8️⃣6️⃣
*🛕🔔భగవద్గీత🔔🛕*
_(సరళమైన తెలుగులో)_
*మూడవ అధ్యాయము*
*కర్మయోగము.*
*40. ఇంద్రియాణి మనోబుద్ధిరస్యాధిష్ఠానముచ్యతేl*
*ఏతైర్విమోహయత్యేష జ్ఞానమావృత్య దేహినమ్ll*
ఈ కామము (అంటే చూచినది, విన్నది, తాకినది, రుచి చూసిన ప్రతిదీ కావాలి అనే తత్త్వము) మానవుని దేహములో ఉన్న ఇంద్రియములను, మనస్సును, బుద్ధిని ఆశ్రయించుకొని ఉంటుంది. మానవునిలో ఉన్న మనో, బుద్ధి, ఇంద్రియాలు, తనలో చెలరేగిన కామాలను అన్నిటినీ తీర్చడానికి శతథా ప్రయత్నం చేస్తుంటాయి. అప్పుడు లోపల ఉన్న ఆత్మజ్ఞానము కప్పబడి పోతుంది. అప్పుడు మానవుడు తీవ్రమైన మోహంలో పడిపోతాడు.
ఈ సన్నివేశాన్ని కృష్ణుడు యుద్ధ సన్నివేశంతో పోల్చాడు. ఎందుకంటే అర్జునుడు యుద్ధభూమిలో ఉన్నాడు. ఆయనకు అటువంటి ఉదాహరణ ఇస్తే కానీ అర్థం కాదని యుద్ధము అని అర్థం వచ్చేటట్టు చెబుతున్నాడు. ఒక రాజును జయించాలంటే ముందు వాడి కోటను వశపరచుకోవాలి. దానికి కోట చుట్టు స్థావరాలు ఏర్పరచుకోవాలి. ఈ కామము కూడా ఆత్మను జయించడానికి ముందు స్థావరాలు ఏర్పరచుకుంటుంది. ఆ స్థావరాలు ఏవంటే ఇంద్రియములు, మనస్సు, బుద్ధి. వీటన్నిటికీ లీడర్ అహంకారము. కామము ఎల్లప్పుడూ వీటిని ఆశ్రయించుకొని ఉంటుంది. ఈ కామము ముందు ఇంద్రియములను ఉసిగొలుపుతుంది. ప్రపంచంలో ఉన్న విషయాలను చూడటం, వినడం, తాకడం, వాసన చూడటం చేస్తుంది. అవన్నీ నాకు కావాలనే కోరిక కలుగజేస్తుంది. లోపల ఉన్న మనసు ఈ విషయాలను, అవి కావాలి అనే కోరికలను అన్నిటినీ రికార్డుచేస్తుంది. అలా చేస్తూనే ఉంటుంది. మనం తీరికగా కూర్చున్నపుడు, ధ్యానంలో కూర్చున్నపుడు, ఆ రికార్డు ప్లేచేస్తుంది.
(మనం దేవుడి ముందు కూర్చుని కళ్లు మూసుకున్నప్పుడు ప్రపంచంలో విషయాలు అన్నీ గుర్తురావడానికి ఇదే కారణం).
అప్పుడే మనకు అన్నికోరికలు గుర్తుకు వస్తాయి. మనసు, శరీరము, విషయాలను కావాలి అని కోరుకుంటున్నపుడు బుద్ధి కూడా వాటికి వంతపాడుతుంది. ఇప్పుడు మనకు ఒక అనుమానం వస్తుంది. బుద్ధి మంచిది కదండీ మరి బుద్ధి కామానికి ఎందుకు వంత పాడుతుంది అని మీరు అనవచ్చు. బుద్ధి నిర్మలంగా ఉంటుంది. శాస్త్రములు చదివి, గురువును ఆశ్రయించి, మంచి విషయాలను నేర్చుకొని ఉంటే, బుద్ధి తన పని తాను చేస్తుంది. ఇది మంచిది కాదు అని చెబుతుంది. అదే బుద్ధిని చిన్నప్పటి నుండి కోరికలతో, చెడు సహవాసాలతో, చెడ్డ తలంపులతో నింపితే, ఆ బుద్ధి కూడా తన పని తానుచేయడం మానేసి, విచక్షణా శక్తిని కోల్పోయి, మనసుకు ఇంద్రియాలకు వంతపాడుతుంది.
ఈ ప్రకారంగా, కామము ఈ మూడింటినీ వశపరచుకొని, లోపల ఉన్న ఆత్మస్వరూపాన్ని ముట్టడిస్తుంది, అంటే కప్పుతుంది. ఆత్మ ఎప్పుడైతే కప్పబడిపోయిందో, ఇంక కామం విజృంభిస్తుంది. మనస్సును బుద్ధిని తీవ్రమైన మోహంలో పడేస్తుంది. విమోహయతి అంటే మోహంలో పడేయడం. కామము ఇంద్రియములను, మనోబుద్ధులను వశపరచుకొని, వాటిని మోహపరవశులను చేస్తుంది. ఆ మోహంలో పడ్డవాడు ఓ పట్టాన బయటకు రాలేడు. ఆ ప్రకారంగా మోహము జీవుని వశం చేసుకొని వాడిని పడగొట్టేస్తుంది. తనకు దాసునిగా చేసుకుంటుంది.
మరి ఈ శత్రువును ఎలా జయించాలి అంటే ముందు శత్రువు ఏర్పరచుకున్న ఆశ్రయాలను (స్థావరాలను) వశపరచుకోవాలి. మనోబుద్ధిఇంద్రియములను ఆశ్రయించుకున్న మోహమును నాశనం చెయ్యాలంటే దాని వశంలో ఉన్న మనస్సును, ఇంద్రియములను మన స్వాధీనంలోకి తెచ్చుకోవాలి. దానినే మనో నిగ్రహము ఇంద్రియ నిగ్రహము అంటారు. అప్పుడు బుద్ధి కూడా మనవైపు వస్తుంది. అప్పుడు కామమునకు నిలువ నీడ ఉండదు. దానంతట అది పారిపోతుంది. కామాన్ని జయించి నిరంతర ఆనందం పొందడానికి ఇదే తరుణోపాయము. ఈ విషయాన్నే తరువాతి శ్లోకాలలో చెప్పాడు పరమాత్మ.
(సశేషం)
*🌹యోగక్షేమం వాహామ్యహం 🌹*
(రచన: శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం, రిటైర్డ్ రిజిస్ట్రార్, ఏ. పి. హైకోర్టు.)
P209
No comments:
Post a Comment