Tuesday, June 6, 2023

 మనిషి మనసులో ప్రశ్న మొలిస్తే, ఆ వెంటనే జవాబు కోసం వెతుకులాట మొదలవుతుంది. అతడి ప్రయత్నం కొనసాగుతున్నకొద్దీ, ఆత్మను ఆవరించి ఉన్న ‘జడత్వం’ అనే ముసుగు తొలగిపోతుంది. దాని స్థానంలో చేతనత్వం చోటుచేసుకుంటుంది. ఆ సాధకుడు ఆధ్యాత్మిక మార్గానికి మళ్లుతాడు. అతడు కచ్చితంగా భక్తుడిగా మారతాడు.

భక్తిమార్గంలో వినిపించే పదం ‘ఎవడు’. ఆ మూడక్షరాల మాటలోనే ఎన్నో భావాలు ఇమిడి ఉన్నాయి. అందులో అమాయకత్వం ఉంది. గడుసుతనమూ కనిపిస్తుంది. తెలిసిన తత్వంతో పాటు తెలియనితనం సైతం దాగి ఉంటుంది. ‘ఎవడు’ అని పలికే తీరును బట్టి, లోపలి భావం ప్రశ్నగానే కాక జవాబుగా కూడా పనిచేస్తుంది. అందుకే ఆ పదం పోతన మహాకవికి ఎంతో అభిమానపాత్రమై నిలిచింది. ఆ ఒక్క పదమే ఆయువుపట్టు అనిపించేలా, దాన్ని ఆయన పలు సందర్భాల్లో, అర్థాల్లో వాడాడు. అదీ ఆ సహజ కవి దూరదృష్టి! కేనోపనిషత్తు, ప్రశ్నోపనిషత్తు చేసిన పనీ అదే! వాటిని సామాన్యులు ఉన్నపళంగా చదవలేరు. ఒకవేళ చదివినా, వారికి ఉపనిషత్తులు అప్పటికప్పుడు అవగతం కాకపోవచ్చు. అలాంటివారికీ ఉపనిషత్స్ఫురణ కలిగే విధంగా, పోతనామాత్యుడు ‘ఎవడు’ పద ప్రయోగాన్ని వివిధ రూపాల్లో చేశాడు.

భారతం, భాగవతం- రెండింటినీ వ్యాసుడే సంస్కృతంలో రచించాడు. భాగవతానికి పోతన అనువాద పటిమ- దాన్ని ఆయనే రాశాడన్నంత పేరు సంపాదించిపెట్టింది. వ్యాస భారతంలోని ఆనుశాసనిక పర్వం 149వ అధ్యాయంలో విష్ణు సహస్ర నామాలున్నాయి. భీష్ముడు వాటిని యుధిష్ఠిరుడికి ఉపదేశించాడంటారు. ఆ పేర్ల గొప్పతనాన్ని గురించి వివరిస్తూ ‘ఎవరి నామాన్ని ఉచ్చరిస్తే సంసార బంధనాలన్నీ తొలగిపోతాయో...’ అంటాడు వ్యాసుడు. ఆయన మీద భక్తిభావం గల పోతన- భాగవతంలోనిది కాకపోయినా తన అనువాద ప్రారంభంలో ‘ఎవరి అవతారం అన్ని ప్రాణులకీ సుఖాన్ని కలగజేస్తుందో, ఎవరి శుభనామం తలిస్తే అందరి సంసార బంధనాలూ తొలగిపోతాయో, ఎవరి చరితను హృదయంలోకి చేరిస్తే మృత్యుభయం ఉండదో...’ అని రాశాడు. అక్కడ పరమాత్మ, భగవంతుడు వంటి పదాలు ఉపయోగించకుండా ‘ఎవరి’ పదాన్ని ప్రయోగించడంలోనే గొప్ప ఆంతర్యముంది.

భగవంతుడు గొప్పవాడని కొందరు నమ్ముతారు. మరికొందరు- మానవమాత్రుడే గొప్ప అని తలుస్తారు.

సేకరణ మీ రామిరెడ్డి మానస సరోవరం

No comments:

Post a Comment