22-11-2025
""ఊరక సజ్జనుం డొదిగి యుండిన నైన దురాత్మకుండు ని,
ష్కారణ మోర్వలేక యపకారము చేయుట వాని విద్యగా,
చీరలు నూరు టంకములు చేసెడివైనను బెట్టె నుండగా,
జేరి చినింగి పోగురుకు "చిమ్మట" కేమి ఫలంబు భాస్కరా!""
సత్పురుషులు మౌనముగా యున్ననూ దుర్మార్గులు అకారణముగనో,అసూయతోనో, స్వార్థముతోనో ఆ సత్పవర్తన కలిగినవారికి తెలిసో తెలియకో ""అపకారము"" చేయుట అదేదో గొప్ప విద్య అనుకుంటారు. ఏ విధముగానంటే ఒక్కొక్కటి నూరు నాణెములు ఖరీదు చేసే చీరలు ఒక పెట్టేలో యుండగా(చిమ్మటలు) ""చెదపురుగులు" చేరి వాటికేమి లాభము లేకున్ననూ ఆ చీరలు కొరికి నాశనము చేసాయి. ఈ విధముగ దుర్జనుని చర్యలు కూడ చివరికి నాశనానికి దారితీస్తాయని "మారన వెంకయ్య"" గారు తమ భాస్కర శతకములో మనలోని ""దుర్మార్గపు ఆలోచనలే ""చీరలు పాడుచేసే చెదపురుగులని మనలని హెచ్చరిస్తున్నాడు.
సనాతనభారతీయ సంస్కృతిని మరచి మనలో చాలా మంది చెదపురుగు పాత్రలని పోషిస్తున్నారు.
నేటి మన కుటుంబవ్యవస్థ ఈ చెడు పాత్రలవలననే మసకబారుతున్నది. ఉదాహరణకి అత్త మామలకి కోడలంటే వెగటు.కారణాలు ఒకొక్కరికి ఒకలా యుండవుకదా! అనేక కారణాలు.కట్నం ఎక్కువ తేలేదని, అమ్మాయి అందంగ లేదని, పాపకి వంటరాదని, కోడలికి సాంప్రదాయాలు తెలియవని,ఎడ్డిమోడ్డి మృగమని, మొగుడిని సరిగా చూసుకోదని ఇలా కారణాలు చూపిస్తు కోడలిని దూరము చేసుకోవడమో లేక విడాకులకోసము న్యాయస్థానాలకి వెళ్లాలనుకోవడమో ఆలోచిస్తుంటారు. దీనికి తోడుగ చుట్టాలైనవారు కాని వారు అత్త మామలను కొంతమంది, కోడళ్లని కొంతమంది సమర్థిస్తారు.ఈ సలహాలు ఇచ్చే వారికి చెదపురుగులు వలే వారికి వచ్చే లాభము లేదు నష్టము లేదు.నష్టమల్లా కొడుకుకి కోడలికి కొండొకచో అత్తమామలకే కదా.సరిగా ఈ సమయములోనే అత్తమామలు కొడుకు జీవితములోనో కోడళ్లు తమ సంసారాలలోనో చెదపురుగు పాత్రలో ప్రవేశించి కుసంస్కారాలను పోషిస్తారు. తప్పు అందరిలో ఉంటుంది.రెండు చేతులు కలవందే చప్పుడు రాదనే స్పృహ ఈ చెదపురుగులు తెలుసుకొన లేక ఒకరిపై మరియొకరు నిందలు వేసుకొని సనాతన భారతీయతను మరిచి తమ జీవితాలని మసకబర్చుకుంటు తమ కొడుకు కోడళ్ల జీవితాలని అందరిలో చులకన చేస్తుంటారు.
రామాయణములో పిడకల వేటలా ఈ సుదీర్ఘమైన హితవు ఏమిటండీ అనుకోవద్దు. రామాయణములోనే అయోధ్యకాండములో కైకేయి మాత మదిలో ఈ చెదపురుగు దూరింది. తాను తన కొడుకును మహారాజు ని చేయాలనే తలంపు.ఇక్కడ ఆమెలో ఈ చెదపురుగు చేరటానికి కారణము మంథర యనే అరణపు దాసి.కారణాలు అనేకము. వరాల నెపముతో న్యాయస్థానానికి (దశరథుని వద్దకు) వెళ్లింది.తీర్పు ఎప్పుడు సాక్ష్యాల బట్టే ఉంటుందికదా! కైకేయి గెల్చింది.కానీ భరతుని జీవితము ఏమైనది. కొడుకు సింహాసనము అదీష్టింవచకపోగా అన్నగారి పాదుకలను పూజిస్తు నారవస్త్రాలతో పదునాలుగు సంవత్సరాలు గడిపాడు. కైకేయి రాజమాతగా అందలాలు ఎక్కిందా అంటే తన మాంగల్యము కోల్పోయి వైథవ్యము అనుభవించింది.ఒక జీవితములో పది పద్నాలుగు సంవత్సరాలంటే చాలా విలువైన కాలము. దశరథుని పుత్రులకు యవ్వనకాలము వృథాగ గడిచిపోయింది
కనుక రామాయణములోని ఈ చెదపురుగులు మదిలో చేరిన పాత్రలని గమనించుకుంటు భార్యాభర్తలలో మనస్ఫర్థలు ఉంటే పెద్ద మనసుతో పెద్దలు, పిన్నలు తమలో తప్పులుంటే సరిచేసుకొని పిన్నలు సమస్యలను పరిష్కరిస్తు అహంభావము అసూయ స్వార్థము త్యజించి తమ తమ జీవితాలని సక్రమమైన బాటలో నడిపించుకోవాలనే రామాయణ హితవు గమనించుకొని మన నడవడికలను మార్పు చేసుకోవాలి.
(ఒక పత్రికలో ప్రచురణ ఈ రోజు చూచాను. ఒక కుటుంబము ఈ కోడలు వద్దని కోర్ట్ కి వెళ్లింది. అత్త మామలు కోడలిపై వ్యతిరేకముగ అనేక సాక్ష్యాలు చెప్పారట.కేసు ఆరు సంవత్సరాలు నడిచింది.అత్త మామలు కేసు గెలిచారు. మరునాడు కొడుకు ఉరి వేసుకొని చనిపోయాడు. నాలుగు రోజుల తర్వాత కోడలు బీహార్లోని ఒక నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఎవరివి తప్పులో ఎవ్వరు నిర్ణయించలేరు. వీళ్లందరు రామాయణము చదవకనే తమ జీవితాలకి చరమగీతము పాడుకున్నారని తలస్తు మనసు కలత చెంది ఈ సుదీర్ఘమైన వ్యాసము మీ ముందుంచుతున్నాను)
జై శ్రీరామ్ జై జై శ్రీరామ్.
Sri KPS Sarma Garu.🌞🙏
No comments:
Post a Comment