🎻🌹🙏ధర్మ మహిమ - చక్వవేణ మహారాజు కథ...!!
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸
🌿“ధనం పెరిగిన కొద్దీ దానం పెరగాలి. విలాసాలు,డాబు పెంచుకున్నారంటే, ఏ నాటికైనా పతనం తప్పదు.”
🌸వరిపంటకు నీరు లేకపోతే ఎండిపోతుంది, సమంగా ఉంటే బంగారం పండుతుంది, అధికమైతే,
ఆ నీటనే మునిగి, కుళ్ళి, నశిస్తుంది.
🌿 ఇక్కడ నీటినే ధనం అనుకుంటే... తగినంత లేకుంటే కరువు, సరిపడా ఉంటే సమృద్ధి, ఎక్కువైతే... తనను తానే నశింపచేసుకునే రాచమార్గం !
🌸 అదే అధికంగా ఉన్న ధనాన్ని(నీటిని తీసివేస్తే) దానం చేస్తే తిరిగి దైవానుగ్రహమనే దివ్య ఫలాన్ని పొందవచ్చు.
🌿ఇప్పుడు లోకం తీరు మారింది. ఉన్నది తినేకంటే, తింటూ ఎదుటివాడికి చూపి, గొప్పలు కొట్టుకునే పధ్ధతి పెరిగింది. తమకున్న డబ్బు, కార్లు, బంగళాలు, విలాస వస్తువులు, తిరిగిన ప్రాంతాలు అన్నీ వెంటనే ఇతరులకు సోషల్ మీడియా ద్వారా చూపాలి.
🌸 చీరలు, నగలు ధరించి, షోకేసు లో బొమ్మల్లా , ఇతరులకు ప్రదర్శించాలి. నిజానికి ఇటువంటి వారి చూపు, నవ్వు, ప్రదర్శన అంతా పటాటోపమే, వీరికి అంతర్గత శాంతి ఉండదు.
🌿వీరిని చూసి, ఇతరులు అనుకరించరాదు. మరి అంతర్గత శాంతి, ధర్మచక్రం యొక్క బలం ఎలా ఉంటుంది, అని అడిగేవారు, చక్వవేణ మహారాజు కధను, తప్పక చదివి తెలుసుకోవాలి !!
🌸పూర్వం చక్వవేణుడు అనే ధర్మాత్ముడు, సదాచారపరాయణుడు, సత్యవాది, దయామయుడు, మహాజ్ఞాని, అయిన మహారాజు ఉండేవాడు.
🌿అతను రాజద్రవ్యాన్ని తనకోసం వాడుకోవడం దోషంగా భావించి, భార్యతో తన పొలంలో వ్యవసాయం చేసుకునేవాడు. రాణి నాగలి లాగితే, రాజు విత్తనాలు చల్లేవాడు. తమ పొలంలో పండిన ప్రత్తితో బట్టలు చేసుకు ధరించేవాడు.
🌸తమ పొలంలో పండిన ఆహారమే తినేవారు. రాణికి ఖరీదైన ఆభరణాలు ఉండేవి కావు, వారి కష్టార్జితం వారి జీవనానికే సరిపోయేది.
🌿ఒకనాడు ఆ రాజ్యంలో జరిగిన తీర్ధానికి వచ్చిన ధనికులైన వ్యాపారుల భార్యలు, ఆడంబరంగా రాణిని దర్శించి, ఆమె కూడా మహారాజును అడిగి, అటువంటివి ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
🌸వారి మాటలు విన్న రాణి, చక్వవేణుడిని, తనకూ విలువైన వస్త్రాభరణాలు కావాలని కోరింది. రాజు బాగా ఆలోచించాడు- తాను రాజద్రవ్యాన్ని ముట్టడు, కాని తను సామ్రాట్టు కనుక, దుష్టులు, బలవంతులు, అత్యాచారులు అయిన రాజుల నుంచి పన్నును వసూలు చెయ్యవచ్చు, అనుకున్నాడు.
🌿 తన మంత్రిని రప్పించి, “రాక్షస రాజైన రావణుడి వద్దకు వెళ్లి, నేను 1.25 మణుగుల బరువైన బంగారాన్ని పన్నుగా చెల్లించమని, ఆజ్ఞాపించాను అని చెప్పి, తీసుకురమ్మని “ అనుజ్ఞ ఇచ్చాడు.
