*భారం నీదే*
‘ఎన్నిసార్లు నిన్ను పిలవాలి? ఏ రీతి కొలవాలి? అనాథరక్షకుడివని, ఆపద్బాంధవుడివని అంటారే? మరెందుకు నా పిలుపు నిన్ను చేరడం లేదు? నా బాధ నీకెందుకు కనిపించడం లేదు?’... ఇలా మనకు కష్టం వచ్చినప్పుడల్లా దేవుడితో మొరపెట్టుకుంటాం. ఒళ్లంతా కళ్లున్న ఆయనకు మనం కనిపించమనుకోవడం, జగమంత చెవులున్న స్వామికి మన పలుకులు వినిపించలేదనుకోవడం... అవివేకమే!
గజేంద్ర మోక్షం ఘట్టంలో మొసలితో పోరు సాగించలేక దీనావస్థలో పడిన గజరాజు, మకరాన్ని గెలవడం తనవల్ల కాదని నిశ్చయించుకుంది. ‘స్వామీ! బలం క్షీణించింది, ధైర్యం సన్నగిల్లింది, ప్రాణాలు అదుపు తప్పుతున్నాయి, స్పృహ కోల్పోతున్నాను. నువ్వు తప్ప దిక్కెవరు లేరు. నన్ను రక్షించే బాధ్యత నీదే!...’ అని సర్వేశ్వరుణ్ని వేడుకుంది.
అక్కడెక్కడో వైకుంఠపురంలో లక్షీదేవితో వినోదిస్తున్నాడు శ్రీమన్నారాయణుడు. ‘పాహీ! పాహీ!’ అనే ఆర్తనాదం వినిపించగానే గజేంద్రుడి ప్రాణాలు కాపాడాలనే ఆతృతతో ఆయన లక్ష్మీదేవికి ఏమీ చెప్పలేదు; శంఖచక్రాలను చేతుల్లోకి తీసుకోలేదు, సేవకులనెవరినీ పిలవలేదు, గరుడవాహనాన్నీ సిద్ధపరచుకోలేదు, ప్రణయకలహంలో భాగంగా పట్టుకున్న లక్ష్మీదేవి కొంగైనా వదల్లేదు... ఉన్నపళంగా భువికి బయలుదేరాడు. లక్ష్మీదేవితోపాటు సుదర్శన చక్రం కూడా శ్రీహరిని అనుసరించింది. గజరాజు ఉన్న సరోవరాన్ని చేరుతూనే విష్ణుమూర్తి తన చక్రాన్ని విడిచి పెట్టాడు. ఆ సుదర్శనం విస్ఫులింగాలు చిమ్ముతూ మరుక్షణంలో మొసలి తలను ఖండించింది. అప్పుడు గజేంద్రుడు ఊపిరి పీల్చుకుని కొలను నుంచి బయటికి వచ్చి సంతోషంతో తొండం ఎత్తి హరికి నమస్కరించాడు.
కురుసభలో ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు తనను రక్షించేవారి కోసం శోకంతో ఆమె చుట్టూ కలియజూసింది. ఎవరూ ముందుకు రాకపోవడంతో ‘నాకు దిక్కెవరు?’ అనుకున్న సమయంలో కృష్ణుడు ఆమె కళ్ల ముందు సాక్షాత్కరించాడు. వెంటనే ‘ద్వారకావాసా శ్రీకృష్ణా పాహిమాం!’ అని వేడుకుంది. ఆయన కొన్ని ఘడియలు ఆలస్యంగా వచ్చాడు. ‘పిలిచిన వెంటనే పలికే దైవానివి కదా, నా పట్ల ఎందుకు ఆలస్యం చేశావు’ అని ద్రౌపది ప్రశ్నించింది. ‘సోదరీ! నువ్వు ద్వారకావాసా... అని పిలిచావు. అందుకే ద్వారక వెళ్లి మళ్లీ తిరిగి వచ్చేసరికి ఆలస్యమైంది’ అని మనోహరమైన మందహాసంతో జవాబిచ్చాడు నందగోపాలుడు. అప్పుడు ద్రౌపదికి తన పిలుపులోని దూరం అర్థమైంది.
భక్తుల ప్రార్థనలకు సులభంగా కరిగిపోయే భక్తవల్లభుడికి కావాల్సింది ఆడంబరంగా చేసే పూజలు కాదు. నిండు మనసుతో ధ్యాస ఆయన మీద కేంద్రీకరించాలి. ‘పాల ముంచినా నీట ముంచినా నీదే భారం స్వామీ!’ అనుకుని మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించాలి. మనకు ప్రాప్తమనుకున్నది ఆయన అనుగ్రహిస్తాడు. లేదంటే అంతకన్నా మంచిదేదో మనకోసం వేచి ఉన్నదని గ్రహించాలి. ఆ వాస్తవాన్ని జీర్ణం చేసుకుంటేనే సంతృప్తిగా జీవించగలం! కాదని విధిని దూషిస్తుంటే అసంతృప్తి జ్వాలలకు అజ్ఞాన తిమిరం తోడై దహించుకుపోవాల్సి వస్తుంది. ఆర్తితో అంతరాంతరాల్లో ఆయన్నే స్మరిస్తూ ‘సర్వాంతర్యామీ! నువ్వే దిక్కు!’ అనుకుంటే పరమాత్ముడి కరుణాకటాక్షాలు ఏదోనాడు అమృత జల్లుగా వర్షిస్తాయి!
కె.వి.సుమలత
No comments:
Post a Comment