*ఇది సీతాఫలం కాదు మనశరీరానికిబలం*
*ఆపిల్‌లా నోరూరించే రంగూ లేదు. మధురమైన మామిడిపండు రుచీ కాదు. అంతదూరం నుంచి ఆ వాసన వస్తేనే తినాలనిపించే పనసపండు అసలే కాదు. పోనీ తొక్క ఒలుచుకునే శ్రమ లేకుండా జామపండులా కొరికి తినగలిగే సౌలభ్యం ఉందా అంటే అదీ లేదు....*
*అయితేనేం...*
*తియ్యని దాని గుజ్జు మాత్రం అమృతాన్నే తలపిస్తుంది. అందుకే అదంటే అందరికీ అంతిష్టం. 'అరిస్టోక్రాట్ ఆఫ్ ఫ్రూట్స్'గా పేరొందిన దానిపేరే సీతాఫలం... ఓ కొండఫలం...!*
*'పచ్చనిమేడ... తెల్లని గదులు... నల్లని దొరలు... చెప్పకోండి చూద్దాం...' అంటే పిల్లలు కూడా ఠక్కున చెప్పేస్తారు. ఎందుకంటే ఒలుచుకుని తినడం కష్టమైనా ఆ రుచిని ఇష్టపడని వాళ్లు అరుదే.*
*రాళ్లల్లో రప్పల్లో ఎక్కడంటే అక్కడ సులభంగా పెరిగినప్పటికీ సీతాఫలంలో శరీరానికి అవసరమయ్యే ప్రొటీన్లూ పీచూ ఖనిజాలూ విటమిన్లూ పిండిపదార్థాలూ కొద్దిపాళ్లలో కొవ్వులూ అన్ని పోషకాలూ దొరుకుతాయి. కారణాలేమయినా ఈ పండు దొరికినన్నాళ్లూ చాలామంది దీన్ని ఆహారంలో భాగంగా చేసుకుంటారు. పల్లెల్లో అయితే లేవడం ఆలస్యం... పండిన పండ్లన్నీ ముందుగా ఏరుకుని వాటిని ఆస్వాదించడమే పనిగా పెట్టుకుంటారు.*
*సీతాఫలం గుజ్జు రక్తంలో హీమోగ్లోబిన్ శాతాన్ని బాగా పెంచుతుందట. అందుకే దీన్ని ఇరవయ్యొకటో శతాబ్దపు సూపర్ ఫ్రూట్‌గానూ అభివర్ణిస్తున్నారు.*
*ఈ పండు సీతాఫలం(అనోనా స్క్వామోజా) పేరు వినగానే ఇదంటే సీతమ్మకి చాలా ఇష్టం... అందుకే దానికాపేరు అని మనవాళ్లు చెప్తారు.*
*ఇదే జాతికి చెందిన మరికొన్ని రకాలున్నాయి. వాటినే రామాఫలమనీ (అనోనా రెటిక్యులేటా), హనుమాన్ (అనోనా చెర్మోయా) ఫలమనీ లక్ష్మణ (అనోనా మురిక్యులేటా) ఫలమనీ పిలుస్తున్నారు. ఈ పేర్లన్నీ ఎవరు ఎందుకు పెట్టారో తెలియదుకానీ అవి అంతర్జాతీయంగానూ ప్రాచుర్యం పొందడం విశేషం. ఇటీవలే సీతాపలం, హనుమాన్ ఫలాలను సంకరీకరించి అట్మోయా అనే మరో హైబ్రిడ్ పండునీ రూపొందించారు.*
*సీతాఫలంతో పోలిస్తే మిగిలిన వాటిల్లో గింజలు తక్కువ.* *అయినప్పటికీ మనదగ్గర తియ్యని సీతాఫలం వాడుకే ఎక్కువ. తియ్యని ఆ రుచి వల్లే దీన్ని షుగర్ ఆపిల్ అనీ పిలుస్తారు. ఈ జాతి పండ్లన్నీ కూడా ఔషధఫలాలే.*
