*నానుడి కథలు 45*
*కొంగ జపం*
మోసం చేయాలనే తలంపు మనసులో ఉంచుకుని, పైకి ఏమి తెలియని అమాయకులు లా నటించి భక్తిశ్రద్ధలు చూపేవారి ప్రవర్తనను 'కొంగ జపం'తో పోలుస్తారు. ఈ మధ్య చాలా మంది బాబాలు, సన్యాసులు దేవుని సేవ చేస్తున్నట్టు నటిస్తూ, కోట్లకు కోట్లు ఆస్తులు సంపాదిస్తున్నట్టు మనం వింటూ ఉన్నాం. ఈ సంపాదన కోసమే వీరు భక్తి ముసుగు వేసుకున్నారు. ఎదురుగా భక్తులను కూర్చోబెట్టుకుని చాలా పవిత్రంగా భక్తి ప్రవచనాలు చెబుతూ వుంటారు. ఆ తరువాత అందిన కాడికి అందినంత దోచుకుంటారు. ఇలా భక్తులకు మాయమాటలు చెప్పేటప్పుడు చాలా మంచివారుగా కనిపిస్తారు. అలాంటప్పుడే ఆయన కొంగ జపం చేస్తున్నట్టు చెప్పుకోవొచ్చు. కొంగ జపం నానుడి ఎలా వచ్చిందో చూద్దాం. ఇది కూడా పంచతంత్ర కథల నుండే వచ్చింది.
పంచతంత్రాలలో విగ్రహం అనేది ఒక తంత్రం. ఈ విగ్రహం లో ఉన్న అనేక కథలలో కొంగ కథ ఒకటి. యమునానది తీరాన ఒక చెరువు ఉంది. ఆ చెరువులో చాలా రకాల చేపలు ఉన్నాయి. ఓ కొంగకు వాటిని తినాలనే ఆశ పుట్టింది. మాములుగా వస్తే ఏ చేప చిక్కదు. దాని కడుపు నిండేది ఎలా? అందువల్ల దానికి ఓ ఆలోచన వచ్చింది. మోసం చేసి వాటిని తినాలి అనుకుంది. చెరువు వద్దకు వచ్చింది. ఒక కాలు పైకెత్తింది. కళ్ళు మూసుకుంది. ఒంటి కాలుపై నిలబడింది. నోరు ఆడిస్తూ జపం చేసేది. ఇలా రోజు జరిగేది. కొంగపై చేపలకు నమ్మకం కుదిరింది. మంచి కొంగే అనుకున్నాయి. నమ్మకం కలిగించిన కొంగ, ఎవరూ చూడని సమయంలో దగ్గరకు వచ్చిన చేపను నోట కరుచుకుని పక్కనే ఉన్న కొండ పైకి తీసుకువెళ్లి కమ్మగా తినేది. ఏమి ఎరుగనట్టు మళ్ళీ వచ్చి యదాతధంగా జపం చేసేది. ఇలా చాలా రోజులు గడిచాయి. అప్పటికే చాలా చేపలు దానికి ఆహారం అయ్యాయి. ఈ సంగతి చేపలు గ్రహించాయి. ఎలాగైతేనేం ఒకరోజు చెరువులోని ఓ ఎండ్రకాయ ఆ కపట కొంగను చంపేసింది. ఇదీ కథ.
ఈ కథలో కొంగ దొంగ జపం చేసింది. మోసంతో చేపలను నమ్మించింది. చివరికి తన బుద్ధి బయట పెట్టుకుంది. ఇలా మన సమాజంలో కూడా అనేకమంది వుంటారు. మంచిగా నటిస్తారు. చివరకు హాని చేస్తారు. ఈ విధంగా మోసం చేయటానికి నటించే వాళ్లను *కొంగ జపం* చేస్తున్నాడు అని ఈ నానుడితో చెపుతారు.
*౼ డా.దార్ల బుజ్జిబాబు*
No comments:
Post a Comment