే మొదటి నుంచి తటస్థంగా వున్న ఖాసిం ఖాన్ తన తోవ తను చూసుకున్నాడు. దాంతో వారి నాయకత్వంలో వున్న సైన్యం ఏనుగులతో, గుర్రాలతో శతఘ్నులతో కూడిన ఆయుధాలతో ఇతర సంభారాలతో సహా ఔరంగజేబు సోదరుల వశమయింది.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
ఈ వార్త మొగలులలో కలవరం లేపింది. దారాకి తిరుగులేదనుకున్నవారు పునరాలోచనలో పడ్డారు. రోషనారా వారి ఆలోచనలకి ఊతం ఇచ్చింది. దాంతో చాలామంది ఔరంగజేబు శిబిరానికి ఫిరాయించారు.

ఔరంగజేబు చంబల్ నదిని దాటి ఆగ్రా వైపు పురోగమించాడు. ఎదిరించి నిలిచిన దారా సైన్యంతో భీకరపోరు జరిగింది. ఆ యుద్ధంలో మీర్జా సయ్యద్ కి చెందిన ఫరంగీ గన్నర్లు విజృంభించారు. ఔరంగజేబు సేనానులు మూకుమ్మడిగా చెలరేగడంతో ఔరంగజేబుది పై చెయ్యి అయ్యింది. దారా సైన్యంలోని హిందూ,
ముసల్మాను సేనాధిపతుల సమన్వయ లోపం ఔరంగజేబుకి బాగా కలిసొచ్చింది. ఓడిపోయిన దారా వెనుతిరిగి ఆగ్రాకి వచ్చి తన ఇంట్లో తలుపులు బిడాయించుకుని కూచున్నాడు.

మరునాడు తెల్లవారుజామున కేవలం పది పన్నెండు మంది సేవకులు వెంటరాగా, భార్యా పిల్లలతో బంగారం, విలువైన నగలతో ఢిల్లీ పారిపోయాడు దారా.
📖

ఔరంగజేబు సైన్యం ఆగ్రాకి అయిదు కోసుల దూరంలో వున్న నూర్ మంజిల్ తోటలో గుడారాలు దింపింది. ఇంతకాలం దారాని సేవించిన సైన్యాధికారులు తమ తమ సైన్యాలతో సహా ఔరంగజేబు పంచన చేరారు.

ఔరంగజేబు ఆగ్రా కోటని ముట్టడించాడు. అత్యంత పటిష్ఠమైన రక్షణ వ్యవస్థ కలిగిన కోటను పట్టుకునే లోపల, దారా సైన్యాన్ని సమకూర్చుకుని దాడికి తెగబడతాడని ఔరంగజేబుకి తెలుసు. అలాగే షుజా గానీ, దారా కొడుకు సులేమాన్ షుకో గానీ మీద పడే అవకాశం వుందని కూడా ఔరంగజేబు కి తెలుసు. అందుకే కోటను తొందరగా లోబరుచుకోవడానికి వీలుగా కోటలోకి నీటి సరఫరా ఆపేశాడు. దాంతో కోటలో వున్న వారందరికీ చక్రవర్తితో సహా నాలుకలు పిడచకట్టుకు పోయాయి. గుక్కెడు నీటి కోసం అల్లల్లాడిపోయారు. 

'ఒరే, చనిపోయిన తల్లిదండ్రులకి కూడా హిందువులు నీళ్లు వదులుతారు. నీవు మటుకు నీ తండ్రిని బ్రతికుండగానే దాహంతో చంపుతున్నావు' అని మొర పెట్టుకున్నాడు షాజహాన్ చక్రవర్తి. 'చేసుకున్నంతవారికి చేసుకున్నంత' అని జవాబిచ్చాడు ఔరంగజేబు. దాంతో చక్రవర్తి లొంగిపోక తప్పలేదు.

'ఈ విజయం నిజంగా నీదే' అని ఔరంగజేబు, మురాద్ ని అభినందించాడు. ఇరవై లక్షల రూపాయలు, రెండు వందల గుర్రాలను కానుకగా ఇచ్చాడు. విందుకి ఆహ్వానించాడు. దానికి ముందే మురాద్ కి ఎంతో ప్రియమైన అంగరక్షకుడు నూరుద్దీన్ ఖవాజీని బంగారంతో కొనేసాడు. దాంతో ఖవాజ్ మాట తీసేయ్యలేక మురాద్ అన్న ఇచ్చే విందుకి వెళ్లాడు. అన్న మటుకు తన ప్రమాణాలకు తిలోదకాలు ఇచ్చి మురాద్ కి శృంఖలాలు తగిలించి గ్వాలియర్ కోటలో బందీగా వుంచాడు.

