*‘ముని’వాక్యం: నాన్నలూ.. చెక్ యువర్ మిస్టేక్స్!*
పితేవ పుత్రస్య సఖేవ సఖ్యుః.. ప్రియః ప్రియాయార్హసి దేవ సోఢుమ్ అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెబుతాడు. ప్రియురాలి తప్పును ప్రియుడు, స్నేహితుడి తప్పును మరో స్నేహితుడు, కొడుకు తప్పును తండ్రి క్షమించేస్తారట! ఇది గీతాకాలం నాటి నీతి.
అదే మనకు భారతీయుడు సినిమా వచ్చే కాలానికి, తప్పు చేసిన వాడు కొడుకు అయినా సరే, క్షమించేది లేదని కమల్‌హాసన్- శంకర్ సందేశం ఇచ్చారు. కాలగతిలో తండ్రి పాటించే విలువలకు మారుతున్న నిర్వచనం అది కావొచ్చు. తండ్రి గొప్పదనం ఏంటో తెలుసుకోవడానికి గూగుల్ లోకి వెళ్లి ‘Father’s Day Greetings’ అని టైపు చేశామంటే.. పుంఖానుపుంఖాలుగా సందేశాలు దొరుకుతాయి. మన నాన్న పట్ల మనకు అలాంటి భావన జీవితంలో ఒక్కరోజైనా కలిగిందో లేదో అనవసరం.. అందులోంచి అందంగా, భావగర్భితంగా ఉన్నదానిని ఎంచుకుని.. స్టేటస్ పెట్టేసుకుని, గ్రూపుల్లో గ్రీటింగులను వెల్లువెత్తించేసి యువజగతి మురిసిపోయే సందర్భం ఇది. ఇవాళ (జూన్ మూడో ఆదివారం) ఫాదర్స్ డే- తండ్రుల దినోత్సవం!
మారుతున్న సమాజంలో మనం మనకు అలవాటు అయిన ఒకే రకం భావాలను పట్టుకుని వేళ్లాడుతుంటాం. వాటికి భిన్నంగా ఆలోచించడానికి మనకు ధైర్యం చాలదు. పిరికితనం. మన పిరికితనాన్ని దాచేసే ముసుగుల్లాంటి మాటలతో మనం మానవ బంధాలను నిర్వచిస్తూ ఉంటాం. చాలా మంది ‘అద్భుతమైన తండ్రులు’.. అలా వారు అద్భుతాలుగా కొనియాడబడిన వారు- ఇంకో పార్శ్వం నుంచి చూసినప్పుడు తమ పిల్లల పట్ల దుర్మార్గులుగా నిరూపణ అవుతారు.
చిన్న ఉదాహరణ అనుకుందాం. ఇంటర్మీడియట్లో ఓ పిల్లవాడు ఐఐటీలో అద్భుతమైన ర్యాంకు సాధించాడనుకుందాం. అతడిని అంతగా చదివించిన అతని తండ్రి కృషి, పట్టుదల గురించి మనం వేనోళ్ల కీర్తిస్తాం. పత్రికల్లో ఆయన ఇంటర్వ్యూలు కూడా వేస్తాం. కానీ, అదే పిల్లవాడు ఇంటర్ చదువుతుండగా ఆత్మహత్య చేసుకున్నాడనుకోండి.. అతడు భరించలేనంత ఒత్తిడికి గురిచేసిన తండ్రి దుర్మార్గాన్ని మనం ప్రస్తావించం. ఆ జూనియర్ కాలేజీలు పెట్టే ఒత్తిడిని తిట్టుకుంటూ వ్యాసాలు రాస్తాం.. ఆ కాలేజీలు ‘అలాంటివే’ అని తెలిసీ, అందులోనే చేర్చిన తండ్రి దుష్టత్వం ప్రస్తావనకు రాదు! ఇది లోకరీతి.
తండ్రి దుర్మార్గాన్ని ప్రశ్నించాలంటే అందరికీ భయం, సంకోచం. ఏదో ఒకనాడు తాము కూడా ఆ పాత్రలోనే ఉంటామనే సంకోచం. ఇది చాలా చిన్న ఉదాహరణ. పిల్లల విషయంలో తండ్రులు చేసే తప్పులు, పాపాలు ఇంకా అనేకం ఉంటాయి. అన్నీ ప్రస్తావించుకున్నా ఓ గ్రంథం అవుతుంది. కనీసం రెండు మిస్టేక్స్ గురించి అయినా ఖచ్చితంగా చెప్పుకోవాలి.
మిస్టేక్ 1: కన్నా.. నా కలలకు సారథి నువ్వు..
