Sunday, February 1, 2026

 చిన్నకథలు - పెద్ద అర్థాలు 
కథ : నిషేధం
రచన : డా. తంగెళ్ళ శ్రీదేవిరెడ్డి 
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
"ఈ గ్రామంలో పగటి పూట నైటీలు ధరించడం నిషేదించబడినది. నిబంధన అతిక్రమిస్తే అక్షరాలా ₹2000 రూపాయలు జరిమానా గ్రామ పంచాయితీకి చెల్లించ వలసింది. పగటిపూట నైటీలు ధరించిన వారి సమాచారాన్ని గ్రామపంచాయతీకి తెలియజేసిన వాళ్లకు ₹1000 అవార్డు కూడా ప్రకటించడ జరిగింది. సమాచారం అందించిన వారి విషయాలు గోప్యంగా ఉంచుతాము. అట్లాగే వృద్ధులు అనారోగ్య పీడితులు ఎవరైనా ఉంటే వాళ్లకు ఈ నిబంధన  మినహాయించడం జరిగింది. మన సంస్కృతి సంప్రదాయాన్ని పరిరక్షించడంలో భాగంగా మాత్రమే ఈ కఠినమైన నిర్ణయం తీసుకోవడం జరిగిందని ఈ సభ ముఖంగా తెలియజేస్తున్నాము"  గ్రామస్తులు అందరి సమక్షంలో రచ్చబండ వద్ద ప్రకటించాడు గ్రామపెద్ద అరవై ఏండ్లు పైబడిన రామనాథం.

అక్కడ ఉన్న స్త్రీలు ఎవ్వరూ కిమ్మనలేదు. మగవాళ్ళు మాత్రం "హమ్మయ్య నైటీల దరిద్రం వదిలింది" లోలోపల సంబరపడిపోయారు. అదే విషయం ఆ సాయంత్రమే గ్రామంలో చాటింపు కూడా వేయబడింది.అంతేకాదు సమాచారం రాసిన బోర్డు కూడా ఊరు రచ్చబండ వద్ద పాతించబడింది.

ఇక ఆరోజు మొదలు ఆ గ్రామంలో పగటి పూట ఆడవాళ్ళు ఎవ్వరూ కూడా నైటీలు ధరించి కనబడటం మానేశారు. గృహిణులు చక్కగా చీరలు కట్టుకుని, అమ్మాయిలైతే పంజాబీ డ్రెస్సులు ధరించి కనబడసాగారు. అవిధంగా గ్రామంలో స్త్రీ వస్త్రధారణ విషయమై వాతావరణం పూర్తిగా మారిపోయింది. విషయం వార్తల్లోకి కూడా ఎక్కింది.

వారం రోజుల తర్వాత -
ఒకరోజు సాయంత్రం రచ్చబండ వద్ద కూర్చుని ఇద్దరు యువకులు మాట్లాడుకుంటున్నారు.

" నైటీ...నైటీ...దుకాణానికి పోయినా నైటీ, పక్కింటికి పోయినా నైటీ, పిల్లల్ని స్కూల్ బస్సు ఎక్కించడానికి పోయినా నైటీ, పైన ఒక తువ్వాలు కప్పుకుని సంతకు పోయినా నైటీ.. ఈ ఆడోళ్ళను ఎప్పుడో పెండ్లిళ్ళకు పండుగలకు తప్పిస్తే చీరల్లో చూసింది లేదు. పొద్దుట లేసింది మొదలు రాత్రి పడుకునే వరకే నైటీ. అస్సలు ఆ నైటీ తప్ప వేరే డ్రెస్సె ఈ ఆడోళ్ళకు తెలువట్లేదు.పీడ విరగడయ్యింది.. " గుండెల నిండుగా అంటున్నాడు 
నలభై ఏండ్ల మహేందర్.
" అవునన్నా. ఈ నైటీల బాధ తప్పింది. కొత్త మోడల్స్ వొచ్చాయని నెలకు నాలుగు చీరలు కొనుడు... బీరువాల్లో పెట్టుడు. కట్టేది లేదు.... పెట్టేది లేదు. ఇదో పెద్ద తతంగం అయిపోయింది.మన సర్పంచి రామనాథం మంచి నిర్ణయం తీసుకున్నాడు. నిజంగా అతడికి మొక్కాలే " అదే వయసున్న మరో యువకుడు దయాకర్ కూడా సంతోషం అవ్యక్తం చేస్తూ చెప్పుకొచ్చాడు..

