Saturday, November 1, 2025

 కృష్ణునికి తగ్గ కొడుకు…*

*ప్రద్యుమ్నుడు!*

కృష్ణభగవానుడి గొప్పతనం గురించి చెప్పుకొనేదేముంది. బాల్యంలో అల్లరి చేసిన యశోదాకృష్ణుని మొదలుకొని... జీవితసారాన్ని తేల్చిచెప్పిన గీతాకృష్ణుని వరకూ ఆయనలోని ప్రతి అడుగూ హిందువులకు పూజనీయమే!

కృష్ణుని అన్ని పాత్రలలోనూ చూసిన మనకి తండ్రిగా ఆయన గురించి తెలిసింది తక్కువే!

కృష్ణుని కుమారుడైన ప్రద్యుమ్నుని గురించి తెలుసుకుంటే...ఆ లోటూ తీరిపోతుంది.```

**మన్మథుని పునర్జన్మ*```

కృష్ణునికి చాలామంది కుమారులే ఉన్నారు. కానీ వారిలో ప్రద్యుమ్నుడు ముఖ్యుడు.

ఒకనాడు శివుని తపస్సుని భంగం చేయబోయి ఆయన కోపానికి భస్మమైన మన్మథుని కథ తెలిసిందే!

లోకకళ్యాణం కోసం ప్రయత్నించి భస్మమైపోయిన తన భర్తని చూసి రతీదేవి గుండె పగిలిపోయింది. తన భర్తని ఎలాగైనా తిరిగి జీవింప చేయమంటూ పరమేశ్వరుని వేడుకుంది. అప్పటికే కోపం చల్లారిన ఈశ్వరుడు, ఆమె భర్త శ్రీకృష్ణుని ఇంట పుడతాడంటూ వరమిస్తారు.

అలా శ్రీకృష్ణునికీ, రుక్మిణికీ ప్రద్యుమ్నుని రూపంలో జన్మిస్తాడు మన్మథుడు.```

**శంభరాసురుని వధ*```

ప్రద్యుమ్నుడు భూలోకంలో జన్మించే సమయంలో శంభరాసురుడు అనే రాక్షసుడు ప్రజలను పీడించసాగాడు. ఆయనకు ప్రద్యుమ్నుని చేతిలో తప్ప మరెవ్వరి చేతిలోనూ చావు లేదన్న వరం ఒకటి ఉంది. దాంతో చిన్నప్పుడే ప్రద్యుమ్నుని వధించి తనకి శత్రుశేషం లేకుండా చూసుకోవాలనుకున్నాడు శంభరాసురుడు. పొత్తిళ్లలో ఉండగానే ప్రద్యుమ్నుని ఎత్తుకుపోయి సముద్రంలో పడేస్తాడు.

సముద్రంలో పడిన ప్రద్యుమ్నుని ఒక చేప మింగుతుంది. విధివశాత్తూ ఆ చేప శంభరాసురుని రాజ్యంలోని జాలర్లకే చిక్కుతుంది. ఆ భారీ చేపను చూసిన జాలర్లు దానిని శంభరాసురునికి బహుమతిగా అందిస్తారు.

ఆయన వంటవారు దానిని కోసిచూస్తే ఏముంది! చేప పొట్టలో అందమైన బాలుడు కనిపిస్తాడు. రాజాస్థానంలోని ఒక యువతి ఆ బాలుని పెంచి పెద్దచేస్తుంది. ఎలా పెరిగినా, ఎక్కడ పెరిగినా ప్రద్యుమ్నుడు యోధునిలాగే ఎదిగాడు.

ఒకనాడు శంభరాసురుని రాజ్యానికి వచ్చిన నారదుని ద్వారా తన అసలు తండ్రి ఎవరన్న విషయాన్ని తెలుసుకుంటాడు ప్రద్యుమ్నుడు.

తనని చంపతలపెట్టిన శంభరాసురుని మీద పగతీర్చుకునేందుకు బయల్దేరాడు. శంభరాసురునికీ, ప్రద్యుమ్నుడికీ మధ్య జరిగిన భీకర పోరులో ఆ లోకకంటకుడు మరణించాడు.```

**ద్వారకకు చేరి*```

శంభరాసురుని వధ తర్వాత ప్రద్యుమ్నుడు తన తండ్రిని వెతుక్కుంటూ ద్వారకకు చేరుకున్నాడు.

