#పల్లె_పిలుస్తోంది
నేను ఈ సంక్రాంతికి మా ఊరికి ఇద్దరిని పరిచయం చేసాను. మా వాడి స్నేహితుడు కార్తికేయ, వాళ్ళ అమ్మ..
మా అపార్ట్మెంట్లో వీళ్ళ పరిచయం నాకు చాలా ప్రత్యేకం. ఎందుకంటే మొదటిసారి ఇలాంటి వారు కూడా ఉంటారు అని తెలుసుకున్నాను. వాడికి కానీ, కనీసం వాళ్ళ అమ్మకి కానీ పల్లెటూరు అంటే తెలియదు. ఒక్కసారి కూడా ఊరు వెళ్ళలేదు, చూడలేదు.
కార్తికేయకి అపార్ట్మెంట్ నాలుగు గోడలే ప్రపంచం. అమ్మమ్మ, నాన్నమ్మ, బంధువులు మొత్తం మహా నగరాల్లో, విదేశాల్లో స్థిరపడినవాళ్ళు..సెలవుల్లో అందరు పిల్లలు ఊరు వెళ్తుంటే వాడు మాత్రం హైదరాబాదులో ఉన్న వాళ్ళ అమ్మమ్మ దగ్గరకి వెళ్ళేవాడు..పుట్టాక వాడికి తెలిసిన ఇళ్ళు (ఫ్లాట్స్) ఈ రెండే..
ఒకసారి ఊరు అంటే ఏంటి అని అడిగాడు. మేము ఊరు వెళ్ళినప్పుడు వీడియో కాల్ చేసి మా చిన్న ఇల్లు, పక్కన కోళ్ళు, పశువులు చూపిస్తే వాడు అడిగిన ప్రశ్న మీరు ఫార్మ్ హౌస్ లో ఉంటున్నారా అని..నవ్వాలో, బాధపడాలో అర్థం కాలేదు నాకు...అప్పటి నుండి వాడికి మా ఊరు చూపించాలనే ఆశ..
ఊరు వెళ్దాం వస్తావా అంటే చక్కగా మాతో వాళ్ళ అమ్మ, నాన్న లేకుండా వచ్చేసాడు..మా ఇంటికి చేరగానే వాడు అడిగిన మొదటి ప్రశ్న..మీ బాత్ రూమ్స్ ఏంటి ఇలా విడివిడిగా ఉన్నాయి..ఇంటి బయట ఉన్నాయి అని..అలాగే కోళ్ళు ఎక్కడ ఉన్నాయి అని..తర్వాత రోజు చాలా పొద్దున్నే లేచి నన్ను కోడి కొక్కొరొకో అని లేపిందమ్మా అంటూ వాళ్ళ అమ్మకి చెప్పాడు..
మొదటి మూడు రోజులు అందరితో తెలుగులో మాట్లాడటానికి చాలా ఇబ్బంది పడ్డాడు..నాలుగో రోజు తెలుగులో మాట్లాడితే..వీడికి మూడు రోజుల్లో తెలుగు మాట్లాడటం వచ్చేసింది అనుకున్నారు.
మా ఇంటి చుట్టుపక్కల అన్ని ఇళ్ళకీ వెళ్ళాడు..అందరి ఇళ్ళ తలుపులు ఎప్పుడూ తెరిచి ఉండటం...ఇళ్ళళ్ళోకి అలా అనుమతి లేకుండా వెళ్ళడం...అందరూ వీడిని స్పెషల్ గా చూడటం వాడికి బాగా నచ్చింది. రెక్కలు వచ్చిన పక్షిలా తిరిగాడు.
వాడు మొదటిసారి
- ఊరు చూసాడు..
- చెరువుని చూసాడు..
- కాకులని, కోళ్ళని, పిచ్చుకలని,పశువులని చూసాడు..
- పాలు పితకడం చూసాడు..
- ఎడ్లబండిని చూసాడు..
- కట్టెల పొయ్యిని చూసి ఇదేంటి అని అడిగాడు..
- జామచెట్టుని, దానిపై కూర్చుని జామపండు తింటున్న చిలకమ్మని చూసి మురిసిపోయాడు..
- కొబ్బరి, తాటి,మర్రి,రావి అన్ని రకాల చెట్లని, మొక్కలని చూసాడు..