వాళ్ళు ఇద్దరూ పక్కన మండల కేంద్రంలో  చక్కర ఫ్యాక్టరీలో పని చేస్తుంటారు. ఆరోజు సెలవు దినం కావడంతో హాయిగా మనసు విప్పి మాట్లాడుకుంటున్నారు.వాళ్ళ మాటల్ని వింటూ అక్కడే కూర్చుని ఉన్న ఒక పెద్దాయన కూడా  ఆఖరకు కల్పించుకుంటూ -" అవునప్పా రామనాథం మంచి పని చేసిండు" తృప్తిగా అన్నాడు.

*****
నెల రోజులు గడిచిపోయాయి.
మహేందర్, దయాకర్, పనిచేస్తున్న చక్కెర ఫ్యాక్టరీలో
అగ్ని ప్రమాదం సంభవించింది.మరమ్మత్తుల నిమిత్తం  సిబ్బందికి సెలవులు ప్రకటించారు. ఆ నెల రోజులకు మరో ఉద్యోగం చూసుకోలేక మహేందర్, దయాకర్,ఇద్దరూ  తమ ఇండ్ల వద్దే ఉండిపోయారు.ఇట్లాగని ఖాళీగా కూర్చోలేదు. ఇద్దరూ మాట్లాడుకుని,  ఊర్లో ఉన్న కొవ్వొత్తుల కుటీర పరిశ్రమ నుండి లెక్క ప్రకారం కొవ్వొత్తులు తెప్పించుకుని, వాటిని 
ప్యాకింగ్ చేసే పని మొదలెట్టారు. అట్లా ఒక మూడు వారాలు గడిచిపోయాయి.

******
ఒకరోజు- 
మహేందర్ భార్య మంజుల, దయాకర్ భార్య దమయంతి, గుడి వద్ద కలుసుకున్నారు. దేవుడి దర్శనం తర్వాత ఇద్దరు అక్కడే ఉన్న అరుగు మీద కూర్చొని మాట్లాడుకోసాగారు.

" ఇంటి వద్ద ఉంటూ... పిల్లల పని, ఇంటి పని, వంట పని, చేసుకుంటూ.... మన సౌలభ్యం కోసం నైటీలు తొడుక్కుంటే నిషేధం పెట్టిన్రు. ఇప్పుడు చూసావా? మూడు వారాల నుండి ఇంట్లో కూచోని మాసిపోయిన లుంగీ, రెక్కలు లేని బనియను, తొడుక్కుని ఉంటున్నడు.మనం నైటీ ధరిస్తే శరీరంలో ఏ భాగం కూడా కనబడదు.... అయినా వద్దంటున్నరు. సర్లే...! మరి ఇదేం ఏషం?  రచ్చబండ కాడికి పోయినా లుంగీ, పిల్లల్ని స్కూల్ బస్సు ఎక్కించడానికి పోయినా లుంగీ, పైన ఒక తువ్వాలు కూడా లేకుండా  సిగరెట్టుకు దుకాణానికి పోయినా లుంగీ..పొద్దస్తమానం లుంగీ...లుంగీ...వీళ్లకు 
సౌలభ్యం కావాలే... ఆడోళ్ళకు ఉండొద్దా? " ఆవేదన ఆవేశం రెండూ కలగలసిన స్వరంతో మాట్లాడింది మంజుల.

