Thursday, May 7, 2020

దీర్ఘదర్శి

దీర్ఘదర్శి

@@@

ఇది భారతం లోని ఒక చిన్న కథ. ఈ కథను విష్ణుశర్మ తన పంచతంత్ర గాథలో కూడా ప్రస్తావించాడు.

ఒక చిన్న కొలనులో దీర్ఘదర్శి, ప్రాప్తకాలజ్ఞుడు, దీర్ఘసూత్రుడు అనే మూడు చేపలు చిరకాలంగా స్నేహితుల్లా జీవిస్తుండేవి. ఒక వేసవి కాలంలో కొలను మొత్తం ఎండిపోయే సూచనలు కనిపించాయి. కొలను మొత్తం ఎండిపోయే ప్రమాదాన్ని గమనించిన దీర్ఘదర్శి తన మిత్రులతో " ఈ ఏడు వర్షాలు కురిసే అవకాశం కనిపించడం లేదు. మనం జలచరాలం. కనుక మనం ఈ కొలను వదిలి నీరు పుష్కలంగా ఉన్న మరో సరస్సుకు వెళదాం" అని ప్రతిపాదించాడు.

ప్రాప్తకాలజ్ఞుడు నవ్వి "ఎప్పుడో చెరువు ఎండిపోతుందని ఇప్పుడే చింత దేనికి? అప్పుడు చూసుకుందాములే..." అన్నది.

ఇక దీర్ఘసూత్రుడు అయితే "ఎండలు వచ్చినట్లే వానలు కూడా వస్తాయి. ఎపుడో ఎదో ఆపద రాబోతుందని ఇప్పుడే దిగులు పడటం, భయపడటం అవివేకం. నేనైతే ఈ కొలను వదిలి ఎక్కడికీ రాను" అన్నది.

దాంతో దీర్ఘదర్శి నిరాశపడి స్నేహితులను వదిలి తాను మరో చెరువుకు వెళ్ళిపోయాడు.

రెండు నెలలు గడిచినా వానలు కురియలేదు. కొలను దాదాపు ఎండిపోయింది. ఆ సమయంలో మత్స్యకారులు వచ్చారు. గేలం వేశారు. ప్రాప్తకాలజ్ఞుడు భయపడ్డాడు. అతనికి ఒక ఉపాయం తోచింది. గేలం ముల్లును నోట కఱచి పట్టుకున్నాడు. చేపలవాళ్ళు గేలంను బయటకి లాగి తొట్టిలో పడేసారు. వారు గేలంను తీసి మళ్ళీ కొలనులో వేశారు. వెంటనే ప్రాప్తకాలజ్ఞుడు తొట్టిలోనించి బయటకు దూకి పారిపోయాడు. దీర్ఘసూత్రుడు గేలానికి చిక్కి తప్పించుకునే ఉపాయం తోచక గిలాగిలాలాడుతూ ప్రాణాలు వదిలాడు.



*

పై కథలో నీతి ఏమిటి?

మనిషి స్వీయ ఆర్ధిక క్రమశిక్షణను ఎలా పాటించాలో పై కథ చెప్తుంది. కొంతమంది నెలకు యాభై వేలు సంపాదిస్తారు. కానీ నెలాఖరులో అప్పులు చేస్తారు. కొంతమంది నెలకు పదివేలు ఆర్జిస్తారు. కానీ వారు ఇతరులకు అప్పులు ఇచ్చే పరిస్థితిలో ఉంటారు. కొంతమంది ఉద్యోగం, లేదా వ్యాపారం లో చేరగానే భవిష్యత్తు గూర్చి ఆలోచిస్తారు. ఇప్పటినుంచే పొదుపు పాటిస్తారు. వృద్ధాప్యం లో కూడా సంతోషంగా బ్రతుకుతారు. ఇలాంటి వారు దీర్ఘదర్శి తరగతి లోకి వస్తారు.

కొందరు వచ్చింది వచ్చినట్లే ఖర్చు చేసి నడివయసులో తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు పడతారు. నలభై ఏళ్ళు వచ్చి, పిల్లలు పెరుగుతున్నపుడు, వారి పెళ్లిళ్లు, చదువులు గూర్చి ఆలోచించి అప్పుడు జాగ్రత్త పడతారు. తాము రిటైర్ అయ్యేనాటికి చేతిలో సొమ్ములేకపోతే అడుక్కోవాల్సిందే అనే ప్రాప్తకాలజ్ఞత తోస్తుంది. అప్పటినుంచి పొదుపు పాటించి చివర దశలో కొంచెం కోలుకుని బ్రతుకు ఈడుస్తారు. వీరంతా ప్రాప్తకాలజ్ఞుడి కోవలోకి వస్తారు.

మరికొందరు చివరి దశవరకు గ్రహించుకోలేరు. మన పిల్లలు ఉన్నారు కదా... వాళ్ళే మనలను చూసుకుంటారు. మన పిల్లలకోసం మనం ఖర్చు చెయ్యకపోతే ఎలా? అని భావించి అప్పులు కూడా చేసి తమ శక్తికి మించిన కలలు కంటారు. ఐదో క్లాస్ చదివే పిల్లలకు పాతికవేలు పెట్టి స్మార్ట్ ఫోన్స్ కొనిపెడతారు. సమాజం లో దర్జాగా జీవిస్తున్నట్లు కనిపించాలని తమ పరిస్థితికి తగకపోయినా, ఎక్కువ అద్దెలు పెట్టి పెద్ద పెద్ద ఇల్లు తీసుకుంటారు. కార్లు కొంటారు.

పిల్లలు పెద్దవారు అయి, సంపాదన పరులు అయి, పెళ్లిళ్లు అయినతరువాత అసలు స్వరూపాలు బయటపడతాయి. పిల్లలు విదేశాలకు వెళ్లొచ్చు. ఇంట్లో ఉన్నా పట్టించుకోకపోవచ్చు... జీవిత చరమాంకంలో తీవ్ర ఇబ్బందులు పడుతూ, తమ దురదృష్టాన్ని నిందించుకుంటూ జీవచ్ఛవాల్లా బ్రతుకుతారు. ఇలాంటి వారు దీర్ఘసూత్రులు అన్న మాట.

మనం ఎవరిలా జీవించాలి??

No comments:

Post a Comment