Saturday, June 6, 2020

పామరులు చేసిన పనులను ఎవరూ పట్టించుకోరు. కానీ తాపసులు, జ్ఞానులకు సమాజంపై బాధ్యత ఉంది. వారు చేసే పనులను పదిమందీ గమనిస్తారు.

అది వేసవి కాలం... గయలో బోధివృక్షం కింద సిద్ధార్థుడు తపస్సులో ఉన్నాడు.

తీవ్ర తపోదీక్షలో ఉన్న ఆయనకు మిట్టమధ్యాహ్నం హఠాత్తుగా దప్పికైంది. సమీపంలో ఉన్న కొలను దగ్గరకు వెళ్లాడు. దాహం తీర్చుకుని అందులోనే కాసేపు సేదతీరాడాయన. ఆ కొలనులో అక్కడక్కడా తామర పూలున్నాయి. వాటి అందానికి ముగ్థుడైన సిద్ధార్థుడు ఒక పువ్వును తెంచబోయాడు. వెంటనే ఆకాశవాణి వినిపించింది..‘సిద్ధార్థా! ఆ పువ్వు ఏం తప్పు చేసింది. కొమ్మనుంచి కమలాన్ని వేరు చేసే హక్కు నీకెక్కడిది?’ అని ప్రశ్నించింది.

ఆయన మారు మాట్లాడకుండా కమలాన్ని నీటిలోనే వదిలేసి పొరపాటుకు చింతిస్తూ కొలనుగట్టున కూర్చున్నాడు.

ఇంతలో ఓ వేటగాడు కొలను దగ్గరకు వచ్చాడు. నీరు తాగి దాహం తీర్చుకున్నాడు. ఆ కొలనులో జలకాలాడాలనుకున్నాడు. అందుకు నీటిలోని ఆ పువ్వులు ఆటంకం అనుకుని వాటిని వేళ్లతో సహా పీకి గట్టుపై వేశాడు. అది దూరం నుంచి చూసిన సిద్ధార్థుడు ‘ఓ ఆకాశవాణీ! నేను పూలను కోయడం తప్పని హితవు పలికావు. మరి ఆ వేటగాడు వాటిని వేళ్లతో సహా పీకేశాడు. సరస్సును చిందరవందర చేశాడు. అతన్ని నువ్వు ఏమీ అనలేదు’ అన్నాడు.

అప్పుడు ఆకాశవాణి తథాగతుడితో ‘నాయనా! పామరులు చేసిన పనులను ఎవరూ పట్టించుకోరు. కానీ తాపసులు, జ్ఞానులకు సమాజంపై బాధ్యత ఉంది . వారు చేసే పనులను పదిమందీ గమనిస్తారు. వారిని అనుసరిస్తారు. అందుకే నువ్వు అనుచితంగా ప్రవర్తించకూడదు. లోక కల్యాణమే జ్ఞానుల లక్ష్యంగా ప్రవర్తించాలి’ అని పలికింది .

దీంతో సిద్ధార్థుడు మౌనంగా బోధి వృక్షంవైపు నడిచాడు.
..

No comments:

Post a Comment