ఔరంగజేబు నమ్మిన బంటు మీర్జాసయ్యద్ బెంగాల్ నుంచి సైన్యంతో దూసుకువస్తున్న చక్రవర్తి రెండవ కొడుకు షుజాతో తలపడ్డాడు. అతనితో పాటు ఔరంగజేబు కొడుకు మహమ్మద్ సుల్తాన్ వున్నాడు. మధ్యలో షుజా శిబిరంలోకి మారాడు మహమ్మద్ సుల్తాన్. మీర్జా సయ్యద్ చేతిలో షుజా ఓడిపోయి పారిపోయాడు. చివరికి అరకాన్ అడవుల్లో దిక్కులేని చావు చచ్చాడు. కన్నతండ్రి అయిన తనకే ఎదురు తిరిగిన కొడుకు మహమ్మద్ సుల్తాన్ని, ఔరంగజేబు క్షమించలేదు. అతన్ని అతని భార్యని చెరసాలలో పడేశాడు.

దారాని హతమారిస్తే కానీ ఢిల్లీ గద్దె మీద తన హక్కు స్ధిరపడదని ఔరంగజేబుకి తెలుసు. అందుకే దారాని కసిగా వేటాడాడు. ఔరంగజేబు కబంధ హస్తాల లోంచి తప్పించుకోవడానికి, దారా కుటుంబం నిలిచిన చోట నిలవకుండా చెట్లు గుట్టలు పట్టిపోయింది.

చివరకి బోలాన్ కనుమల వద్ద వున్న దాదార్ జమీందారు మాలిక్ జీవన్ కోటలో తాత్కాలిక విరామం తీసుకుంది. గతంలో షాజహాను ఆగ్రహానికి గురి అయి మరణ శిక్ష విధించబడ్డ మాలిక్ జీవన్ కి, దారా ప్రాణదానం చేశాడు. ఆ విశ్వాసం చూపిస్తాడని దారా ఆశించాడు. అక్కడ వున్నప్పుడే దారా ప్రియమైన భార్య నాదిర్ భాను తీవ్ర అస్వస్థతతో మరణించింది. భార్య మరణం దారా గుండెను కలిచి వేసింది. దాదాపు పిచ్చివాడయిపోయాడు. అలాంటి స్థితిలో వున్న దారాని ఏ మాత్రం కృతజ్ఞత లేని మాలిక్ జీవన్, పధ్నాలుగేళ్ల కొడుకు సిఫర్ ఝాకోతో పాటు ఔరంగజేబు సైన్యానికి అప్పగించాడు.

దారాని, పసివాడైన సిఫర్ షుకోని అర్ధ నగ్నంగా ఏనుగు మీద ఢిల్లీ వీధుల్లో ఊరేగించాడు ఔరంగజేబు. ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన రాజ్యానికి వారసుడు, షాజహాను చక్రవర్తి ప్రియ పుతృడు అయిన దారా ఒంటి మీద ముతక లాగు మాత్రమే వుంది. బీదలలో అతి బీదలు ధరించే తలపాగ అతని నెత్తి మీద పెట్టారు. అర్ధనగ్నంగా వున్న అతని శరీరం మీద దుమ్ము ధూళి తప్ప ఎలాంటి
ఆభరణాలు లేవు. అతని కాళ్లకి చేతులకి సంకెళ్లు బిగించారు.

తండ్రి తరపున అధికారం చెలాయిస్తున్న ప్పుడు ఏఏ మార్గాలలో దారా తన హెూదాతో లాంఛనాలతో, పటాటోపంతో తిరిగాడో, ఆ మార్గాలలోనే దారాని అతి నికృష్టమైన బందీగా ప్రదర్శించి తన అక్కసు తీర్చుకున్నాడు ఔరంగజేబు.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
దారా శరీరం మనసు రెండూ మొద్దుబారి పోయాయి. కళ్ల ముందు ఏవో తెరలు కమ్ముకున్నాయి. ఏం చూస్తూన్నాడో తెలియకుండా శూన్యంలోకి చూపులు నిలిపి కూచున్నాడు. బాలుడైన సిఫర్ షుకో కూడా ఒక విధమైన అచేతనావస్థ లోకి జారిపోయాడు. తండ్రి కొడుకులను అలాంటి నిస్సహాయ స్థితిలో చూసిన జనం తట్టుకోలేకపోయారు. గుండెలు బాదుకుని ఏడ్చారు. అయినా ఔరంగజేబు కరకు గుండెలు కరగలేదు. ఆ తండ్రి కొడుకులను బలిపశువులను తిప్పినట్టు అన్ని వీధులు తప్పి చివరికి చెరసాలలో పడేశాడు.
📖

