Wednesday, November 26, 2025

 దేవతల వరప్రసాదాల కేంద్రం- 'మార్గశిర' ప్రత్యేకత ఇదే!
మనకున్న పండుగలు, వ్రతాలు, పూజలకు చాలా లోతైన అర్థం, పరమార్థం ఉంది.  ఇవేవో మనం గుడ్డిగా పాటిస్తున్నవి కానేకావు.  సీజనల్ గా, ఆరోగ్యపరంగా, వాతావరణం పరంగా, ప్రకృతి పరంగా..ఆధ్యాత్మిక పరంగా మనకు పండుగలు వస్తాయి.  కొన్ని నెలల్లో .. తెల్లారే స్నానం చేయాలని.. ఉపవాసం ఉండాలని చెప్పటంలో.. ఆరోగ్య కారణాలు కూడా ఉన్నాయనే విషయం మీకు తెలుసా? మన తెలుగు నెలల్లో.. కార్తీక మాసం, మాఘమాసం, శ్రావణ మాసం, ధనుర్మాసానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది.  ఈనెలల్లో ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఎక్కువ కాబట్టి.. ఇవి శ్రేష్టమైన నెలలుగా పాటిస్తాం.  అంతేకాదు.. సిస్టమ్యాటిక్ గా.. డిసిప్లైన్డ్ గా ఈనెలలో మనం గడపాలి.  ఇలా లైఫ్ స్టైల్ ఛేంజెస్ ఈ నాలుగు నెలల్లో చేసుకోవటంవల్ల.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు వస్తాయి.  ఎందుకంటే.. ఈ నెలల్లో .. వాతావరణాన్నిబట్టి.. ఏం తినాలి.. ఏంతినగూడదని పెద్దలు కచ్ఛితంగా చెబుతారు.  ఇలా చేస్తే.. మీకు కొత్త జబ్బులు రావు..ఉన్న దీర్ఘకాలిక వ్యాధులు మిమ్మల్ని పెద్దగా బాధపెట్టవు.
తెలుగు పంచాంగం ప్రకారం మొత్తం 12 నెలలు ఉన్నప్పటికినీ, అందులో కొన్ని మాసాలు భగవంతుని ఆరాధనకు విశేషమైనవి. పరమ పవిత్రమైన కార్తిక మాసం పూర్తి చేసుకొని, మార్గశిర మాసంలోకి అడుగు పెట్టిన సందర్భంగా, మార్గశిర మాస విశిష్టతను తెలుసుకుందాం. 
'మాసానాం మార్గశీర్షోహం' అన్నారు శ్రీకృష్ణ పరమాత్మ. అంటే మార్గశిర మాసం ఏడాదిలో వచ్చే అన్ని మాసాలకు శిరసు వంటిది అని అర్ధం. మార్గశిర మాసం లక్ష్మీనారాయణ స్వరూపమని పురాణాలు చెబుతున్నాయి. ఈ మాసంలో ప్రతిరోజూ శుభప్రదమైనదే! మార్గశిర మాసం విశిష్టత .
లక్ష్మీ నారాయణుల ఆరాధనకు ప్రధానమైన మార్గశిర మాసం శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనదని శాస్త్రం చెబుతోంది. ఎందరో మహా పురుషులు ఈ మాసంలో జన్మించి ఈ మాసానికి మరింత ప్రత్యేకతను చేకూర్చారు. జ్ఞాన స్వరూపుడు దత్తాత్రేయుడు, పార్వతీదేవి మరో అవతారం అన్నపూర్ణాదేవి, కాశి క్షేత్ర పాలకుడు కాలభైరవుడు మొదలగు మహానుభావులు ఈ మాసంలోనే అవతరించారు. అలాగే ఆధ్యాత్మిక గురువులైన రమణ మహర్షి, నృసింహ సరస్వతి, పరాశరుడు, మాణిక్ ప్రభువు, శ్రీ సుందర చైతన్యానంద స్వామి, గురు గోవింద్ సింగ్ వంటి గొప్ప గురువులు జన్మించిన కారణంగా మార్గశిర మాసం మరింత విశిష్టత పొందింది. అలాగే హిందూ సంప్రదాయానికి ప్రతీకగా నిలిచే భగవద్గీత పుట్టింది కూడా ఈ మాసంలోనే! ఈ మాసంలో ఎవరైతే శ్రీకృష్ణుని వద్ద ఆవునేతితో దీపాన్ని వెలిగించి, భగవద్గీత పారాయణ చేస్తారో వారికి విష్ణు కటాక్షం లభిస్తుందని విష్ణు పురాణం చెప్తుంది. శ్రీ మహా విష్ణువుకి ప్రీతికరమైన ఈ మాసంలో విష్ణు సహస్రనామ పఠనం అనంతకోటి పుణ్య ఫలాన్నిస్తుందని శాస్త్రవచనం. ఇక హనుమ ఆరాధించే హనుమద్వ్రతం, మత్స్యద్వాదశి, వైకుంఠ ఏకాదశి కూడా ఈ మాసంలోనే జరుపుకుంటారు. అలాగే నడిచే దైవంగా పేరుగాంచిన కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహా స్వామివారి ఆరాధన కూడా ఈ మాసంలోనే జరుగుతుంది.
