Friday, June 16, 2023

మనిషి ఏకాకిగా మనలేడు. విజయం సాధించినప్పుడు ఆనందం పంచుకునేది, బాధ కలిగినప్పుడు సాంత్వన కలిగించేది- బంధుమిత్రుల ఆప్తకదంబమే.
ఆత్మీయులైన పెద్దల ఆశీస్సులే బాలలకు శ్రీరామరక్ష. బాల్యం వికసించడానికి తల్లిదండ్రుల అండదండలు కలిసివస్తాయి. బడిలో స్నేహితులు తోడుంటారు. గురువులు పాఠ్యాంశాలు బోధిస్తారు. ఆటపాటలకు తోటిబాలలు కలిసివస్తారు. బంధువుల రాకపోకలు ఉత్తేజపరుస్తాయి. ఈ ఆప్తకదంబం సహకారంతోనే బాల్యం అర్థవంతమవుతుంది.
యౌవనంలో మిత్రబృందం సహకారం తోడవుతుంది. స్నేహసౌరభం యువతను ఉత్సాహపరుస్తుంది. మంచిమిత్రుల మధ్య అర్థవంతమైన చర్చలు జరిగి ఆలోచనా పరిధి విస్తరిస్తుంది. వివాహానంతరం భార్యాభర్తల కుటుంబాల కలయికతో ఆప్తకదంబం మరింత విస్తరిస్తుంది. మూడుముళ్ల బంధంతో సంతానం వృద్ధిచెంది మూడు తరాల ఆప్తకదంబం ముచ్చట గొలుపుతుంది.
ఆప్తకదంబమే వృద్ధాప్యంలో ఆరోగ్య ప్రదాత. అది మలిసంధ్యలో మానసిక బలం. గతంలో దరి చేర్చుకున్న ఆత్మీయులు వృద్ధాప్యంలో ఆసరా అవుతారు. మనిషి మరణించాక జీవించేది ఆత్మకదంబం అంతరంగంలోనే.

సత్యం తల్లి, జ్ఞానమే తండ్రి, ధర్మం సోదరుడు, దయాగుణం స్నేహితుడు, శాంతం సహధర్మచారిణి, క్షమాగుణం కుమారుడిగా భావించాలి. సత్యం, జ్ఞానం, ధర్మం, దయ, శాంతం, క్షమ అనే ఆరు మంచి లక్షణాలను ఆత్మ బంధువులుగా చేసుకుని జీవనం సాగించాలన్న హితోపదేశం సర్వులకూ అనుసరణీయం.🙏🕉️🌻

No comments:

Post a Comment