- పెద్ద చెట్లపై ఉండి ఉదయం, సాయంత్రం విపరీతంగా గోల చేసే వందల పక్షులని చూసాడు..
- అప్పుడే పుట్టిన కోడిపిల్లలని తడిమి చూసాడు..
- గేదెలతో, దూడలతో, కోడిపిల్లలతో ప్రతిరోజూ ఆడుకున్నాడు..
- విశాలమైన పూరిళ్ళని, పెంకుటిళ్ళని చూసాడు
- వరి పొలం, అరటి తోటలని చూసాడు..
- భోగి రోజు భోగి మంటలలో కాగిన వేడినీళ్ళతో స్నానం చేసాడు..
- కట్టెల పొయ్యి మీద చేసిన పరమాన్నం తిన్నాడు..
- కమ్మటి నెయ్యి, గడ్డ పెరుగు తిన్నాడు..
- కూరగాయలు, పూలు, పండ్లు కోసాడు..
- సంక్రాంతికి మాత్రమే వేసే పెద్ద ముగ్గులు, గొబ్బెమ్మలు చూసాడు..
- హరిదాసుని, గంగిరెద్దుని, కోడిపందేలని చూసాదు..
- తొంబై యేళ్ళు దాటి, ఆరోగ్యంగా ఉన్న ముసలి వారిని చూసాడు..
- పూరి గుడిసెలో పెరుగుతున్న ఇద్దరి పిల్లలతో ఆడుకుని..వాళ్ళకి వాడి బొమ్మలు,స్వెట్టర్ ఇచ్చేసాడు..
- మొదటిసారి బస్సు ఎక్కాడు..
ఇంకా ప్రతిచోట ఆ చిన్ని బుర్రలో ఎన్ని ప్రశ్నలో...వెళ్ళిన ప్రతి ఇంట్లో కొత్త అని లేకుండా ఎన్నో ప్రశ్నలు..ఊరి నిండా వాడికి ఎన్ని వింతలు కనిపించాయో...
వెళ్ళే ముందు ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పి రావాలని, అందరికీ మళ్ళీ వేసవి సెలవులకి వస్తా అని చెప్పి వచ్చాడు. సిటీ కంటే ఊరు బాగుందని చెప్పాడు. వాడు వెళ్ళిన తర్వాత కూడా అందరూ వాడిని గుర్తు చేసుకున్నారు. అంతలా అందరితో కలిసిపోయాడు. వాడి ఫోటొస్, వీడియోస్ చూసి అమెరికాలో ఉన్న వాళ్ళ అత్త కొడుకు, వాళ్ళ అమ్మని అడిగాడంట...అమ్మా నన్ను ఆ ఊరు తీసుకెళ్ళు అని...
ఇలాంటి తరం కూడా పెరుగుతోంది..ప్రకృతికి దూరంగా, పల్లెలకి దూరంగా, భాషకి దూరంగా, సంప్రదాయాలకి దూరంగా అంటే భయం వేస్తోంది. ఉద్యోగాల పేరిట,అభివృద్ధి పేరిట, గొప్ప చదువుల పేరిట చిన్ననాటి నుండే ఇలాంటి జీవనశైలిని పిల్లలకి అలవాటు చేస్తున్న మనం, వాళ్ళు ఎంత విలువైన బాల్యం కోల్పోతున్నారో కూడా ఆలోచించుకోవాలి. కనీసం బాధ్యతలు తీరిపోయిన అమ్మమ్మ, నానమ్మలు, సిటీ అవసరం లేని ప్రతి ఒక్కరు, విదేశాల అవసరం తీరిపోయిన వాళ్ళు, తమ సొంత ఊర్లకి తిరిగి వెళ్ళే ఆలోచన చేయాలి. అప్పుడే సెలవు రోజుల్లో అయినా పిల్లలకి ఊరు వెళ్ళే అవకాశం ఉంటుంది. పిల్లలకి ఊరు అంటే తెలుస్తుంది. గ్రామీణ వాతావరణం అలవాటు అవుతుంది. అన్ని రకాల మనుషులని, అన్ని రకాల పనులని చూస్తారు. లోకం తెలుసుకుంటారు. గేటెడ్ అనే మాయా ప్రపంచానికి దూరంగా అప్పుడప్పుడు స్వచ్ఛమైన ప్రపంచంలో కొన్ని రోజులైనా గడిపే వీలు ఉంటుంది. మన ఊరు, మన వాళ్ళు, మన చెరువు, మన ఆవు, మన చేను..అనే బంధాలు ఏర్పడతాయి. చెట్టు, పుట్ట, మట్టితో అనుబంధం ఏర్పడుతుంది. ప్రకృతి ద్వారా ఎన్నో పాఠాలు నేర్చుకుంటారు. ఊర్లు కూడా సుభిక్షంగా ఉంటాయి. ఏమో పెద్దయ్యాక వాళ్ళే ఊరి మీద మమకారంతో ఊరి కోసం ఏమైనా చేస్తారేమో..మరో కొసరాజుగా అవుతారేమో, ఒక గొప్ప రైతుగా మారి స్వచ్చమైన ఆహారం అందిస్తారేమో, మరో శ్రీధర్ వేంబు అవుతారేమో..ఎవరు చెప్పగలరు?
