Thursday, November 20, 2025

 ధ్యానం చేయాలంటే మనసు నిలబడాలి. మనసు నిలబడాలంటే ధ్యానం మీద శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ కలగాలంటే లక్ష్యం మీద గురి ఉండాలి.

సాధించాలనే పట్టుదల, గురి లేకుండా ఎన్నాళ్లు ధ్యానం చేసినా ఫలితం మాత్రం శూన్యం. గురి ఉంది. చేయాలనే సంకల్పం ఉంది. కానీ మనసు మాట వినడం లేదు. కూర్చోగానే వివిధ రకాల ఆలోచనలతో అనేక సన్నివేశాలు కళ్ళముందు కదలాడుతున్నాయి అని అనేకమంది బాధ..

మనస్సు కుదరాలంటే ఒకటే మార్గం.
సత్సంగం, సద్గురువుల బోధలు.. నిత్యం వినాలి. మనంచేసుకుంటూ ఉండాలి. సత్పురుషుల సాంగత్యం చేయాలి. ఆలయానికి వెళ్ళి ప్రశాంతంగా ఒంటరిగా కూర్చొని ఆలోచనల పరంపరలు పక్కన పెట్టి ధ్యానం మీద దృష్టి పెట్టాలి. ఇలా క్రమంగా చేయగా చేయగా మనసు నెమ్మదించి ధ్యానం మీద నిలకడ వస్తుంది.. 

అనుకోగానే ఏది రాదు. క్రమంగా సాధించుకోవాలి. ఇంట్లో ఉంటే కుదరడం లేదు. ఎప్పుడు ఏదో సమస్య వస్తుంది. గొడవలు, అశాంతి గా ఉంది. ఎక్కడికైనా దూరంగా వెళ్ళి ఒంటరిగా ఉంటాను అనుకుంటే తప్పులో కాలేసినట్లే..

ఎక్కడికి వెళ్లినా ఎవరో ఒకరితో సంబంధ బాంధవ్యాలు నేరపాల్సిందే తప్పదు. ఉదయం లేచిన దగ్గర నుండి పడుకునే వరకు నిత్యం ఏదో ఒక అవసరం ఉంటూనే ఉంటుంది. ఎక్కడికి వెళ్లినా మరో మనిషి అవసరం తప్పనిసరి. కొత్తవారిని కలుపుకుంటూ వారిని పరిచయం చేసుకుంటూ అభిప్రాయాలు కలిసి కలవక ఇబ్బంది పడేకంటే.... 

ఉన్నచోట ఉంటూ ఉన్నవారికి ఇబ్బంది కలగకుండా, నీకు ఇబ్బంది లేకుండా, సమస్యలను నీకై నువ్వే పరిష్కరిస్తూ, ఏ సమస్య రాకుండా చూసుకుని, ప్రతి ఒక్కరి దగ్గర సర్దుకుపోతూ నీ లక్ష్యం ఏదో దానిని క్రమం తప్పకుండా ఆచరిస్తుంటే క్రమక్రమంగా పరిస్థితులు, మనసు అనుకూలంగా మారి నీలక్ష్యం వైపు నడిపిస్తాయి..

మనిషైనా, అనారోగుమైనా, వస్తువైనా వచ్చింది ఏది శాశ్వతంగా ఉండదు. ఓపిక పడితే ఉండాల్సినవే ఉంటాయి. పోయేవి పోతాయి. సహనం ముఖ్యం.
ఇక్కడ ఏది శాశ్వతం కాదు. చిన్ననాటి నుండి ఎన్నో ఇష్టపడ్డాం. ఇష్టాలు మారిపోయాయి. ఇష్టపడినవి పోయాయి. వస్తువులు, మనుషులు, జంతువులు, చెట్టు చేమలు, కళ్ళముందు ఎన్ని మారిపోలేదు. ఈరోజు ఉన్నది రేపు ఉండదు అనే స్పృహ నిరంతరం మదిలో మెదులుతూ ఉంటే మనసు ఎక్కడికి పరిగెత్తదు...

No comments:

Post a Comment