Monday, November 3, 2025

*****స్త్రీ స్వతంత్రత ఒక సత్యం, ఒక శాపం

 *స్త్రీ స్వతంత్రత  ఒక సత్యం, ఒక శాపం*

*స్త్రీలో అందం నచ్చినట్లుగా వ్యక్తిత్వం నచ్చదు  చాలామంది పురుషులకు.*

*ఆమె మాటలలో అర్థం,* *ఆలోచనలలో ఆత్మ ఉంటే అతనికి అది సవాలుగా అనిపిస్తుంది.*
*ఇది స్త్రీకి ఒకరకంగా శాపం లాంటిదే.*

*ఎందుకంటే*

*స్త్రీలో కేవలం అందం మాత్రమే గుర్తించే పురుషుడు,*
*ఆమె తనపై ఆధారపడాలని, తన మాటే చివరి నిర్ణయమని అనుకోవడం సహజంగా భావిస్తాడు.*

*తాను ఆమెను రక్షిస్తున్నానని, పోషిస్తున్నానని ఓ ఆత్మవంచన లో జీవిస్తాడు.*

*అది ప్రేమ కాదు*
*ఆధిపత్యం అనే మాయలో మమకారం.*

 *“నా నీడలోనే నువ్వు ఉండాలి” అంటాడు,*
*కానీ ఆ నీడలో ఆమె స్వరం క్రమంగా మాయమవుతుంది...”*

*అలా, తన మాటల్లో “జాగ్రత్త”, “ఆప్యాయం” అనిపించినా,*
*అదే జాగ్రత్త ఆమె చుట్టూ ఒక గోడగా మారుతుంది.*
*ప్రపంచం నుండి ఆమెను క్రమంగా దూరం చేస్తూ*
*తాను చేసే నియంత్రణను ప్రేమగా పిలుస్తాడు అతను.*

*కానీ అదే సమయంలో,ఎవరికీ ఇబ్బంది కలిగించకుండా, తన జీవితాన్ని తానే చూసుకునే స్త్రీ ఒకరుంటే*
*ఆమెపై “అహంకారం ఎక్కువ”, “ప్రవర్తన తగదు” వంటి నిందలు వేయడానికి చాలా మంది పురుషులు సిద్ధంగా ఉంటారు.*

*కారణం ఒక్కటే*
*ఆమె తనపై ఆధారపడడం లేదు.అది ఆయనకు ప్రేమ నష్టం కాదు, పౌరుషానికి ఎదురైన గాయం.*

*“ఆమె నవ్వు అతనికి సవాలు,*
*ఆమె నిశ్శబ్దం అతనికి అవమానం,*
*ఆమె స్వతంత్రత — అతనికి భయం.”*

*ఇది ఒక వ్యక్తి సమస్య కాదు* 
*ఇది మన సమాజం మదిలో* *బలంగా కూరుకుపోయిన అధికార భావం.*

*స్త్రీ తన నిర్ణయాలు తానే తీసుకుంటే?*
*“అది తగదు” అంటారు,*
*కానీ అదే పని పురుషుడు చేస్తే* 
*“స్వతంత్రుడు” అని ప్రశంసిస్తారు.*

*చిత్రమేమిటంటే,*
*ఇలాంటి స్త్రీపై సాటి స్త్రీలలో కూడా*
*మంచి అభిప్రాయం ఉండదు.*

*ఆమె జీవితం గురించి పూర్తిగా తెలియకపోయినా,*
*మాట్లాడాల్సిన సందర్భం వచ్చినప్పుడు,*
*చెడుగా, తేలికగా మాట్లాడే తత్వం*
*ప్రత్యేకించి మధ్య తరగతి మహిళల్లో కనిపిస్తుంది.*

*ఇది “సమాజ కట్టుబాట్ల పట్ల భక్తి” కాదు,*
*ఇది అసూయ అనే నిశ్శబ్ద వ్యాధి.*

*ఎందుకంటే*

*“తాము గడుపుతున్న విధంగా కాకుండా ఆమె తన జీవితాన్ని తనే నిర్ణయించుకుంటుంది” అనే భావం వారికి భరించలేనిది.*

*“ఆమె గమనం తాము దాటలేనిదని తెలుసుకున్నప్పుడు,*
*తాము నడిచే దారినే పవిత్రం అని చెప్పడం సులభం అవుతుంది.”*

*సమాజం స్త్రీకి ఇచ్చిన గౌరవం మాటల్లో ఉంటుంది,*
*కానీ ఆమె స్వతంత్రత పట్ల గౌరవం మనసుల్లో ఉండదు.*

*స్త్రీ బలంగా నిలబడినప్పుడు,*
*ఆమెని “బలవంతురాలు” అని కాదు, “బలహీనుల్ని అవమానించిందని” అంటారు.*

*అసలు స్త్రీకి కావలసింది రక్షణ కాదు,*
*గౌరవం.*

*ఆమె మాటకు విలువ, ఆమె నిర్ణయానికి గౌరవం 
ఇవి లభిస్తే, సమాజం నిజంగా అభివృద్ధి చెందుతుంది.*

 *“ఆమె తన కోసం కాదు,*
*తన తర్వాత వచ్చే ప్రతి స్త్రీ కోసం పోరాడుతుంది.”*

*♡ ప్రేమించు — గౌరవించు — కలిసి ఉండు ♡*

No comments:

Post a Comment