 ఆ మాటలు వినగానే దమయంతిలో కూడా  ఆవేదన - ఆవేశంతో  ఆక్రోషం తన్నుకొచ్చింది.
" మీ అయన లుంగి కట్టుకుంటున్నాడు. జరా నయం. ఏదో ఒక టైంలో లుంగిని కిందకు వదులుకుని నిండుగా కనిపిస్తడు. మా ఆయన మరీ అద్వాన్నం. పాత ప్యాంటు కత్తరించుకుని షార్ట్ చేసుకుని, తోడుగా రెక్కలు లేని బనియన్ తొడుక్కుని ఊరంతా తిరుగుతున్నడు.. " 
అంటూ రుస రుస లాడింది.

తర్వాత -
 అదే విషయమై ఇద్దరు ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ  మగాళ్లను మొగుళ్ళను తిట్టుకున్నారు. అఖరుగా- 
"ఆడవాళ్లకు ఒక న్యాయం....మగవాళ్లకు ఒక న్యాయమా? మన ఇద్దరం కలిసి రామనాథనికి ఈ యవ్వారం గురించి ఫిర్యాదు చేద్దాం. మన పేర్లు గోప్యంగా ఉంచాలని చెబుదాం. మగవాళ్ళు కూడా ఇంట్లో ఉన్నప్పుడు ప్యాంటు షర్టు ధరించక పోయిన పర్వాలేదు కానీ అర్థనగ్నంగా ఉండొద్దని మాత్రం చెప్పేద్దాం..." ఒక నిర్ణయానికి వచ్చింది మంజుల.
" నేనూ ఇదే అనుకుంటున్నా" చేతులు కలిపింది దమయంతి.

******
మరునాడే....
మంజుల, దమయంతి ఇద్దరూ సర్పంచ్ రామనాథం ఇంటికి వెళ్లారు.వాకిట్లో పూల మొక్కల వద్ద పూలు కోస్తూ.... జరీ అంచు కాటన్ చీరతో- పెద్దబొట్టుతో మహాలక్ష్మిలా కనిపించింది రామనాథం భార్య రామమ్మ.
" రండి బిడ్డా " చూడగానే అచ్చు అమ్మలా ఆహ్వానించింది.
సరిగ్గా అదే సమయంలో. ఇంట్లోంచి బయటకు వచ్చాడు రామనాథం.

అతడు-
కింద ఒక లుంగీ ధరించి, దాన్ని పైకి ఎగ్గట్టి, పై భాగంలో కనీసం ఏ అచ్చాధన లేకుండా ముప్పావు భాగం అర్దనగ్నంగా కనిపించాడు.
అది చూడగానే మంజుల, దమయంతి, ఇద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు.
"ఆచార్య సూక్తులు బాగున్నాయి కానీ..." నానుడి ఆ ఇద్దరి కళ్ళల్లో ఎగిసి పడింది.

" ఏం తల్లీ... ఇద్దరూ కలిసివచ్చారు? " ఏంటి విషయం అన్నట్టుగా ఆత్మీయంగా పలకరించాడు రామనాథం.
ఏం చెప్పాలో ఇద్దరికీ వెంటనే అర్థం కాలేదు. అయినప్పటికీ  తేరుకుంటూ ఇద్దరూ ఒకేసారి నోరు విప్పారు.
"ఆ....పూలమొక్కల కోసం...."
"అదే....అంటు మొక్కల  కోసం"
------------------------------------------
( పశ్చిమ గోదావరి జిల్లా తోకలపల్లె గ్రామంలో పగటిపూట 'నైటీలు' ధరించడాన్ని  నిషేధించడం ఘటన ఆధారంగా హాస్యం కోసం రాసిన కల్పిత కథ)
🙏🙏🙏🙏🙏🙏
యెనుముల 
🙏🙏🙏🙏🙏

No comments:

Post a Comment