ఈ నెలలోనే సూర్యుడు ధనురాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ కాలమంతా ధనుర్మాసంగా భావిస్తారు. వైష్ణవులకు ధనుర్మాసం అత్యంత ముఖ్యమైన సందర్భం. వైష్ణవాలయాలను దర్శించేందుకు, నారాయణుడిని అర్చించుకునేందుకు, ఈ మాసం ప్రధానమైనది. సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించగానే ధనుర్మాసం ఏర్పడుతుంది. ఇక్కడ నుంచి మకర సంక్రాతి వరకు నెల రోజులపాటు తిరుమల శ్రీవారి ఆలయం నుంచి సమస్త వైష్ణవ ఆలయాల్లో తిరుప్పావై ఘనంగా జరుగుతుంది. ఈ జగత్తులోని అన్నింట్లో తాను ప్రకటితమైనప్పటికీ కొన్నింట్లో తన స్వరూపం స్పష్టంగా తెలుస్తుందనీ, అలాంటి కొన్నింట్లో ఈ మాసం కూడా తన స్వరూపమేననీ చెబుతాడు కృష్ణుడు. దక్షిణాయనానికి చివర, ఉత్తరాయనానికి ముందుండే ధనుర్మాసం ఆరంభం అయ్యేది కూడా ఈ మాసంలోనే. ధనుర్మాసం అంటే దివ్య ప్రార్థనకు అనువైన మాసం అని అర్థం. సూర్యుడు ధనుస్సు నుంచి మకర రాశిలోకి ప్రవేశించే వరకూ అంటే... భోగి వరకూ ఈ ధనుర్మాసం కొనసాగుతుంది. ఈ మాసంలో ఆండాళ్‌ పూజ, తిరుప్పావై పఠనం, గోదా కల్యాణం మొదలైనవాటికి అధిక ప్రాధాన్యం ఉంటుంది. ఈ కాలంలో తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాతానికి బదులుగా తిరుప్పావై పఠనం చేస్తారు. ఈ నెలలో సాధారణంగా విష్ణు ఆలయాల్లో స్వామికి అర్చన చేసి ఆ ప్రసాదాన్ని పిల్లలకు ప్రత్యేకంగా పంచుతారు. అలా పంచడాన్ని బాలభోగం అంటారు. కొందరు వైష్ణవులు మార్గశిర పౌర్ణమి తర్వాత వచ్చే పాడ్యమి నుంచి ధనుర్మాస వ్రతాన్ని చేసుకోవడం ఓ సంప్రదాయమే. సూర్యుడు ధనూరాశిలోకి ప్రవేశిస్తాడు కాబట్టి ఈనెలను ధనుర్మాసం అంటారు.  సంక్రాంతి అంటే మకర సంక్రమణ జరిగేవరకు ధనుర్మాసం ఉంటుంది.  ధనుర్మాసం ఎందుకు నిష్ఠగా, మనస్ఫూర్తిగా చేయాలి ఇదే కదా మీ డౌట్.  ధనూరాశికి అధిపతి.. బృహస్పతి.  బృహస్పతి అంటే మీకు తెలుసు కదా.. దేవతల గురువు.. ఈయన అత్యంత జ్ఞానవంతుడు.  కాబట్టి ధనుర్మాసం ఆచరిస్తే.. మీరుకూడా జ్ఞానవంతులు అవుతారు.  అంతేకాదు.. విష్ణుమూర్తిని పూజిస్తే.. ఐశ్వర్యవంతులూ అవుతారని పురాణాల్లో ఉంది. 
శివయ్యకు ఓ చెంబు నీళ్లు వేసి..ఓం నమఃశ్సివాయ అంటే సంతృప్తి చెందుతాడు.  కానీ విష్ణువు అలాకాదు.. ఆయన అలంకార ప్రియుడు. బంగారు మొదలు.. నవరత్నాలు, పూలు, పరిమళ సుగంధాలు, పట్టు పీతాంబరాలు..ఇలా మీరు ఎంత అలంకారం చేస్తే అంత ఆనందిస్తాడు విష్ణువు.  
ఇక ఈనెల్లో మీరు వెంకటేశ్వరస్వామి గుడికి వెళ్తే.. ఎన్ని వెరైటీల ప్రసాదం ఇస్తారో.  వీటికి కూడా చాలా ప్రత్యేకత ఉందనే విషయం మీకు తెలుసా.  పొగమంచు కురిసే నెల కాబట్టి.. చలి, జ్వరం, దగ్గు, జలుబు చాలా సహజంగానే అందరికీ వస్తుంది.  కానీ విష్ణు ఆలయాల్లో ఇచ్చే ప్రసాదాలు వేడిగా స్వీట్ పొంగల్, హాట్ పొంగల్, పెరుగన్నం ఇస్తారు.  వీటిలో ఔషధ గుణాలన్నీ ఉంటాయి.  అంటే వాత,కఫ, పైత్య, శ్లేష దోషాలన్నీ పోగొట్టే మెడిసినల్ వాల్యూస్ ఉన్న నెయ్యి, మిరియాలు, పసుపు, పెరుగు, పచ్చకర్పూరం లాంటివన్నీ వేసి చేసిన ప్రసాదం..ఆరోగ్యానికి మంచిది కూడా.  అంటే సీజనల్ వ్యాధులు పోగొట్టేలా ఈ ప్రసాదాలు మంచి చేస్తాయన్నమాట. ఈ సీజనల్ గుమ్మడికాయలు ఎక్కువ పండుతాయి. కాబట్టి.. గుమ్మడి కాయతో రకరకాల వంటలు చేసి.. నైవేద్యంగా పెడతారు. గుమ్మడి కాయ తింటే వజ్రకాయం వస్తుందని  ఆయుర్వేదం చెబుతుంది.  కాబట్టి..ధనుర్మాసంలో మార్కెట్ ను ముంచెత్తే గుమ్మడికాయతో మీకు నచ్చిన వెరైటీలన్నీ తినండి. ఆరోగ్యంగా ఉండండి.

No comments:

Post a Comment