_`అన్నదాతా సుఖీభవ`_
*కర్ణుడు ఒక్కక్షణం ఆలోచించాడు. తాను బంగారం, వెండి, వజ్రవైడూర్యాలు దానం చేశాడు. అదే గొప్ప అనుకునేవాడు. అన్నం అంటే ఎవరైనా పెడతారు. అదేం గొప్ప. తాను ఇలా విలువైనవి దానం చేయడం వల్లనే దానకర్ణుడనే పేరొచ్చింది అనుకున్నాడు. ఆకలైన వారికి అన్నం పెట్టటం, వారి కడుపును నింపడం ఎంత ముఖ్యమో గ్రహించలేకపోయాడు.*
*మహాభారతం మన ఇతిహాసాల్లో ముఖ్యమైంది. దానిలో విలక్షణమైన పాత్రలు, విశిష్టత కలిగిన పాత్రలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ఒక పాత్రకు సంబంధించి ఒక కథ చెబుతారు. ఇది అన్నదాన మహిమ చెప్పేందుకు ఉద్దేశించినది. కురుక్షేత్ర సంగ్రామం ముగిసింది.*
*యుద్ధంలో మరణించిన వారు తమ తమ పాప పుణ్యాల ఆధారంగా స్వర్గనరకాలను చేరుకున్నారు. వారిలో గొప్ప దానశీలుడిగా పేరున్న కర్ణుడు ఉన్నాడు. అతను స్వర్గానికి పోతూ ఉంటే దారిలో దాహం వేసింది. సమీపంలో ఒక కొలను కనిపించింది. దోసిలిలోకి నీటిని తీసుకునిఆత్రంగా తాగబోయాడు. ఆ నీరు బంగారు ద్రవంగా మారిపోయింది. తాగడానికి పనికిరాకుండా పోయింది. ప్రయత్నించిన ప్రతిసారీ అలాగే జరిగింది. దాహంతో బాటుగా ఆకలిగా కూడా ఉంది. ఎదురుగా ఫలవృక్షం కనిపించింది. చేతికందిన ఓ పండును కోశాడు. అది కూడా బంగారు రంగుకు మారిపోయింది. అయితే ఆకలి బాధ ఎక్కువగా ఉండటంతో ఒక పండును కొరికాడు. పండు రాయిలా ఉంది.*
*కర్ణుడు నిరాశా నిస్పృహలకు గురయ్యాడు. అప్పుడొక అదృశ్యవాణి వినిపించింది. 'కర్ణా నీవు దానశీలిగా పేరొందావు. చేతికి ఎముక లేనట్టుగా దానాలు చేశావు. అయితే నీవు దానాలు వెండి, బంగారం, ధనం రూపంలో చేశావు. కనీసం ఒక్కసారి కూడా అన్నం పెట్టలేదు. ఎవ్వరి ఆకలి తీర్చలేదు. అందువల్ల నీకీ పరిస్థితి కలిగింది అని అశరీరవాణి పలికింది.*
*కర్ణుడు ఒక్క క్షణం ఆలోచించాడు. తాను బంగారం, వెండి, వజ్రవైడూర్యాలు దానం చేశాడు. అదే గొప్ప అనుకునేవాడు. అన్నం అంటే ఎవరైనా పెడతారు. అదేం గొప్ప. తాను ఇలా విలువైనవి దానం చేయడం వల్లనే దానకర్ణుడనే పేరొచ్చింది అనుకున్నాడు. ఆకలైన వారికి అన్నం పెట్టటం, వారి కడుపును నింపడం ఎంత ముఖ్యమో గ్రహించలేకపోయాడు. కాని ఇప్పుడెలా? బతికున్నంతకాలం చేయలేని అన్నదానం ఇప్పుడెలా చేయడం? కర్తవ్యం ఏమిటని ఆలోచించాడు? తన తండ్రి సూర్యనానారాయణుడు గుర్తకొచ్చాడు. సూర్యుని వద్దకు వెళ్లి జరిగినదంతా వివరించాడు. ఎన్నో విధాల ప్రాధేయపడ్డాడు. సూర్యుడు ఇంద్రుని వద్దకు వెళ్లి విన్నవించాడు. ఇంద్రుడు, దేవతలూ ఆలోచించి కర్ణుడు భూలోకం వెళ్లే అవకాశమిచ్చారు. ఆర్తులకు అన్నదానం చేసి రమ్మన్నారు. కర్ణుడు భాద్రద బహుళ పాడ్యమినాడు వెళ్లి అన్న సంతర్పణలు చేసి భాద్రపద అమావాస్యనాడు స్వర్గానికి వెళ్ళాడు. ఈ సమయాన్నే మహాలయ పక్షమని అంటారు. ఎప్పుడైతే కర్ణుడు అన్న సమారాధన చేయించాడో అప్పుడే అతని కడుపు నిండిపోయింది. ఆకలిదప్పులు తీరిపోయాయి. ఆకలితో ఉన్న వాడికి అన్నం పెట్టాలి గాని బంగారాన్ని పెడితే ఏమి ప్రయోజనం. అన్నం పెట్టిన వాడిని అన్నదాత సుఖీభవ అని దీవిస్తారు. అందుకే హిందూ సంప్రదాయం ప్రకారం ఏ పండగవచ్చినా, ఏ శుభ అశుభకార్యాలు జరిగినా అన్నదానాన్ని ఎంతో దీక్షగా సాగిస్తారు.*
No comments:
Post a Comment