Tuesday, November 25, 2025

 *దేహం ఒక రథం*. *ఆత్మ రథ సారథి* .
*ఆత్మయే దైవం* 
--శ్రీ సత్యసాయి బాబా 

ఒక కారు ఉంది, ఇంజను కండిషన్‌లో ఉంది. వీల్స్‌, స్టీరింగ్‌, బ్రేకు, గేర్స్‌ అన్నీ బాగున్నాయి. కొంత దూరం ఆ కారు నడిపి డ్రైవర్‌ దిగి వెళ్లిపోయాడనుకుందాం. కారును అతను ఎక్కడ వదలి వెళ్లాడో అక్కడే ఉంటుంది. అంగుళం కూడా అటూఇటూ కదలదు. ఎందువల్ల? దానిని నడిపే డ్రైవరు దిగిపోయినందువల్ల. అట్లే మానవదేహం కూడా. ఈదేహం ఆ కారువంటిదైతే, దీనిని కదిలించే చైతన్యం డ్రైవరు వంటివాడు. చైతన్యం శరీరం నుంచి వెడలిపోతే డ్రైవరు కారు దిగిపోయినట్లే. అయితే ప్రాకృతికంగా కారులో మరో డ్రైవరు ఎక్కి నడిపించవచ్చు. కాని భగవంతుడిచ్చిన ఈ దేహంలో మరో డ్రైవరు ఆ స్థానాన్ని ఆక్రమించ వీలులేదు. ఆత్మ, దైవశక్తి లేక చైతన్యము ఉన్నంత వరకే మనదేహానికి విలువ. ఆ తదుపరి అంతకన్న పనికిరాని వస్తువు మరొకటిలేదు.

మన కళ్లు చూస్తున్నాయి, నోరు మాట్లాడుతున్నది, కాళ్లూచేతులు చలనాత్మకంగా ఉన్నాయి. చెవులు వింటున్నాయి, మనస్సు  ఆలోచనలను రేకెత్తిస్తున్నది. ఈ పనులన్నింటినీ మన దేహమే చేస్తున్నదనుకుంటాం. కానీ, కాదు దేహంలో గల చైతన్య శక్తి శరీరావయవాలచే, అంగాలచే, ఇంద్రియాలచే ఆ విధంగా పని చేయిస్తున్నది. దేహం నుండి ఆ చైతన్యం వెళ్లిపోయిన మరుక్షణం చలనశీలమైన దేహం నేలకూలుతుంది. చలనరహితమవుతుంది. దేహంలోని ఏ అవయవమూ పనిచేయదు. అప్పటి వరకు ‘ఫలానా’ వారు అని పిలువబడిన, గౌరవింపబడిన దేహం ‘ఫలానా’ వారి పార్థివ దేహమవుతుంది. శవంగా మారుతుంది. అంత్యక్రియలకు సిద్దం అవుతుంది. శాశ్వతంగా ఈ లోకంనుండి కనుమరుగవుతుంది. ఆ క్షణం వరకు శరీరాన్ని లోనుండి పనిచేయించిన చైతన్యమే భగవంతుడు. 

*దేహం ఒక రథం*
*ఆత్మ రథ సారథి*

ఆ చైతన్యాన్నే ‘ఆత్మ’ అని కూడా అంటాం.

*‘ఆత్మానాం రథినం విద్ధి,* *శరీరం రథమేవ తు’  అంటుంది కఠోపనిషత్‌*.
 
ఈ ధర్మసూక్ష్మాన్ని అవగాహన చేసుకొని గాఢంగా విశ్వసించగల్గితే దేవుని దర్శనార్థం అక్కడకు ఇక్కడకు పోనవసరం లేదు. గుళ్లు గోపురాలకు ప్రాధాన్యతనివ్వాల్సిన అవసరం అంతగా ఉండదు. ఈ భావన స్థిరపడినపుడు ఎవరూ మనకు పరాయి వారు కాదు. అందరూ దైవస్వరూపులే. మానవదేహం కదలాడే దేవాలయం వంటిది. ప్రతి దేవాలయంలో దైవ ప్రతిమ ప్రతిష్ఠింపబడి ఉన్నట్లుగా, ప్రతీ దేహంలో చైతన్య స్వరూపంగా ఆత్మతత్వం వ్యాపించియుంటుంది. అందుకే ఎవరిని గౌరవించినా, ఆదరించినా భగవంతుని గౌరవించినట్లే. ఎవరిని కించపరచినా, కష్టపెట్టినా, నష్టపెట్టినా భగవంతునికి అపరాధం గావించినట్లే. ఒక్క మానవ దేహంలో మాత్రమేగాదు... ఈ భూమిపై ఉన్న 84లక్షల జీవరాశుల్లోను భగవత్‌ చైతన్యం తొణికిసలాడుతూ ఉంటుంది. ఒక చిన్న చీమను పరిశీలించండి. ఏదో పెద్దపని ఉన్నట్లు అటూ ఇటూ హడావుడిగా తిరుగుతుంటుంది. ఆ చిన్న చీమలోనున్న ఆ కదలాడే శక్తి ఆత్మతత్వమే.
 