ఇంజినీరింగ్, మెడిసిన్ లక్ష్యంతో చదువుల కార్ఖానాల్లో నిత్యం రాపిడికి గురవుతూ ఉండే పిల్లల్లో 80 శాతం మంది పిల్లలు వారి తండ్రుల కలలకు సారథులు! ‘‘కన్నా ఇంజినీరు/ డాక్టరు కావాలనేది నాకల. నాకున్న పేదరికం, గవర్నమెంటు కాలేజీల్లో చదువులు (అలాంటి ఏదోఒక కారణం) వల్ల నేను చేయలేకపోయాను. అప్పటి నా కలల్లో నిన్ను చూసుకోవాలని అనుకుంటున్నాను.. నువ్వు సాధించాలి. నీకోసం నేను ఆఫీసుకు స్కూటరు మీద వెళ్లడం మానేశా. క్యాంటీన్ లో తినడం కూడా మానేశా.. డబ్బు పొదుపు చేసి ఇక్కడ చదివిస్తున్నా.. నా కలలన్నీ నువ్వే’’ లాంటి డైలాగులను ఈ 80 శాతం మంది తండ్రులు చెబుతూనే ఉంటారు. ఆ పిల్లవాడికి చదువులు కాదు ఒత్తిడి, ఇలాంటి తండ్రులు పెంచుకునే ఆశలే అసలు ఒత్తిడి!
కారణాలు ఏవైనా ఒకడికి తాను కన్న కలలను తాను తీర్చుకునే శక్తి లేదు, చేతకాదు. జీవితం అంతేనని, ప్రతి కల నెరవేరాలనే రూలు లేదని సర్దుకుపోవచ్చు. అలా చేయడు. బిడ్డ మీద ఆ కలలు రుద్దడానికి ప్రయత్నిస్తాడు. ప్రతి తండ్రీ.. తన చేతగానితనానికి రుజువుల వంటి కలలను.. బిడ్డల మీద రుద్దేస్తూ ఉంటే.. ఆ బిడ్డలు తమ జీవితం గురించి తాము కలలు కనేది ఎప్పుడు? ఈ తండ్రులు దుర్మార్గులు. పిల్లలు కలలు కనే స్వేచ్ఛను కూడా చిదిమేస్తుంటారు. ఈతప్పు ఎప్పుడూ చేయకండి. మీ కలలను మీతోనే అంతం కానివ్వండి. మీరు సమర్థులైతే నెరవేర్చుకోండి.. లేకపోతే రాజీపడండి. పిల్లల కలలను వారినే కననివ్వండి.
మిస్టేక్ 2: నేను పడ్డ కష్టాలు నీకొద్దు కన్నా..
పిల్లలను ఎందుకూ కొరగానివాళ్లుగా తయారుచేసే దౌర్భాగ్యమైన ప్రేమ ఇది. సమాజంలో 99 శాతం మంది తమ బాల్యం నాటి కుటుంబ స్థితిగతులనుంచి తర్వాతి దశకు ఎదిగి జీవనం గడుపుతుంటారు. బాగా ఎదిగిన వారు కూడా ఉంటారు. బాల్యంలో ఉండే సామాజిక పరిస్థితులు, కుటుంబ ఆర్థిక పరిస్థితుల్లో వారు అనేక రకాల కష్టనష్టాలకు గురయ్యే ఉంటారు. శ్రమకు వెరవకుండా ఇంటికి సంబంధించిన అన్ని పనులూ చేస్తూ ఉండి ఉంటారు. అలాంటి తండ్రుల్లో ఒక ఉదాత్తమైన- అలా అనుకునే దృక్పథం ఉంటుంది. ‘నేను పడిన కష్టాలు నా బిడ్డను పడనివ్వను’ అనేదే ఆ పోకడ. పిల్లలను ఎందుకూ కొరగాని పనికిమాలిన వాళ్లుగా తయారుచేసే వైఖరి ఇది. ఇందులో రెండు రకాలున్నాయి.
ఒకటోరకం- పిల్లలకు శారీరక కష్టం తెలియనివ్వరు. పదిహేడేళ్ల వయసు వస్తుంది.. బజారుకు వెళ్లి సరుకులో, కూరగాయలో తేవడం తెలియదు. అంట్లు కడగడం, ఇల్లు చిమ్మడం లాంటి పనులు తెలియదు. ఒళ్లు ఎక్కువగా అలసిపోయే పొలం పనులు లాంటివైతే అసలు ఊహించలేం. ఒకటో రెండో కిలోమీటర్లు నడిచి వెళ్లి నాలుగు దుకాణాలు తిరిగి సరుకులు తేవడం కాదు కదా.. కనీసం సూపర్ మార్కెట్ కైనా ఒంటరిగా వెళ్లి అవసరమైనవి తేవడం కూడా అలవాటు కాని పిల్లలుంటారు. ఇలాంటి పిల్లల పెంపకం గురించి ఓ పెద్ద ప్రొఫెసర్ గారు ఇలా అంటారు ‘ఈ తండ్రులంతా ఫారం కోళ్లలాంటి పిల్లలను తయారు చేస్తున్నారు’ అని! అందులో అబద్ధం లేదు. అలాంటి అతిశయమైన జాగ్రత్తలతో పెంచడం అనేది.. పిల్లలను, స్వయంగా సంబాళించుకోవాల్సిన చిన్న అవసరం వచ్చినా.. తట్టుకోలేని దౌర్బల్యంలోనికి నెడుతుంది.
