*మనసులో పరిశుభ్రత (నిర్మలత్వం) ఉంటేనే ఈశ్వరుని అనుగ్రహం మనకు లభిస్తుంది అనే సత్యాన్ని, ఈ శ్లోకం ద్వారా నీలకంఠ దీక్షితులు శ్రీ శివోత్కర్ష మంజరిలో వివరిస్తున్నారు.*
శ్లోకం
అర్చామీతి ధియా యదేవ కుసుమం క్షిప్త్వా జనో ముచ్యతే
విధ్యామీతి ధియా తదేవ వికిరన్ భస్మీకృతో మన్మథః |
ఇత్యాభ్యంతరవృత్తిమాత్రరసికో బాహ్యానపేక్షశ్చ యః
స స్వామీ మమ దైవతం తదితరో నామ్నాపి నామ్నాయతే ॥
తాత్పర్యం
ఈశ్వరుడు కేవలం బాహ్య ఆడంబరాలనూ, కర్మకాండలనూ పట్టించుకోడు. ఆయన నిజమైన భక్తి భావనకే ప్రాధాన్యత ఇస్తాడు.
ఒక సాధారణ భక్తుడు, తాను శివుడిని పూజిస్తున్నాను అనే స్వచ్ఛమైన భావనతో, కేవలం ఒక పుష్పాన్ని సమర్పించినా, శివుడు దానిని ఎంతో గొప్పగా స్వీకరించి, అతనికి మోక్ష సామ్రాజ్యాన్ని ప్రసాదిస్తాడు.
కానీ, అదే పుష్పాన్ని, నేను శివుడి తపస్సును భగ్నం చేయగలను అనే అహంకారంతో, కపటమైన మనస్సుతో మన్మథుడు వేసినప్పుడు, శివుడు అతనిని మరుక్షణమే బూడిద చేశాడు.
పువ్వు ఒకటే అయినా, భక్తునికి మోక్షం, మన్మథునికి భస్మం అనే విభిన్న ఫలితాలు లభించాయి. దీనికి కారణం – వారి అంతరంగంలోని భావన (సంకల్పం) మాత్రమే.
నిజమైన భక్తి మనస్సులో ఉండాలి, అప్పుడే ఈశ్వరుని అనుగ్రహం లభిస్తుంది. అహంకారం, కపటం, మరియు బాహ్య ఆర్భాటం మాత్రమే ఉంటే, అది విపరీత ఫలితాలకే దారితీస్తుంది.
వివరణ
నిజమైన భక్తినే భగవంతుడు అంగీకరిస్తాడు. కళ్ళూ, మనస్సూ ఆయనపై నిలపకుండా, కేవలం నోటితో స్తోత్రం చేసి, చేతితో అర్చన చేస్తే, ఆయన దానిని స్వీకరించరు.
నిండు మనస్సుతో, భక్తితో భక్తుడు చేసే చిన్న సేవను కూడా గొప్పగా భావించి, అతనికి అత్యున్నత ఫలాన్ని ఇస్తాడు.
ఇదే అభిప్రాయాన్ని, శ్రీ అప్పయ్య దీక్షితులవారు తమ ఆత్మార్పణ స్తుతి శ్లోకంలో:
"అర్క ద్రోణ ప్రభృతి కుసుమైః అర్చనంతే విధేయం,
ప్రాప్యం తేన స్మరహర ఫలం మోక్ష సామ్రాజ్య లక్ష్మీః"
అని చెప్పారు.ఆదిత్యయోగీ.
మరియు శ్రీ కృష్ణ భగవానుడు గీతలో ఇలా పలికారు:
"పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్ఛతి।
తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః ।।"
(పవిత్రమైన మనస్సు కలవాడు ఎవడైతే భక్తితో నాకు ఆకు, పుష్పం, పండు, నీరు సమర్పిస్తాడో, అట్టి భక్తితో అర్పించబడిన దానిని నేను స్వీకరిస్తాను.)
"నేను ఏమీ తెలియనివాడిని. నా వల్ల అయ్యేది ఏమీ లేదు. అంతా వల్ల కాగల ఆ పరమేశ్వరుడే నాకు శరణు," అని హృదయం కరిగి ఒక్క పుష్పాన్ని సమర్పించినా చాలు, అతనికి మోక్ష సామ్రాజ్యాన్ని ఇచ్చినా, అది తన భక్తునికి తాను చేసిన దానికి సరిపోదని ఈశ్వరుడు భావిస్తారట.
దీని గురించి శ్రీ నీలకంఠ దీక్షితులవారు తమ నీలకంఠ విజయ కావ్యంలో ఇలా అంటారు:
"దేవానామపి దుర్లభం పదమిదం లబ్ధం మయోపాయతః ద్విత్ర్యైర్బిల్వదలైః ప్రతార్య శివమిత్యేవం జనో మన్యతే। మద్భక్తాంఘ్రి రజస్స్పృశోऽపి సులభం క్షుద్రం పదం వేధసో దత్త్వా సేవక ఏవ వంచిత ఇతి స్వామిన్ భవాన్మన్యతే।।"
(శివుడిని రెండు మూడు బిల్వపత్రాలతో మోసం చేసి, దేవతలకు కూడా అందని ఈ పదవిని నేను పొందాను అని లోకులు అనుకుంటారు. కానీ, నా భక్తుల పాద ధూళిని తాకిన వారికి కూడా సులభంగా లభించే బ్రహ్మ పదవిని ఇచ్చి, సేవకుడినే మోసం చేశానని స్వామీ, నీవు భావిస్తావు.)
కానీ, లోపల కపటం మరియు అహంకారం ఉంచుకొని, "నా శక్తిని చూడండి. కఠోర తపస్సులో ఉన్న పినాకపాణి అయిన శివుని మనస్సులో కూడా చలనాన్ని కలిగిస్తాను" అని ఆయనపై పుష్పబాణాన్ని వేసిన మన్మథుడి గతి ఏమైంది? మరుక్షణమే కాలి బూడిద అయ్యాడు.
మన్మథుడు కూడా ఆయనపై వేసింది పుష్పమే. కానీ, పొందిన ఫలితమో విపరీతమైనది. కారణం లోపల కలిగిన భావన (సంకల్పం) మాత్రమే.
అందువలన, నిజమైన భక్తి హృదయంలో ఉండాలి. బయటి ఆడంబరాల వల్ల ఈశ్వరుని అనుగ్రహాన్ని పొందలేము. మనస్సులో కపటం ఉంటే, విపరీతమైన ఫలితమే లభిస్తుంది..*.
No comments:
Post a Comment