1️⃣1️⃣1️⃣
*🛕🔔భగవద్గీత🔔🛕*
_(సరళమైన తెలుగులో)_
*4. జ్ఞాన యోగము.*
(నాలుగవ అధ్యాయము)
*25. దైవమేవాపరే యజ్ఞం యోగినః పర్యుపాసతేl*
*బ్రహ్మాగ్నావపరే యజ్ఞం యజ్ఞేనైవోపజుహ్వతిll*
కొంత మంది దైవ యజ్ఞము చేస్తారు. దైవ యజ్ఞము అంటే దేవతలను పూజించడం, ఆరాధించడం, దేవతలను ఉపాసించడం, ధ్యానం చేయడం, వివిధ వస్తువులను కైంకర్యం చేయడం, దేవతలను ప్రార్థించడం మొదలగు కార్యములన్నీ దైవయజ్ఞాలే. కాకపోతే ఇవన్నీ భక్తితో శ్రద్ధతో, కర్తృత్వభావము విడిచిపెట్టి, ఫలాపేక్ష లేకుండా, భగవంతుని పరంగా కర్తవ్య నిష్టతో చేయాలి. వీరినే కర్మయోగులు, భక్తియోగులు అని అనవచ్చు. ఇంక రెండవ యజ్ఞం పేరు బ్రహ్మ యజ్ఞము. దీనినే జ్ఞాన యజ్ఞము అని కూడా అంటారు. ధ్యానంలో కూర్చోవడం, మనస్సును బుద్ధిని ఆత్మయందు నిలపడం. తానే బ్రహ్మగా భావించడం, చివరకు బ్రహ్మలో ఐక్యం కావడం. నిరంతరం బ్రహ్మను గురించి ఆలోచిస్తూ, విచారిస్తూ, మనస్సు బుద్ధి పవిత్రంగా ఉంచుకుంటే, తుదకు బ్రహ్మగా మారిపోవడం సులభమే. అప్పుడు మనోబుద్ధిఅహంకారాలకు ప్రతిరూపమైన చిత్తము పరమాత్మవైపు మళ్లుతుంది. చిత్తము పరమాత్మలో లీనం అవుతుంది. దానినే మోక్షమార్గము అంటారు. నిరంతరం పరమాత్మను గురించి ధ్యానిస్తూ ఆలోచిస్తూ పరమాత్మ గురించి మాట్లాడుకుంటుంటే మనస్సు బుద్ధి ప్రాపంచిక విషయముల నుండి పరమాత్మ వైపుకు మళ్లుతుంది. చిత్తము సాత్వికంగా మారి పోతుంది. దుష్ట ఆలోచనలు మనసులోకి రావు.
మనం ఏ వస్తువు అగ్నిలో వేసినా అది అగ్నిరూపాన్ని పొందుతుంది. ఒక ఇనప గుండు వేసినా అది కాలి ఎర్రగా అగ్నిగోళం మాదిరి అవుతుంది. అదే ప్రకారము మనము ప్రాపంచిక విషయములలో మునిగి ఉన్న మనసును, అహంకారమును, పరమాత్మ వైపు మళ్లించి పరమాత్మ అనే అగ్నిలో హోమం చేస్తే, ప్రాపంచిక విషయములు, పూర్వజన్మ వాసనలు అన్నీ కూడా ఆ అగ్నిలో పడి, తమ అస్తిత్వాన్ని కోల్పోయి, పరమాత్మ స్వరూపంగా మారిపోతాయి. సూక్ష్మంగా చెప్పాలంటే మనస్సును, బుద్ధిని ఆత్మలో లీనం చేయడం, దానినే బ్రహ్మయజ్ఞము లేక జ్ఞానయజ్ఞము అని అంటారు. భక్తితో, శ్రద్ధతో, ఏకాగ్రతతో, వేదాలను, శాస్త్రములను చదవడం, అధ్యయనం చేయడం, అర్ధం చేసుకోవడం, జ్ఞానం సంపాదించడం, ఆ జ్ఞానాన్ని ఆచరించడం, తాను ఆర్జించిన జ్ఞానాన్ని పదిమందికీ పంచడం, ఇవన్నీ కలిపితే జ్ఞాన యజ్ఞము అవుతుంది. గీతా జ్ఞాన యజ్ఞము ఇలాంటిదే. ఈ జ్ఞానయజ్ఞము అన్ని యజ్ఞములకు మూలము, జ్ఞానమే మోక్షమునకు సాక్షాత్ సాధనము. మిగిలినవి అన్నీ జ్ఞానము పొందడానికి ఉపకరించే సాధనాలే.
అందరికీ ఈ జ్ఞానయజ్ఞము చేయడం కుదరదు కాబట్టి, ప్రాధమికంగా దైవయజ్ఞము చేస్తారు. దైవ యజ్ఞము అంటే ఒక అర్చనామూర్తిని ఎదురుగా పెట్టుకొని, పూజించడం, అర్చించడం, ఉపచారాలు చేయడం, నివేదనలు సమర్పించడం, హారతులు ఇవ్వడం ఇలాంటివి. దీని వలన ముందు భగవంతుని మీద భక్తి, శ్రద్ధ నిష్ఠ కలుగుతాయి. క్రమక్రమంగా చిత్తము ప్రాపంచిక విషయముల నుండి వెనక్కు మళ్లి పరమాత్మవైపుకు తిరుగుతుంది. కాబట్టి, ఈ దైవయజ్ఞముతో ప్రారంభించి, క్రమక్రమంగా జ్ఞానము సంపాదించి, బ్రహ్మయజ్ఞము వైపు మళ్లడం సాధకుని కర్తవ్యం.
(ఈ రోజుల్లో కూడా చాలామంది యజ్ఞాలు చేస్తున్నారు. నిత్యాగ్నిహోత్రము అంటే సిగిరెట్టు వెలిగించడం. మరీ కొంత మంది ఒక సిగరెట్టు అయిపోతూ ఉంటే దానితోనే మరొక సిగిరెట్టు వెలిగించుకుంటారు. పరిశుభ్రమైన ప్రాణవాయువుతో నింపవలసిన తమ ఊపిరితిత్తులను పొగతో నింపుతారు. మరి కొంత మంది ప్రాణాగ్నిహోత్రయజ్ఞం చేస్తారు. అంటే వేళాపాళా లేకుండా తింటూ ఉంటారు. కడుపులో ఉన్న జఠరాగ్నిలో ఏదో ఒకపదార్థము (చిరుతిళ్లు, పిజ్జా, బర్గర్, చిప్స్, కూల్డ్రింకులు, మత్తుపానీయాలు) నిరంతరం హెూమం చేస్తుంటారు. వీటిని ప్రాణాంతక యజ్ఞములు అని అనుకోవచ్చు. ఎందుకంటే ఇవి జీర్ణ శక్తిని నాశనం చేసి, శరీరాన్ని మనసును కలుషితం చేసి ప్రాణాంతకంగా పరిణమిస్తాయి.
(సశేషం)
*🌹యోగక్షేమం వాహామ్యహం 🌹*
(రచన: శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం, రిటైర్డ్ రిజిస్ట్రార్, ఏ. పి. హైకోర్టు.)
P261
No comments:
Post a Comment