పిల్లలకు ఏది నేర్పించాలో తెలుసుకుందాం.
మన సమాజంలో ఎక్కువగా రెండు తరాలకు చెందిన ప్రజలు ఉంటారు. ఒక తరం వారు ఒకలా ఆలోచిస్తే, మరో తరం మరో విధంగా ఆలోచిస్తుంది. తమ మాట అందరూ వినాలని ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు. దీంతో తరాల మధ్య అభిప్రాయబేధాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. ఈ ధోరణి ఇంతకుముందు కాలంలోనూ ఉండేది. కానీ ఈ మధ్య మరీ ఎక్కువయింది. తమ పిల్లలకు ఏది నేర్పించాలో తెలియక, బేధాభిప్రాయాలను ఎలా తగ్గించాలో అర్థంకాక తల్లితండ్రులు అయోమయంలో ఉంటున్నారు. కాలక్రమేణా ఎన్నో మార్పులు వస్తూ ఉంటాయి. ఆచారాలూ, సంప్రదాయాలూ మారుతూ ఉంటాయి. మనం పిల్లలకు గౌరవ మర్యాదలు నేర్పిస్తాం. ఎవరైనా ఏదైనా ఇస్తే ‘థ్యాంక్స్’ చెప్పమంటాం. మంచీ, మర్యాదా తప్పకుండా నేర్పాల్సిందే. కానీ పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి. అంతేకాని బలవంతంగా ఏదీ బోధించలేం.
ప్రపంచంలో ఎన్నో మంచి విషయాలు జరుగుతున్నాయి. పూర్వం నార్వేలో విద్యావిధానం తక్కువ స్థాయిలో ఉండేది. దాన్ని మెరుగుపరచడం కోసం... ముందుగా వాళ్ళు హోంవర్క్ తీసేశారు. ఉదయం బడికి వచ్చే పిల్లలకు చదువు మీద శ్రద్ధ ఉండడం లేదు. తరగతి గదిలో ఉన్నా.. ‘ఎప్పుడెప్పుడు బయటకు వెళ్ళి ఆడుకుంటామా?’ అనేదే ధ్యాస. ఇది గమనించి... కేవలం రెండు గంటలు మాత్రమే చదువుకు కేటాయించారు. మిగిలిన సమయమంతా ఆడుకోవచ్చు. ఈ మార్పు వల్ల జరిగిందేమిటంటే... పిల్లలు రోజంతా బయట ఆడుకొనేవారు. క్లాసులోకి వచ్చాక... చదువు మీద పూర్తి శ్రద్ధ పెట్టడం మొదలెట్టారు. తద్వారా నార్వేలో విద్యా విధానం ఎంతో పురోగతి సాధించింది. ఒకప్పుడు ఆరో స్థానంలో ఉన్న ఆ దేశం ఇప్పుడు మొదటి స్థానాన్ని చేరుకుంది. మన సమాజం ఈ పద్ధతిని అనుసరించగలుగుతుందా? ఆధునికమైన ఏయే పద్ధతులు సఫలమయ్యాయో, ఏవి అందరికీ ప్రయోజనకరంగా ఉంటాయో... వాటిని అవలంబించడం కోసం మనమంతా ఏకం కావాలి. తద్వారా ఒక నూతన శకానికి నాంది పలకాలి. అందులో ప్రతి ఒక్కరూ సఫలీకృతులు కావాలి.
ఈనాటి యువతరాన్ని గమనిస్తే.. ఎంతోమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. బెలూన్లో గాలిని అలాగే ఊదుతూ పోతే ఏమవుతుంది? ఏదో ఒక క్షణంలో పేలిపోతుంది. అలాగే పిల్లల్ని ‘నువ్వు ఇలా కావాలి, నువ్వు అలా కావాలి’ అంటూ పసితనం నుంచే ‘సక్సెస్’ అనే గాలిని ఊదుతూ పోతే... ఆ మాటలు వారిలో బాగా నాటుకుపోతాయి. కానీ అలా జరగనప్పుడు వాళ్ళు తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఈ వ్యాధి పిల్లలనే కాదు, సమాజాన్నంతటినీ పట్టి పీడిస్తోంది. ‘ఆత్మహత్య చేసుకోవడం తప్పు’ అని ఏ పిల్లవాడు గ్రహించకపోయినా... సమాజమంతా మేలుకోవాల్సిన సమయం ఆసన్నమైనట్టే. పిల్లలు తమ జీవితానందాన్ని పొందాలి. కానీ వాళ్ళు బాల్యాన్ని కోల్పోతున్నారు. విజయం సాధించాలనే ఈ రోగం అతి భయంకరమైనది.
మీరు అనుకున్నవన్నీ జరిగినంత మాత్రాన సక్సెస్ అయినట్టు కాదు. విజయం మీతోనే ప్రారరంభమవుతుంది. అది ఒక పువ్వు లాంటిది. మొక్కకు నీరు పోస్తే... పువ్వు దానంతట అదే విరబూస్తుంది. చేత్తో బలవంతంగా లాగితే... ఏ పువ్వూ వికసించదు. మీరు ఎంత ప్రయత్నించినా అది జరగని పని. ఆ పుష్పాన్ని తనకుతానుగా వికసించనివ్వండి. నిజానికి విజయం మిమ్మల్ని ఎప్పుడో వరించింది. మీరు ఏనాడైతే తొలి శ్వాస తీసుకున్నారో.. ఆ రోజే మీరు విజయం సాధించారు. మీలోనికి శ్వాస వస్తూ పోతున్నంత కాలం... మీరు విజయం సాధిస్తున్నట్టే.
ఇవన్నీ జీవితంలో చాలా ముఖ్యమైన విషయాలు. జీవితంలో ఆశ అనేది లేకపోతే సర్వం సమాప్తమయిపోతుంది. కాబట్టి మీలోని ఆశను ఎన్నటికీ అంతం కానివ్వకండి. సదా చైతన్యవంతులై ఉండండి. చక్కగా జీవించండి.
సేకరణ మీ రామిరెడ్డి మానస సరోవరం👏
No comments:
Post a Comment