Tuesday, November 25, 2025

 @ ఔషధం - విషం @

ఆరోగ్యం 
చాలా చవకంట 

వైద్యమేమో 
చాలా ఖరీదంట 

కోరి కోరీ అనారోగ్యం 
కొన్ని తెచ్చుకుంటారట జనం 

ఒక వైద్యుడు 
చెప్పాడు నిజం నిజం

*******

సమతౌల్య పౌష్టికాహారం 
తినడం ఆరోగ్యం 

అసమతౌల్య జంక్ ఫుడ్ 
తినడం అనారోగ్యం 

కాయగూరలు
ఆకు కూరలూ దుంపలూ 
జొన్నలు సజ్జలూ చిరుధాన్యాలు 
గుడ్లూ చేపలూ తాజా మాంసం
తిననే తినరు జనం

పిజ్జాలూ బర్గర్లు 
నూడిల్సూ మేగీలూ లేసూ 
సన్న బియ్యమూ గోధుమలూ మైదా
నిలువ చేసీ నిలవ నూనెతో చేసిన హోటల్ ఫుడ్డూ
ప్రియాతి ప్రియం జనానికి

*********

పరిశుభ్రమైన జలం 
అమృతం

రసాయనాల ఉదకం
విషం 

నీరూ బార్లీ
లేత కొబ్బరి పానీయం 
తాజా తాజా పండ్ల రసాలూ
ఏవగించుకుంటారు జనం 

కోలా పెప్సీ కోకూ 
బీరూ జిన్నూ రమ్మూ 
కాపు సారా.. కాస్ట్లీ ఆల్కహాల్ 
నిలవేసి ఈస్టు కలిపి పులియబెట్టిన వైనూ 
నాలుక తడిపేసుకుంటారు ఖర్మం

********

తగినంత 
వ్యాయామమూ

మరి తగినంత 
విశ్రాంతీ నిద్రా

మరి ఇంకొంత 
వినోదమూ మానవీయ బంధాలూ 

సంజీవనులు 
తెలుసా మనిషికి 

*******

ఆట లేదు
పాట లేదు
తోటివారితో మాట లేదు

యోగ లేదు
ప్రాణ యామం లేదు 
స్నేహం ప్రేమా తలపే లేదు

నిద్ర లేదు
ధ్యానం అసలే లేదు
ఆత్మీయ బంధాల ఆశే లేదు

నడక లేదు 
చక్కని నడత లేదు 
హృదిలో తృప్తి లేదు లేదు

********

ఖరీదు పెట్టీ 
కొని తెచ్చుకుంటారు 
మరీ రుగ్మతా రోగం శారీరక అనారోగ్యం 

స్వార్థంతో చేతులు 
సాచి మరీ ఆహ్వానిస్తారు
ఒత్తిడి ఆందోళణ అసంతృప్తి మానసిక జాడ్యం

నిజమే... నిజమే సుమా
ఆరోగ్యం చవకా ... అనారోగ్యమేమో ఖరీదూ
అన్న ఆయన మాట

- రత్నాజేయ్ (పెద్దాపురం)

No comments:

Post a Comment