మిత ఆహారం-మిత వ్యవహారం
ఏడంతస్తుల మేడ కట్టాడు గురునానక్ శిష్యుడొకడు...
గృహప్రవేశానికి గురువును ఆహ్వానించాడు...
గురువును ఘనంగా సత్కరించాడు శిష్యుడు...
గురువు తిరుగుప్రయాణమౌతూ, తన జోలెలో దాచి ఉంచిన చిన్న సూదిని శిష్యుని చేతిలో పెట్టి, "నాయనా...మనం పరలోకంలో కలుసుకున్నప్పుడు ఈ సూదిని తిరిగి నాకివ్వు" అంటాడు.
శిష్యుడు ఆశ్చర్యపోతూ-
"గురువుగారూ...అదెలా సాధ్యం...!!" అంటాడు.
"ఏడంతస్తుల మేడను నీతోపాటే పరలోకానికి తెచ్చుకోగాలేంది... నా చిన్నసూదిని తేలేవా?" అంటాడు గురువు.
అంతే... గురుబోధ అవగతమైంది శిష్యుడికి.
* * *
పుచ్చిన వక్కయినా మన వెంటరాదు...అంటాడు రామదాసు...
* * *
నీవు పోతే అసలు ప్రపంచమే ఉండదు...
అంటారు మా గురుదేవులు...
* * *
ఇలాంటి కథలు...
ఇలాంటి వాక్యాలు...
సదా మననం చేసుకుంటూ ఉండాలి...
మన పిల్లలకు చెబుతూ వుండాలి...
తరతరాలకు మన ధనం అందాలనుకోవడం కాదు,
నీ జ్ఞానానికి వారు వారసులు కావాలి...
నీ సంస్కారానికి వారసులు కావాలి...
వైరాగ్యమే మన భారతీయ సంపద...
దాన్నెవడూ కొల్లగొట్టలేడు...
"నా నిజమైన వారసులు మీరే"....
అని శిష్యులతో గురువుగారు అన్న మాటలు గుర్తుకొస్తున్నాయి...
ఆస్తులే నిజమైన వారసత్వం అని మన ప్రాచీనులు అనుకునివుంటే...
ప్రాచీన వాఙ్మయం మనవఱకు చేరివుండేది కాదు...
వేదాల్లోని ఒక్క అక్షరం కూడా తాళపత్రాలలో లిఖించబడలేదు...
అవి శ్రుతులు...
ఒకరి నుంచి ఒకరికి శబ్దరూపంగానే తరతరాలుగా అందించుకుంటూ వచ్చారు...
చాలామంది వేదపండితులు నిరక్షరాస్యులు...
అని ఎక్కడో చదివి ఆశ్చర్యపోయాను....
వారికి లిపితో పనిలేదు...
* * *
నాగరికత అభివృద్ధి అంటే
భౌతికపదార్థంలోని ఆత్మశక్తిని గుర్తించడంలో గల క్రమాభివృద్ధి అంటారు వివేకానందులు...
అంతేగానీ మిద్దెలు మేడలు పెరగడం కాదు...
తక్కువ వస్తువులతో...
తక్కువ మాటలతో...
తక్కువ తలంపులతో...
తక్కువ ఆహారంతో...
తక్కువ వ్యవహారంతో...
ఆనందంగా...సుఖశాంతులతో...
గడిపే టెక్నిక్ డెవలప్ కావడమే నిజంగా అభివృద్ధి అంటే.
మన భారతీయ సంస్కృతిని తేటతెల్లంగా అవగాహన చేసుకోవడం వల్లనే అది సుసాధ్యం.
ప్రస్తుతం మన సంస్కృతికి సంబంధించిన అవగాహనను గజిబిజి చేసేసుకున్నాం.
ఓ జోక్ విన్నా ఈ మధ్య....
ఈ సోషల్ మీడియాలో ఆరోగ్యసూత్రాలు బోధించేవాళ్లంతా ఏమి తినొద్దని చెప్పారో, నిజంగా అవన్నీ వదిలేస్తే, మనకు మిగిలేది ఖాళీ కంచమే...అని.
అలా ఈ ఆధ్యాత్మిక ఉపన్యాసకుల వల్ల గజిబిజి పెరిగి, కాస్తో కూస్తో మనకున్న క్లారిటీ కూడా పోయి, ఏం చేయాలో తోచని పరిస్థితి ఏర్పడింది.
ప్రత్యక్ష గురుసన్నిధి ఒక్కదానివల్లనే క్లారిటీ లభిస్తుంది.
వేలగ్రంథాలు చదివినా లభించని స్వరూపనిష్ఠ
ఒక్క సద్గురు సన్నిధి మాత్రంచేతనే లభిస్తుంది.
ఈమధ్య అత్యాశ్రమానికొచ్చిన అతిథి ఒకరు తిరుగుప్రయాణమవుతూ నన్నడిగారు-
"మీరు పొందారా?" అని.
"మీరేమనుకుంటున్నారు?" అని అడిగా...
"మీ రచనలను బట్టి మీరు పొందారనే అనుకుంటున్నాను." అన్నాడు.
'మీరు ఎలాగైనా అనుకోండి....
కానీ "నేను పొందాను" అన్నా అబద్ధం అవుతుంది. "నేను పొందలేదు" అన్నా అబద్ధం అవుతుంది. అని సమాధానమిచ్చాను.
'మౌనం-శూన్యం-పూర్ణం' ఏకమైతే అదే "నేను".
'జననం-జీవితం-మరణం' లేకపోతే అదే "నేను".
అద్దం అన్నిటినీ ప్రతిబింబిస్తుంది.
కానీ తనను తాను ప్రతిబింబించుకోలేదు.
నేను అన్నింటినీ నిర్వచించగలనేగానీ,
నన్ను నేను నిర్వచించుకోలేను.
అందుకే 'నేనెవడను' అనే ప్రశ్న ఎప్పటికీ శేషప్రశ్నే.
సృష్టిలో సమాధానం లేని ఏకైక ప్రశ్న 'నేనెవడను'.
* * *
No comments:
Post a Comment