రెండోరకం- ఇది ఆర్థిక పరిస్థితికి సంబంధించినది. ‘నేను బాల్యంలో పేదరికంలో ఉన్నాను గనుక.. నా బిడ్డకు పేదరికం అంటే ఏమిటో తెలియకుండా పెంచుతాను’ అనే వాదన. అందమైన ఆత్మవంచనతో కూడిన మాట ఇది. వీళ్లు తమ స్వశక్తితో, తెలివితేటలతో, ఇంకేదైనా మార్గాలతోనో సంపన్నులు అయిన వారు! వారి సంపదను ప్రదర్శించుకోవడం ఒక మోజు! పిల్లలు కూడా, తమ సంపదను ప్రదర్శించే టూల్స్ వారికి! పిల్లలు అడిగీ అడగకముందే ఇబ్బడిముబ్బడిగా డబ్బు అందిస్తుంటారు. ఖర్చులను ఆరాతీయరు. పిల్లలు ఏదైనా చేయాలంటే.. ఆ పనుల మంచిచెడులను గురించి, వారి దక్షత గురించి ఆలోచించరు. అడిగిన డబ్బులన్నీ ఏర్పాటు చేస్తారు. వారి వైఫల్యాలకు తామే కారణం అవుతుంటారు. అవసరానికి మించి డబ్బు చేతిలో మెదలుతుండడం వలన, పిల్లలో పెరిగే అరాచక ధోరణులకు, విచ్చలవిడితనానికి ఈ తండ్రులే కారకులు. ఆ తర్వాత ఎప్పుడో వారు పశ్చాత్తాప పడుతూ జీవితాన్ని వెళ్లదీస్తారు.
మెజారిటీ తండ్రులు చేస్తుండే అనేకానేక మిస్టేక్స్‌లో ఇవి మచ్చుకు రెండు మాత్రమే. పిల్లల భవిష్యత్తు కోసమే బతుకుతున్నాం, కూడబెడుతున్నాం.. అని చెప్పుకుంటూ.. సంపాదనకోసం అనేకానేక అడ్డదారులు తొక్కేవారు అనేకులు. తమ జీవితాన్ని తాము నిర్మించుకున్నట్టుగా.. పిల్లలు కూడా వారి జీవితాన్ని వారే నిర్మించుకోవాలని, అలాంటి విజయంలో ఉండే సంతృప్తి తమ పిల్లలకు కూడా దక్కాలనే స్పృహ వారికి ఉండదు. ఒక సినిమాలో చెప్పినట్టు.. పిల్లల ఆటను కూడా తామే ఆడేయాలని ప్రయత్నిస్తుంటారు.
పిల్లలను సమర్థులుగా తయారుచేయగలిగితే చాలు.. తాము ఇవ్వగల సమస్త సంపదలు ఆ సమర్థత ముందు పూచికపుల్లకు కొరగావనే సత్యాన్ని వారు గుర్తించరు. తాము ఇచ్చేవాటిని మించిన సంపదలను పిల్లలు సృష్టించుకోగలరనే నమ్మకం వారికి ఉండదు. ఆ తండ్రులు భీరువులు! పిల్లలకు మనం సరైన కేరక్టర్ ఇవ్వగలిగితే చాలు. అదే వారి జీవితాలను నిర్దేశిస్తుంది అని వారు గ్రహించరు. సంపదల మీద తప్ప, గుణం మీద నమ్మకంలేని రకం వాళ్లు!
పిల్లల మీద ప్రేమ, అనుబంధం లాంటి అందమైన పదాల వ్యామోహంలో తండ్రులు చేస్తూ ఉండే అనేకానేక తప్పులు మనకు నిత్యం కనపడుతూనే ఉంటాయి. అలాంటివి గమనించినప్పుడు, ఆ తండ్రులను దిద్దవలసిన అవసరం మనకు లేదు, వారినుంచి అలాంటి తప్పులు చేయకుండా మనం పాఠం నేర్చుకుంటే చాలు.
ఇలాంటి ఆలోచనలు ఉంటే, మార్చుకోగలిగిన తండ్రులందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు!
..కె.ఎ. మునిసురేష్ పిళ్లె
No comments:
Post a Comment