అదే సాయంత్రం దారా భవితవ్యం నిర్ణయించడానికి ఔరంగజేబు తన ఆంతరంగికులతో సమావేశమయ్యాడు. దారా తరపున దానిష్ మంద్ ఖాన్ తప్ప మరొకరు నోరు తెరవలేదు. షాయిస్త ఖాన్, మహమ్మద్ అమీన్ ఖాన్, బహద్దూర్ ఖాన్ మొదలయినవారు దారాకి మరణశిక్ష విధించాలన్నారు. దారా లాంటి రాజద్రోహి కి, మతద్రోహికి మరణశిక్ష కూడా చాలా తక్కువేనని రోషనారా ఎలుగెత్తి అరిచింది. ఔరంగజేబు నుంచి నెలసరి జీతాలు అందుకుంటున్న మతపెద్దలు ఫత్వా జారీ చేశారు. ఇస్లాం ధర్మానికి విరుద్ధంగా వ్యవహరించిన దారా, హిందూ యోగి లాల్ దాస్ పాదసేవ చేసిన దారా మరణశిక్షకి అర్హుడని తేల్చి చెప్పారు. శిక్ష తేదిని ఖరారు చేసే విషయం ఔరంగజేబుకే వదిలేసారు.

ఈలోగా ఢిల్లీలో జరిగిన ఒక సంఘటన మతపెద్దల ఫత్వాను వెంటనే అమలులోకి తెచ్చింది. దారాని తనకి అప్పగించిన మాలిక్ జీవన్ కి ఏక్ హజారీ మన్సబీతో పాటు భక్తియార్ ఖాన్ అనే బిరుదును ఔరంగజేబు ప్రదానం చేశాడు. ఆ భక్తియార్ ఖాన్ రాచదర్బారుకి వస్తుండగా ప్రజలు అలజడి చేశారు. అవహేళన చేశారు. ప్రజల ఆగ్రహం వల్ల ఢిల్లీలో కల్లోలం చెలరేగింది. దారా మీద ప్రజలకున్న  ప్రేమ గల్లి గల్లీలో ప్రతిధ్వనించింది.

ఇది చూసి ఔరంగజేబు కసితో రగిలి పోయాడు. దారాని తక్షణం అంతం చేయక పోతే ఈ కల్లోలం అంతటా వ్యాపించే అవకాశం వుందని భయపడ్డాడు. అంతే. నాజర్ బేగ్ అనే బానిస ఆ రాత్రి భావస్ పురా చెరసాలలో ప్రత్యక్షమయ్యాడు. భీకరాకారుడైన నాజర్ బేగ్ ని చూసి తండ్రిని కౌగలించుకున్న సిఫర్ షుకోని నిర్దాక్షిణ్యంగా ఇవతలకి ఈడ్చిపారేశాడు. కత్తి దూసి శృంఖలాబద్ధుడైన దారాని కన్నకొడుకు ఎదుటే కండలు కండలుగా నరికాడు. ఆ దారుణానికి తట్టుకోలేక తెలివి తప్పి పడిపోయి, తండ్రి శరీరం నుంచి కారుతున్న రక్తంతో తడిసిపోతున్న సిఫర్ షుకోని అలాగే వదిలేసి వెళ్లిపోయాడు నాజర్ బేగ్.

దారా శవ శకలాలని ఏనుగు మీద వుంచి అన్ని వీధుల్లోనూ మళ్లీ ఊరేగించాడు ఔరంగజేబు. దారాకి ఏ గతి పట్టిందో చూడమని ప్రజలకి సందేశం ఇచ్చాడు. దారా పట్ల సానుభూతి వున్నవారికి పట్టబోయే గతికి ఆ ఊరేగింపు సంకేతమని చాటి చెప్పాడు. అలా బాల్యం నుంచిదారా మీద తనకున్న కసిని తీర్చుకున్నాడు. ఢిల్లీ పీఠం మీద తన అధికారాన్ని స్థిరపరుచుకున్నాడు.
👳🏽
*సశేషం*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
*కథల ప్రపంచం* 

https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe

*తెలుగు భాషా రక్షతి రక్షితః* 

*ఏడాది చందా 120/-, ఫోన్ పే & గూగుల్ పే నెంబర్ 9849656434*

*1 YEAR* *SUBSCRIPTION 120/-*
*phone pe & Gpay to 9849656434*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂

No comments:

Post a Comment