*మన ఆయుర్వేదవైద్యంతోబాటు స్థానిక దక్షిణ అమెరికన్లు సైతం ఈ చెట్ల భాగాలన్నింటినీ కూడా మందుల తయారీలో వాడేవారు. దానికితోడు ఇటీవల ఈ చెట్లన్నింటిలో క్యాన్సర్‌ను నివారించే గుణాలున్నాయని గుర్తించారు.*
*ఈ పండ్లన్నింటినీ నేరుగా తినడంతోబాటు స్వీట్లూ, డెజర్ట్‌లూ, పుడ్డింగుల్లోనూ వాడుతుంటారు. ప్రత్యేక వంటలు కూడా చేస్తుంటారు. కేకులూ కుకీలూ వండేస్తున్నారు. సీతాఫలం గుజ్జుని ఎండబెట్టి ఫ్లేక్స్, పొడి... వంటివి కూడా తయారుచేస్తున్నారు. అందుకే ఒకప్పడు కొండల్లో మాత్రమే పెరిగే సీతాఫలాల్లో మేలైన వంగడాలను రూపొందించి మరీ ప్రత్యేకంగా సాగుచేస్తున్నారు. మేమత్, బ్రిటిష్ గయానా, లేట్ గోల్డ్, జెఫ్నర్, హిలరీ వైట్... వంటి విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న వాటితోబాటు; మహబూబ్‌నగర్, బాలానగర్, షహరాన్‌పూర్, కాకర్లపహాడ్... ఇలా తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి చేసిన మేలుజాతి వంగడాలన్నీ కూడా తియ్యని గుజ్జుతో నోరూరిస్తుంటాయి.*
*అయితే ఎన్ని రకాలున్నా అనంతపురంలోని దుర్గం సీతాఫలం రుచికి మరేదీ సాటి రాదనేవాళ్లూ ఉన్నారు. ఈ పండ్లే కాదు, సీతాఫల్ ఐస్‌క్రీమ్ దొరికే కాలం కూడా ఇదే. తక్కువ వెన్న ఉన్న క్రీమూ, సీతాఫలాల గుజ్జుతో చేసే ఐస్‌క్రీమ్‌కి చిరునామా భాగ్యనగరమే.ఇప్పుడిప్పుడు కొన్ని బ్రాండెడ్ కంపెనీలు రకరకాల పండ్లతోనూ ఐస్‌క్రీములు తయారుచేస్తున్నాయి. వాటిల్లో ఇదీ ఒకటి. అయితే బ్రాండేదయినా సీతాఫల్ ఐస్‌క్రీమ్‌ను రుచి చూడగలిగేది మాత్రం ఈ ఒక్క సీజన్‌లోనే మరి.*
*పండంటి పాపాయికోసం...*
*మధురమైన సీతాఫలంలో పోషకాలూ ఎక్కువే. ఈ జాతికి చెందిన ఇతర ఫలాలన్నింటిలోనూ ఆయా పోషకాలన్నీ ఉంటాయి. దీన్ని మెక్సికన్లూ దక్షిణ అమెరికన్లూ పూర్వకాలం నుంచీ కూడా జ్వరం, పొట్టనొప్పి, బీపీ... ఇలా అనేక వాధ్యుల నివారణలో ఔషధఫలంగా వాడుతున్నారు. అంతేకాదు, కొన్ని ప్రాంతాల్లో దీన్ని ఉడికించీ తింటారు. ఎందుకంటే పచ్చిగా ఉన్నప్పుడు దీనిలో ఔషధవిలువలు మరింత ఎక్కువని చెబుతారు.*