🌸మంత్రి తెచ్చిన వార్తను విన్న రావణుడు అతన్ని పరిహాసం చేసి, పంపాడు. ఇదే విషయాన్ని మండోదరికి చెప్పగా, ఆమె ‘స్వామి ! పొరపాటు చేసారు. వారడిగిన బంగారం ఇవ్వాల్సింది. చక్వవేణుడి మహిమను రేపు ఉదయం మీకు చూపుతాను, ‘ అంది.
🌿ఉదయం ఆమె పావురాలకు గింజలు వేసి, అవి తింటూ ఉండగా, ‘రావణుడి మీద ఆన, గింజలు ముట్టకండి, ‘ అంది, అవి లెక్కచెయ్యక, తినసాగాయి. వెంటనే ఆమె, ‘చక్వవేణుడిపై ఆన, ఇక గింజలు ముట్టకండి,’ అంది, వెంటనే పావురాలు అన్నీ ఎగిరిపోయాయి.
🌸ఒక చెవిటి పావురం వినబడక, గింజ తినగానే, తల తెగి, క్రింద పడింది. తర్వాత రాణి, ‘చక్వవేణ మహారాజుపై ఆనను ఉపసంహరిస్తున్నాను, గింజలు తినండి,’ అనగానే, పక్షులు మళ్ళీ గింజలు తినసాగాయి.
🌿 ‘చూసారా స్వామి ! ఇదీ చక్వవేణుడి ధర్మ చక్ర మహిమ,’ అంది, మండోదరి. ‘పిచ్చి పక్షులకు ఏమి తెలుస్తుంది ?’ అంటూ కొట్టి పారేసాడు రావణుడు.
🌸చక్వవేణుడి మంత్రి సముద్ర తీరానికి చేరి, ఇసుక, మట్టితో లంకా నగర నమూనాను సరిగ్గా అలాగే చేసి, ‘ఒక వినోదం చూపుతాను,’ అంటూ, రావణుడిని పిలుచుకువచ్చాడు.
🌿 ‘చక్వవేణ మహారాజుపై ఆన’, అంటూ నమూనాలో తూర్పువైపు ఉన్న బురుజులు, ప్రాకారాలను పడగొట్టగానే, లంకలో నిజంగా అమరిఉన్న నిజమైన తూర్పు వైపు బురుజు, ప్రాకారం కూలిపోయాయి.
🌸హతాశుడయ్యాడు రావణుడు. అలాగే మంత్రి, నమూనాలో ఉన్న తూర్పువైపు స్థూపాలు, ‘చక్వవేణ మహారాజుపై ఆన’ అంటూ, పడగొట్టగానే నిజ లంకాపుర స్థూపాలు కూలిపోయాయి.
🌿ఇది చూసి, బెదిరిన రావణుడు, మంత్రి కోరిన బంగారాన్ని అతడికి ఇచ్చి, పంపేశాడు. మంత్రి చక్వవేణుడికి బంగారం ఇవ్వగా, అతడు అది ఎలా తెచ్చావో చెప్పమని, మంత్రిని అడిగాడు.
🌸మంత్రి చెప్పింది విన్న రాణి ఆశ్చర్యచకితురాలు అయ్యింది. ఆమె పవిత్రవర్తనం యొక్క మహిమ తెలుసుకుని, బంగారం వద్దంది. ఆ బంగారం తిరిగి, రావణుడికి పంపివెయ్యబడింది.
🌿అన్ని లోకాలను ప్రభావితం చెయ్యగల చక్వవేణుడి త్యాగబుద్ధిని తెలుసుకుని, రావణుడి హృదయం కూడా పరివర్తన చెంది, మంత్రిని ఆదరించి, పంపివేసాడు.
నీతి :
🌸క్షణకాల దుస్సంగాత్యం కూడా అనర్ధాన్ని కలిగిస్తుంది. అందుకే దురభ్యాసాలు, మత్తుపదార్దాలు, క్రీడావినోదాలు, ఖరీదైన ఆడంబరాలతో గడిపేవారి సాంగత్యం వదలాలి.
🌿 మోసంతో ఆర్జించిన మృష్టాన్నం కూడా విషతుల్యమే అవుతుంది. పవిత్ర ద్రవ్యం వల్ల ప్రాప్తించిన పిడికెడు అన్నమైనా అమృతతుల్యం అవుతుంది. 💐💐
No comments:
Post a Comment