Monday, July 3, 2023

ఈ పద్యం ఎంతో హృద్యం : శారదాంబకు నైవేద్యం

 ఈ పద్యం ఎంతో హృద్యం : శారదాంబకు నైవేద్యం
***************"********************************* 
 మీరు ఇంటనున్న మీ  చిన్నారులకు ఈ పద్యాలను నేర్పండి. తెలుగుభాషను కాపాడండి. మన సంస్కృతి సంప్రదాయాలను నిలబెట్టండి.

" తల్లీ నిన్ను దలంచి పుస్తకము చేతం
             బూనితిన్ నీవు నా
   యుల్లంబందున నిల్చి, జృంభణముగా
              నుక్తుల్ సుశబ్దంబు శో
   భిల్లం బల్కుము నాదు వాక్కునన్
               సంప్రీతిన్ జగన్మోహినీ !
   పుల్లాబ్జాక్షి! సరస్వతీ! భగవతీ!
                పూర్ణేందుబింబాననా! " 
                               - చాటువు

తెలుగునాట పాఠశాలల్లో వెనకటి కాలంనుంచి ప్రతిదినం చదువు మొదలుపెట్టేటప్పుడు ఇట్లా చదువులతల్లిని ప్రార్థనచేయడం పరిపాటి. 

( ఉక్తులు=మాటలు; పుల్ల+అబ్జ+అక్షి= విరిసిన తామరపూలవంటి కన్నులు గలది; భగవతి=మహిమ గలది; పూర్ణ+ఇందు+బింబ+ఆనన= నిండు జాబిల్లి వంటి మోము గలది.)

తల్లీ! మోహనరూపిణీ!విరిసిన తామరలవంటి కనుదోయి గలదానా!మహిమాన్వితా! పున్నమి చందమామ వంటి మోము గలదానా! సరస్వతీ! నిన్ను తలచుకొని ఈ పుస్తకం చేత బట్టాను. నువ్వు నా హృదయంలో కొలువుండి, నా వాక్కులో నిల్చి, సాదు శబ్దంతో మంచి మాటలు పలికించమ్మా!

అక్షరంతో మొదలయ్యే చదువు అక్షయంగా ( నాశము లేకుండా ) సాగాలంటే ఆ చదువుల తల్లిని ముందుగా వేడుకోవాలని ఉద్దేశం. ఆ  చదువులో ఎన్నెన్నో కొత్త కొత్త మాటలు, అర్థాలు నేర్చుకోవాలి. వాక్కులో ఉచ్ఛారణ దోషం ఉండకూడదు. చక్కని శబ్దం ఉట్టిపడాలి. 

సరస్వతీ దేవిది పున్నమి చందమామ వంటి మోము. అది విద్యార్థికి వికాసం కలిగిస్తుంది. ఆమె భగవతి. సకల శుభాలనిస్తుంది. తన జ్ఞానసౌందర్యంతో లోకాలనే వశంచేసుకొనగలదు. అన్నింటినీ మించి ఆ తల్లి విద్యార్థి హృదయంలో కొలువై ఉండాలి. అంటే, విద్యార్థి ఎల్లప్పుడూ చదువునే ధ్యానించాలి! ఆరాధించాలి! తల్లి తన పిల్లలను కాపాడినట్లు ఆ చదువుల తల్లి విద్యార్థిని కాపాడుతుంది.

ఇంత మేలిమి చాటు పద్యం ఎవరిదో తెలియదు. ఏ పోతనవంటి మహాకవి చెప్నాడో?  ' చాటువు ' అంటే ప్రియమైన మాట. కర్త తెలియని, గ్రంథస్తంకాని, ప్రజాదరణ పొందిన అనేక చాటుపద్యాలు ఇప్పటికీ ప్రజల నాలుకల మీద నాట్యం చేస్తుంటాయి. 
🙏🏻🙏🏻🙏🏻

No comments:

Post a Comment