పిల్లలకి మనం ఇచ్చే ఆస్తి ఇంటెర్నేషనల్ బళ్ళో ఖరీదైన చదువులు, అన్ని సదుపాయాలు ఉన్నాయని చెప్పి కొనే కోట్ల విలువైన ఖరీదైన మూడు గదుల ఫ్లాట్, బెంజ్ కార్, మినరల్ వాటర్, కలుషితమైన గాలి, కల్తీ ఆహారం, చిన్నప్పటి నుండే కళ్ళజోళ్ళు, విటమిన్ లోపాలు, జీవితాంతం మందులపై ఆధారపడి జీవించే ఆరోగ్యం, కష్టం తెలియని జీవితమేనా ?
కాదు..అంతకి మించి విలువైన ఆస్తి మన పల్లెటూరు అనే అద్భుత ప్రపంచంలోనే ఉంది. ఎన్ని కోట్లు ఇచ్చినా వెలకట్టలేని ఆస్తి.. పాడిపంట, ప్రకృతితో మమేకమైన జీవితం..
వెలకట్టలేని గాలి, నీరు, ఆహారం..
ఏ బంధం లేకున్నా ఎప్పటికీ మన వారే అనిపించే ఆత్మ బంధువులు..
ఎండావానలో రోజంతా శ్రమించి స్ఫూర్తినిచ్చే కష్టజీవులు..
ఉన్నంతలోనే తృప్తిగా బతకడం..
కొత్తవారిని కూడా మనవారిలా ఆదరించడం..
ప్రతి రోజూ జీవితం నేర్పే ఎన్నో పాఠాలు...
ఎంత పెరిగినా మర్చిపోలేని సంప్రదాయాలు, జ్ఞాపకాలు....
కేవలం మన కోసం కాకుండా నలుగురి కోసం జీవించే గొప్ప జీవన విధానం..
బతకడం మాత్రమే కాకుండా ప్రతిరోజూ కొత్తదనంతో జీవించడం..
ఇచ్చిపుచ్చుకోవడం, కలిమిలేముల్లో సాయపడటం..
పొదుపుగా వాడటం, ప్రకృతికి హాని చేయకుండా బతకడం నేర్పించే గొప్ప నాగరిక ప్రపంచం..
పిల్లల భవిష్యత్తుని కనీసం సూర్యుడు,చంద్రుడు, నక్షత్రాలు కనపడకుండా కేవలం నాలుగు గోడలకే పరిమితం చేసి, ఎంతో అందమైన బాహ్య ప్రపంచానికి దూరంగా, కలలు, కళలు, బంధాలకి దూరంగా, ఫారం కోడిపిల్లల్లా, మరబొమ్మల్లా పెంచే హక్కు మనకి ఉందా ?
*ప్రకృతికి దూరమైన నాటి నుండే మనిషి రోగాలకి దగ్గర కావడం మొదలయింది. పల్లె మనకి ఎంతో మంచి ఆరోగ్యం, మధురమైన అనుభూతులు, విలువైన జీవితం ఇచ్చింది. నిర్జీవమైపోతున్న పల్లెల ఋణం తీర్చుకునే సమయం ఆసన్నమైంది*.
AdminPost
No comments:
Post a Comment