‘ *దేవుడెక్కడనుచు దేవులాడగనేల*
*దేవుడుండు తనదు దేహమందె, దేవుడే తానయ్యు*
*దేవుని వెదకుట, తన్నుతా వెదకునట్లుగాదె!*
 *పలుకుచున్నమాట సత్యసాయి మాట.* 

కాబట్టి మనలో ఉన్న ఆత్మ అనే  దేవుడిని తెలుసుకోవడానికి ధ్యాన సాధన చేయాలి. 
*నేను ఎవ్వరు?*  అని ప్రతిఒక్కరూ తెలుసుకోవాలని *రమణ మహర్షి* చెప్పేవారు. 
 *నిన్ను నీవు తెలుసుకున్నపుడు అంతా నీకు అర్థం అవుతుంది అని రమణ మహర్షి భోధించేవారు*. 

*అహం బ్రహ్మాస్మి* అంటే నేను  దేవుడిని. 
*తత్వమసి*  అంటే నువ్వు కూడా  దేవుడివే. 
*సర్వం ఖల్విదం బ్రహ్మ*. అంటే మన అందరిలోనూ, అన్ని జీవుల్లోనూ దేవుడు ఉన్నాడు.
ఇదే *వేదాలు* మరియు *ఉపనిషత్తులు సారాంశం*.
యోగులు యోగ ద్రుష్టి తో చెప్పినవి కూడా ఇదే.

     భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు తన దగ్గరకు వచ్చిన భక్తులనూ బంగారూ! అని పిలిచేవారు. బాబా ఒకసారి చెప్పారు "నేను నాలో ఉన్న దివ్యత్వాన్ని  తెలుసుకొని బంగారాన్ని అయ్యాను. నువ్వు ఎప్పుడో ఒకసారి నీలో ఉన్న దివ్యత్వాన్ని  తెలుసుకొని బంగారం అవుతావు బంగారూ!"
అందుకే సత్యసాయి బాబా వారు స్పీచ్చ్ మొదలు పెట్టెటపుడు దివ్యాత్మస్వరూపులారా, 
 ప్రేమస్వరూపులారా అని చెప్పేవారు. అందరూ దేవుని స్వరూపాలే అని చెప్పేవారు.

 🧘‍♂ధ్యానవాహిని🧘‍♂
 సత్యసాయి బాబవారు స్వయంగా రచించిన "ధ్యానవాహిని" అనే పుస్తకం లో ధ్యానం అంటే  శ్వాస మీద ధ్యాస అని, మనలో ఉన్న దివ్యత్వాన్ని ధ్యానసాథన ద్వారా తెలుసుకుంటాం అని చెప్పారు. సోహం సోహం అంటే   
ఆ దివ్యత్వాన్ని నేను( I am that). ప్రతిఒక్కరూ నేను ఎవ్వరు (Who am i)అని 
ప్రశ్న వేసుకోవవాలని  మీలో ఉన్న దివ్యత్వాన్ని  తెలుసుకోవాలని చెప్పారు. 
ధ్యానం ద్వారా మనలో ఉన్న ఆత్మజ్యోతిని దర్శించాలని ఆత్మజ్యోతియే చైతన్యజ్యోతి  అని చెప్పారు.
     ఆత్మ సత్యం. ఆత్మ నిత్యం. ఆత్మయో దైవం.
ఆత్మ ఎప్పుడూ ఒక జ్యోతి లా ఎప్పుడూ ప్రకాశిస్తూ వెలుగుతూ ఉంటుంది.
అందుకే సత్యసాయి బాబా వారు ఒక మ్యూజియం కి
 "చైతన్యజ్యోతి" అని  పేరు పెట్టారు. 
🌳సత్యసాయి బాబా వారు ఒక గుట్ట మీద  మెడిటేషన్ ట్రీ (Meditation Tree) అని పెట్టి
ధ్యానం చేయించేవారు. ఇప్పటకి మెడిటేషన్ ట్రీ  పుట్టపర్తి లో ఉంది.

No comments:

Post a Comment