“ఆనాపానసతి .. శ్వాస మీద ధ్యాస”

“ఆనాపానసతి” అన్నది సుమారు 2500 సం|| ల క్రితం గౌతమబుద్ధుడు ఉపయోగించిన పాళీ భాష కు చెందిన పదం. పాలీ భాషలో..
‘ఆన’ అంటే ‘ఉచ్ఛ్వాస’
‘అపాన’ అంటే ‘నిశ్వాస’
‘సతి’ అంటే ‘కూడుకుని వుండడం
ఈ ప్రపంచంలో ఉన్న ఒకే ఒక్క సరి అయిన ధ్యాన పద్ధతి ఆనాపానసతి! సత్యాన్ని కనుక్కోవాలి అని ఆరాటం చెందేవారు చివరిగా చేరే స్థితే ఆనాపానసతి .. అక్కడి నుంచే వారి అసలైన “ఆధ్యాత్మిక అనుభవైక ప్రయాణం” మొదలవుతుంది! “ఆనాపానసతి” అంటే “మన శ్వాసతో మనం కూడుకుని వుండడం” .. దీనినే మనం “శ్వాస మీద ధ్యాస” అని చెప్పుకుంటున్నాం. “ఆనాపానసతి” అన్నది ప్రపంచానికి సకల ఋషులు, సకల యోగులు అందరూ కలిసికట్టుగా ఇచ్చిన అద్భుతమైన వరం !
“కుంభకరహిత ప్రాణాయామం“
గౌతమబుద్ధుడు .. ఆనాపానసతి లాగ హఠయోగ ప్రాణాయామాదులు సంవత్సరాల తరబడి చేసి వాటన్నింటి యొక్క నిస్సారాన్నీ, నిష్ఫలతనూ స్వయంగా అనుభవించి వాటిని పూర్తిగా విసర్జించాడు.
“కఠోరమైన కుంభకాదులను అభ్యాసం చేసి వాటి నిష్ఫలతను అనుభవించినారు; మొత్తంమీద నా శ్వాసలోనే ఎక్కడో రహస్యం వుంది ; సహజమైన శ్వాస రీతిలోనే మర్మం వున్నట్లు ఉంది ; చిన్నప్పటి నుండి ఎలాగైతే సహజసిద్ధంగా శ్వాసను గమనిస్తున్నానో అదే సరియైనది” అని తర్కించుకుని హాయిగా దానినే గమనించడం మొదలుపెట్టాడు. అంతే! ఒక్కొక్కటిగా ఆయనకు సర్వం అవగతమైంది.
“సహజమైన శ్వాస“

సృష్టిలో ఒకానొక మూల సిద్ధాంతం “ప్రకృతి ఎప్పుడూ సహజంగా సులభరీతిలో వుంటుంది” అని చెప్తోంది. “ఏదైతే ప్రకృతిసహజంగా, సులభరీతిగా వుందో అదే సత్యమైంది” అని మనం స్పిరిచ్యువల్ సైన్స్‌లో తెలుసుకుంటాం. మరి అలాగే కఠినంగా, అసహజంగా వుండేదే అసత్యం.
“శ్వాసను కుంభించడం” అన్నది కఠోరమైంది కనుక “హఠయోగ ప్రాణాయామం” అన్నది అసహజమైంది ; అది సత్యానికి సుదూరమైంది.
కుంభక రహిత కేవల పూరక రేచకాత్మకం అయిన “సుఖమయ ప్రాణాయామం” అన్నది సహజమైంది ; అది సత్యంతో కూడుకుని వుంది.
“ఉపాసన – విపస్సన“
“ఉపాసన” అంటే అది “నోట్లోంచి బహిర్గతమయ్యే మంత్రాలతో కూడిన ప్రక్రియ”. “విపస్సన” అంటే శ్వాస నుంచి మొదలై మూడవ కన్ను వరకు పోయే ప్రక్రియ”.
