Wednesday, July 12, 2023

భీష్ముడి ఉపదేశం

 *భీష్ముడి ఉపదేశం* 
                 ➖➖➖✍️

*మహాభారత యుద్ధం సమాప్తమయ్యాక జ్ఞాతులందరూ చనిపోయి దుఃఖంతో కుమిలిపోతున్న ధర్మరాజును అంపశయ్యమీద ఉన్న భీష్ముడి వద్దకు శ్రీకృష్ణుడు తీసుకువెడతాడు.* 

*ధర్మశాస్త్రమంతా నిత్యం మనసులో నిలుపుకొనే భీష్ముణ్ని  ధర్మరాజు మనసులోని శోకాన్ని తొలగించాల్సిందిగా శ్రీకృష్ణుడు కోరతాడు.* 

*ఆ సందర్భంగా భీష్ముడు ధర్మరాజుకు తెలియజెప్పిన శాంతిమార్గం కలియుగంలోని మానవులకు కర్తవ్యబోధ.*

*దుర్గమమైన బాధలనుంచి తరించగలిగే మార్గం చెప్పమని యుధిష్ఠిరుడు అడిగినప్పుడు నియమబద్ధమైన నడవడిక కలవారు కష్టాలనుంచి తరించగలరని భీష్ముడు వివరించాడు.*

*మనసా వాచా కర్మణా పాపం చేయని ధర్మవేత్తలను కష్టాలు బాధించవు. రజోగుణం పూర్తిగా శాంతించి, తమోగుణాన్ని తుడిచిపెట్టి సత్వగుణ  స్థితులైనవారు దుర్గమమైన కష్టాలను సులభంగా దాటగలుగుతారు. సమస్త జీవులకు ఈశ్వరుడు, జగత్తునకు ఉత్పత్తి, ప్రళయ కారకుడైన భగవంతుడు నారాయణుడిని భక్తిభావంతో ఆశ్రయించేవారు కష్టాలనుంచి గట్టెక్కగలరని భీష్ముడు ఉపదేశించాడు.*

*ఇంద్రియ నిగ్రహం స్థిరంగా ఉన్నవారు, సుఖదుఃఖాలను సమంగా భావించేవారు, ఆధ్యాత్మిక మార్గంలో పయనించేవారు శిష్టులని భీష్ముడు ధర్మరాజుకు విశదీకరించాడు.* 

*సత్పురుషులు ఎల్లప్పుడూ సత్యం అనే సనాతన ధర్మాన్ని అనుష్ఠించాలని, సత్యమే గొప్ప యజ్ఞమని, ధర్మాన్ని కాపాడేది సత్యమే కనుక మానవుడు సత్యతత్పరుడు కావాలని భీష్ముడు బోధించాడు.* 

*వేయి అశ్వమేధ యజ్ఞాల ఫలాలను ఒకవైపు, సత్యవచన ఫలాన్ని మరొకవైపు ఉంచితే సత్యం వైపే త్రాసు మొగ్గు చూపుతుందన్న భీష్ముడి ప్రవచనం మహత్తరమైన సత్యధర్మాన్ని విశదీక రించింది.* 

*లోభం వల్లనే పాపం, అధర్మం, దుఃఖం కలుగుతాయని భీష్ముడు ఉపదేశించాడు.* 

*కపటానికి, మోసానికి, కోపానికి, అజ్ఞానానికి మూలకారణం లోభం కనుక దాన్ని వదిలినవారు సుఖపడతారని తెలియజేశాడు.*

*‘మంచి ఆలోచనలతో ధర్మాన్ని పొందాలి. క్రోధం క్షమాగుణంతో అంతమవుతుంది. కామం విరక్తితో నశిస్తుంది. విజ్ఞానవంతులను గౌరవిస్తే మోహం తొలగుతుంది. తత్వజ్ఞానం మంచి కార్యాలవైపు దృష్టి మళ్లిస్తుంది.*

*శోకించడం వ్యర్థం అన్న భావనతో శోకం నశిస్తుంది. సర్వ ప్రాణుల పట్ల దయాగుణం కలిగి ఉండటమే హింసా ప్రవృత్తికి నివారణోపాయం. ఉత్తమ పురుష సాంగత్యంతో మనసు మాత్సర్యరహితమవుతుంది.*

*వివేకశీలమైన బుద్ధి ఈర్ష్యను పారదోలుతుంది. దయాగుణం జాగృతమై అసూయ తొలగుతుంది. ధర్మాత్ముల మైత్రితో పిసినిగొట్టుతనం పోతుంది. భోగాలు అశాశ్వతమని గ్రహిస్తే లోభం నివృత్తమవుతుంది.* 

*సంయమనంతో ఆశను జయించాలి. సంతృప్తితో తృష్ణను జయించవచ్చు. ప్రయత్నంతో సోమరితనాన్ని, శాస్త్ర నిర్ణయంతో విపరీత తర్కాన్ని, శౌర్యంతో భయాన్ని విడిచిపెట్టాలి.   మనసును, వాక్కును బుద్ధితో వశపరచుకోవాలి’ అని బోధించి మానవుణ్ని పట్టి పీడించే దోషాలు, వాటి నివారణోపాయాలను భీష్ముడు విశదీకరించాడు.*

*భీష్ముడి హితబోధలు అర్థం చేసుకుని అనుసరించినవారు జీవించినంతకాలం సత్కర్మలను ఆచరిస్తూ జీవితాన్ని తీర్చిదిద్దుకుని భగవంతుడి కృపకు పాత్రులు కాగలుగుతారు.*✍️

.                      🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺

No comments:

Post a Comment