*వంద గ్రా. సీతాఫలంలో 94 క్యాలరీలు వస్తాయి. ఆపిల్(56), జామ(49), మామిడి(70), బొప్పాయి(32)... వంటి పండ్లతో పోలిస్తే ఇందులో క్యాలరీలు ఎక్కువ. కాబట్టి తక్కువ బరువుతో బాధపడేవాళ్లు ఆరోగ్యంగా బరువు పెరగొచ్చు. నీరసంగా ఉన్నప్పుడు ఓ సీతాఫలం తింటే వెంటనే శక్తిమంతంగా అనిపిస్తుంది.*
*వీటిల్లో అధికంగా ఉండే విటమిన్-సి సహజ యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తూ రోగనిరోధకశక్తిని పెంపొందిస్తుంది. కణజాల బలహీనతనీ, ఆస్తమానూ తగ్గిస్తుందట.*
*ఈ పండులో ఉండే ఆల్కలాయిడ్లూ ఎసిటోజెనిన్‌లు క్యాన్సర్ సంబంధిత, మూత్రపిండాల వ్యాధులు రాకుండా కాపాడతాయి.*
*వీటిల్లోని పీచు కాలేయ, పేగు వ్యాధుల నుంచి కాపాడుతుంది. జీర్ణక్రియకి ఎంతో మంచిది.*
*సీతాఫలాల్లో అధికంగా ఉండే బి-విటమిన్, మెదడులో విడుదలయ్యే గాబా న్యూరాన్ అనే రసాయనాన్ని తగ్గిస్తుందట. ఫలితంగా ఒత్తిడీ, డిప్రెషన్, చికాకూ వంటివి తగ్గుతాయి.*
*ఈ పండ్లలో అధికంగా ఉండే ఐరన్ రక్తహీనతని తగ్గిస్తుంది.*
*వీటిల్లోని రిబోఫ్లేవిన్, విటమిన్-సిలు కంటిచూపునీ మెరుగుపరుస్తాయి. ఇవి గర్భస్థ శిశువు చర్మం, కళ్లు, జుట్టు పెరుగుదలకూ తోడ్పడతాయి. ఈ పండుని పటికబెల్లంతో కలిపి తింటే పాలిచ్చే తల్లులకు పాలు బాగా పడతాయి.*
*మెగ్నీషియం, కాల్షియంలు ఎముకపుష్టిని పెంచుతాయి. ఆర్థ్రయిటిస్‌ను తగ్గిస్తాయి. పొటాషియం బీపీని తగ్గిస్తుంది.*
*ఇందులోని నియాసిన్ చెడు కొలెస్ట్రాల్ తగ్గేందుకూ తోడ్పడుతుంది.*
*అన్నింటికన్నా ఇందులో అధికంగా ఉండే కాపర్, థైరాక్సిన్ హార్మోన్ ఉత్పత్తికి ఎంతో అవసరం. ఇది జుట్టు తెల్లబడకుండా కాపాడుతుంది. గర్బిణులకూ కాపర్ ఎంతో అవసరం. నెలలు నిండకుండా ప్రసవించడాన్ని తగ్గిస్తుంది.*
*అవకాడో, జామ, బొప్పాయిల్లో ఎక్కువగా ఉండే ఫొలేట్ (బి-9) విటమిన్ సీతాఫలంలోనూ ఎక్కువే. అందుకే గర్భిణులకు ఈ పండు ఎంతో మంచిది. వేవిళ్లతో బాధపడేవాళ్లకు వికారాన్నీ తగ్గిస్తుంది.*
*ఇందులోని ఎసిటోజెనిన్ రసాయనాలు చర్మ క్యాన్సర్ల నుంచీ రక్షిస్తాయి. ఈ పండ్లు దొరికినన్నాళ్లూ రోజూ తినడంవల్ల శరీరం ముడుతలు పడకుండా ఉండటంతో పాటు కాంతివంతంగా మెరుస్తుంది.*
*చూశారుగా మరి... ఎన్ని ఉపయోగాలో... 'సీతాఫలాల సీజన్ ఎప్పడూ ఉంటే ఎంత బాగుంటుందో' అని మీకూ అనిపిస్తోంది కదా..?*
No comments:
Post a Comment