మంత్రోపాసకులు మంత్రోచ్ఛారణ ద్వారా అభ్యాసం చేస్తూ వుంటారు. ఆ మంత్రం చెప్పి చెప్పి చివరికి ఒకానొక నిశ్శబ్ద స్థితికి, మంత్ర-రహిత-స్థితికి చేరుకున్నప్పుడు కొన్ని దివ్యరూపాలు కనబడతాయి. అయితే, అదంతా అంతవరకే ఆగిపోతుంది. ఆ దివ్యదృష్టి యొక్క ప్రాథమికాలలో, ప్రాథమిక దశలలో సంచరించడమే ఉపాసకులు సాధించగలిగినది అంతకన్నా పైన వున్న .. “దివ్యదృష్టి” అన్నది .. “మంత్ర ఉచ్ఛారణ” తో
“మంత్రోపాసన” తో ఎంత మాత్రం సాధ్యం కాదు !
మంత్రోపాసకులు కేవలం ఐదవ చక్రం వరకే చేరుకుంటారు. మహా అయితే “ఆజ్ఞాచక్రం” అంటే “సుదర్శన చక్రం” ఛాయలు మాత్రమే కనబడతాయి కానీ అందులో పరపక్వత సాధించలేరు.
మంత్రజపం అన్నది అధోస్థానమైన నోట్లో వుంది ; ఆనాపానసతి అన్నది ఊర్థ్వస్థానమైన నాసికలో వుంటుంది. “నోటితో చేసే క్రియ” ను .. వదిలి “శ్వాస ద్వారా చేపట్టే క్రియ” అనే “ఆనాపానసతి” ని మొదలుపెడితే .. దివ్యదృష్టి అనతికాలంలోనే సంప్రాప్తించి అద్భుతమైన దివ్యజ్ఞాన సంపన్నులమై మన జన్మలన్నీ చూసుకుంటాం ; అదే ఏడవదైన సహస్రారస్థితి.
“ఉపాసన ” = “‘ఉప’ + ‘ఆసన’” = “ప్రక్కనున్న ఆసనం”
“మంత్రజపం” అన్నది చిన్న ఆసనం ; “విపస్సన” అన్నది ప్రధాన సింహాసనం ఆసనం .. అక్కడే మనిషి “రారాజు” అవుతాడు ‘సింహం’ అవుతాడు.
“ఆనాపానసతి” అన్నది నేరుగా విశుద్ధ చక్రం నుంచి ప్రారంభమై ఆజ్ఞా చక్రం ద్వారా అందరినీ ఏడవ స్థితి ఐన
సహస్రార స్థితికి వెంటనే తీసుకుని వెళ్తుంది.
“మంత్రోపాసన” ద్వారా శిష్యుడుగా అవ్వొచ్చు కానీ .. గురువుగా మాత్రం కాలేము ! ముఖ్యశిష్యుడిగా వుంటాం కానీ జీవన్ముక్త గురువుగా కాలేము !
ఆరవదైన ఆజ్ఞా చక్రానికి చేరుకున్నవారు గురువులు : ఏడవ స్థితికి అంటే సహస్రారస్థితికి చేరుకున్నవారే జీవన్ముక్త స్థితిలో ఉన్న పరమ గురువులు !
“దివ్యదృష్టి“
ఈ విధంగా ఏకదీక్షతో ఆనాపానసతి అభ్యాసం చేయడం ద్వారా మన “నాడీమండలం” అంతా శుద్ధి అవుతుంది ; నాడీమండలం శుద్ధి అవుతూన్నప్పుడు ఆ స్థితులను గమనిస్తూ వుండడమే కాయానుపస్సన. “కాయానుపస్సన” అనే రెండవ దశను దాటి “విపస్సన” అనే మూడవ దశ అంటే “దివ్యదృష్టి” లోకి ప్రవేశిస్తాం.
“దివ్యదృష్టి” లో వచ్చే అనుభవాలన్నీ ఒకరితో ఒకరు పంచుకోవాలి, చెప్పుకోవాలి ; ఇదే “సజ్జనసాంగత్యం” .. ఇతర ధ్యానులతో సాంగత్యం.