రాజ్యంలోకి అడుగుపెట్టగానే కృష్ణుని పోలిన ఆ యువకుడిని చూసి జనమంతా గుమికూడారు. ఆపై అతను చెప్పిన వివరాలు తెలుసుకున్న రుక్మిణీదేవి... తన పొత్తిళ్లలోంచి కనపడకుండా పోయిన బిడ్డ అతనే అని తెలుసుకుంది. మొత్తానికి ప్రద్యుమ్నుని రాకతో కథ కొంతవరకూ సుఖాంతమయ్యింది.

అసలే గొప్ప వీరుడైన ప్రద్యుమ్నుడు, శ్రీకృష్ణుని తర్ఫీదులో మరింత రాటుదేలాడు. తండ్రికి తగ్గ తనయుడన్న పేరు తెచ్చుకొన్నాడు.```

**నికుంభుని వధ*```

తండ్రికి తోడుగా ప్రద్యుమ్నుడు, కొడుకుని గమనించుకుంటూ కృష్ణుడు ఉండేవారు. అలా వారిద్దరూ కలిసి ఒక రాక్షసుడిని ఎదుర్కొన్న సందర్భం కూడా ఉంది.

నికుంభుడనే రాక్షసుడు పరమ శివభక్తుడు. దేవుని చేతిలో కానీ, దేవతల చేతిలో కానీ, దానవుల చేతిలో కానీ తనకు చావు ఉండకూడదనే వరాన్ని పొందినవాడు. మానవులు తననేమీ చేయలేరన్న అహంతో వారి నుంచి చావు రాకూడదన్న వరాన్ని మాత్రం కోరుకోలేదు నికుంభుడు. అదే అతని పాలిట శాపంగా మారింది.

మానవ జన్మనెత్తిన శ్రీకృష్ణుని చేతిలో అతని చావు మూడింది. భానుమతి అనే యాదవ రాకుమార్తెని ఎత్తుకుపోయే ప్రయత్నంలో నికుంభుడు కృష్ణుని ఎదుర్కొంటాడు. ఒకవైపు కృష్ణుడు, మరోవైపు ప్రద్యుమ్నుడు ఆ రాక్షసుని ఎదిరించి అతన్ని తుదుముట్టిస్తారు.```

**తండ్రిని నొప్పించకుండా*```

కురుక్షేత్ర సంగ్రామంలో యాదవులంతా కౌరవులవైపు, కృష్ణుడు మాత్రం పాండవుల పక్షాన నిలిచిన విషయం తెలిసిందే! కానీ ప్రద్యుమ్నుడు మాత్రం తండ్రికి వ్యతిరేకమైన పక్షంలో ఉండేందుకు ఇష్టపడలేదు.

కురుక్షేత్ర సంగ్రామానికి దూరంగానే ఉన్నాడు. ప్రద్యుమ్నుని శ్రీకృష్ణుని అంశగా భావిస్తారు. పైగా వైష్ణవాస్త్రం అనే అద్భుతమైన అస్త్రం కలిగినవాడు. అలాంటి ప్రద్యుమ్నుడు కురుక్షేత్ర సంగ్రామంలో ఉంటే పోరు ఇంకెంత రసరవత్తంగా ఉండేదో!

ప్రద్యుమ్నుడు తన మేనమామ కూతురైన రుక్మావతిని వివాహం చేసుకున్నాడు. వారిద్దరికీ పుట్టిన అనిరుద్ధుడు కూడా అసమాన్యునిగా పేరుగాంచాడు.

ఇంతలో యాదవులంతా కొట్టుకుని చస్తారనే మునుల శాపం నిజమైంది. ఆ కొట్లాటను ఆపే ప్రయత్నంలో ప్రద్యుమ్నుడు కూడా మరణిస్తాడు.

చిత్రవిచిత్రమైన మలుపులు తిరుగుతూ సాగిన అతని కథ అలా అంతమవుతుంది. కానీ తండ్రికి తగ్గ తనయుడన్న పేరు మాత్రం నిలిచిపోయింది.

No comments:

Post a Comment