“విపస్సన” ను ఇంగ్లీషులో “SEEING .. సీయింగ్” అన్నారు. అంటే “చూడడం” అన్నమాట. ఆనాపానసతి ద్వారా మనం “ఋషులం” అంటే ” SEERS .. సీయర్స్”, “ద్రష్టలం” అవుతాం.
“ధ్యానం .. సర్వ రోగనివారిణి“
ఆనాపానసతి అన్నది “పశువు” ను “పశుపతి” గా చేస్తుంది. అంటే తన జంతుత్వానికి తాను ఆధీనుడు కాకుండా తన జంతుతత్వానికి తాను “పతి” అంటే “యజమాని” కావడం.
ఒకానొక “పశువు” ను “పశుపతి” గా చేసే పాశుపతాస్త్రమే ఆనాపానసతి. పాశుపతాస్త్రంతో సాధించలేనిదంటూ ఏదీ లేదు .. అలాగే ఆనాపానసతితో సాధించలేనిదంటూ ఏదీ లేదు !
ఆనాపానసతి .. అన్నది సర్వరోగనివారిణి-సకలశక్తి ప్రదాయిని ! ఆనాపానసతి అన్నది సర్వభోగకారిణి – సకల సమస్యల పరిష్కారిణి ! ఆనాపానసతి అన్నది సత్య జ్ఞాన ప్రసాదిని – సకల సంశయాల హారిణి! పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్మెంట్ యొక్కమూల ఆధ్యాత్మిక సాధనా సిద్ధాంతం “ఆనాపానసతి”.
“నాసికాగ్రం .. భ్రూమధ్యం”
ఆనాపానసతి అభ్యాసం ఎలా చేయాలంటే .. హాయిగా కూర్చుని, కాళ్ళు రెండూ కట్టేసుకుని, చేతులు రెండూ కట్టేసుకుని, కళ్ళు రెండూ మూసుకుని, మన మస్తిష్కాన్ని కట్టేసుకుని శ్వాస మీద ధ్యాస వుంచాలి.
నాసిక ఎక్కడ మొదలవుతుందో దాని పేరే “భ్రూమధ్యం” .. అదే “నాసికాగ్రం”.
“నాసికాగ్రం” అంటే “ముక్కుకొన” కాదు !
అలా చేసినప్పుడు .. శ్వాస తనంతట తాను చిన్నదిగా అయిపోతూ చివరికి ‘నాసికాగ్రం’ లో అంటే ‘భ్రూమధ్యం’ లో, అంటే ఆజ్ఞాచక్రస్థానం లో, అంటే సుదర్శనచక్రస్థానంలో తనంతట తాను సుఖంగా స్థితం అయిపోతుంది. అప్పుడు ఆ స్థితిలో మనం తదేకమై, తన్మయమై వుంటే .. “మూడవ కన్ను” యొక్క విస్ఫోటనం మొదలవుతుంది.
మూడవ కన్ను యొక్కవిస్ఫోటనాన్ని గమనించడాన్నే “విపస్సన” అంటాం. “పశ్యతి ” అంటే సంస్కృతంలో “చూడడం”. “పస్సన” అంటే పాళీ భాషలో “చూడడం” .. “విపస్సన” అంటే విశేషంగా చూడడం ! ‘వి’ అంటే ‘విశేషమైన’ .. అదే మూడవ కంటిచూపు -ముక్కంటి చూపు .. థర్డ్ ఐ విజన్ !
ఆనాపానసతి – కాయానుపస్సన – విపస్సన ను మనం ప్రతిరోజు అభ్యాసం చేసి దానిద్వారా మెల్లిమెల్లిగా ఇతర లోకాలన్నీ తెలుసుకుని ఇతర లోకాలలో సంచరిస్తూ ఆత్మవిజ్ఞానాన్ని సంపాదించాలి ; పూర్ణమైన సవ్య అవగాహన కలిగించుకోవాలి.
No comments:
Post a Comment