పిశాచాల్ని పెంచకండి....
మీ బాబు ఎదుగుతున్న మొక్కైతే మీరు సంరక్షించే తోటమాలులు మీ పాప విచ్చుకుంటున్న కనుపాప ఐతే మీరు ధూళిచేరనీయని కనురెప్పలు. అప్పటివరకూ స్త్రీ పురుషులు తమకోసం బ్రతికి తమనుండి ప్రతిరూపాలు వచ్చాక బ్రతుకు వారికోసమే అన్నట్టు మారిపోవడం, తమకు జన్మనిచ్చిన తల్లి తండ్రులకన్నా, తాము జన్మనిచ్చిన బిడ్డలపై మమకారం చూపడం ప్రకృతి వైచిత్రి కదండీ! సరే కాకిపిల్ల కాకికి ముద్దనేది కాదనలేం కానీ ఆ పిల్ల కాకులు సమాజ శాంతికి ఇబ్బంది కల్గిస్తున్న పరిస్థితుల్లో మాత్రం తప్పకుండా పట్టించుకోవాల్సివుంటుoది. మందుకొట్టి కారుతో ప్రాణాలుతీసే 10వ తరగతి పిశాచాలు, ఆడపిల్లల మానాలు చెరిచే యువకీచకులు, బైకులు, లాప్ టాప్ లు అమ్మేసే ఇంజనీరింగ్ వెధవలు... వీరి విపరీత ప్రవర్తనకు కారణమేమంటారు? తల్లిదండ్రుల ద్రుతరాస్ట్ర ప్రేమ కాదంటారా? అద్దెగర్భాలూ, టెస్ట్ ట్యూబ్ తంటాలతో సహితం పిల్లల్ని కని, వారు తమను ఉద్ధరించేస్తారనే ఆశతో ఏంచేస్తున్నా కిమ్మనక, ఏం అడిగినా కాదనక పెంచిన వారు మలివయసులో ఒంటరిగా లేదా ‘ముసలి గృహాలలో’ వుంచటం తప్ప ఏం మిగులుతోంది? అలా కాకుండా ఓ పదిమంది అనాధ పిల్లలను చదివిస్తే ఆ నలుగురైనా మిగులుతారేమో! ఆరోజుల్లో పెద్దలు పిల్లల్ని మరీ ఇంతగా పట్టించుకునేవారు కాదు. అయినా అభిమానం, గౌరవం ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు రివర్స్..పిల్లల్ని ప్రేమించడం ఎక్కువైంది... వారు మాత్రం ఖాతరుచేయడం తక్కువైంది. ఇది ఎత్తునుంచి దిగువకు ప్రవహించే నీరులా వుంది. తల్లిదండ్రులు కడుపుమాడ్చుకుని తినిపించిడమేతప్ప తిరిగి తమను చూసే బిడ్డలు తక్కువైపోయారు. అలాఅని మనం ఏమీ ఇవ్వకుండానే పిల్లలనుండి ఎదో ఆశించడం కూడా తప్పే సుమా..అయితే ఆ ఇవ్వడంలోనే విజ్ఞత వుంది. లక్షన్నర బైక్, ఇరవైవేల ఫోన్, ఐదువేల డ్రెస్ కాదు ఇవ్వాల్సింది.. నిజాయితీ, నమ్మకం, నిగర్వం, నిర్భయత వెరసి నాణ్యత ఇవ్వగలిగినపుడు శ్రీరామచంద్రులు కాకున్నా శిఖండులు మాత్రం తయారుకారు. పిల్లల్ని కూడా పెట్టుబడి వస్తువులుగానే భావిస్తున్న పేరెంట్స్ ని చూస్తుంటే జాలి, భయం కలుగుతుంది.ఎక్కువ పెట్టుబడి పెడితే ఎక్కువ రాబడి వస్తుందనేది వ్యాపార సూత్రo కావచ్చుకానీ విలువల సూత్రం మాత్రం కాదు. ఇంజనీరింగ్ లో పద్దెనిమిది బ్యాక్ లాగ్ సబ్జెక్టులు మిగిలిపోయిన కొడుకును లక్ష రూపాయలు తగలేసి ఫైనల్ ఇయర్లో IES కోచింగుకు పంపిన ఒకానొక తల్లిదండ్రులను అమాయకులనాలా? మూర్ఖులనాలా? బైక్ కొనకపోతే కాలేజికి వెళ్లనని మొండికేసే వాడు పెద్దయితే మెడపై కత్తి పెట్టి డబ్బు అడగడా? పాప తెగ మాట్లాడేస్తున్న మొబైల్ ఫ్రెండ్ మగా, ఆడా అనేది పసికట్టలేని తల్లి స్నేహితురాలెలా అవుతుంది? మొక్కై వంగనిది మానై వంగునా!!! ఎక్కువమంది తల్లిదండ్రులు తమ బిడ్డ చేతిని అలాగే పట్టివుంచేస్తూ ‘బొమ్మరిల్లు’ తండ్రులైపోతున్నారు. ఇది తరువాతి రోజుల్లో ఆ పిల్లల్లో విశృంఖలత్వానికి గానీ, చేతకానితనానికిగానీ డారితీసే ప్రమాదం వుంది. తల్లిదండ్రులుగా మనం గనిలోపనిచేసే కార్మికుల నెత్తినుండే రక్షణదీపాలం మాత్రమే. పనిచేయాల్సింది, రక్షించుకోవాల్సింది మాత్రం పిల్లలనే కార్మికులేనని గుర్తించండి. నేర్చుకోవడాన్ని నేర్పించండి. అన్నిటికి మీతోడు కావాలనుకోకండి. పిల్లలనుండి వయస్సు, మేధస్సుకు తగ్గట్టుగా ఆశించడం, ఆలోచనలు చేయడం అవసరం. ప్రపంచంలో ఏ ఇద్దరు వ్యక్తులూ ఒకేలా ప్రవర్తించరని మనోవిజ్ఞాన పరిశోధనలు చెపుతున్నపుడు పిల్లలు ఒకేలా సాధించేయాలనుకోవడం అత్యాశ కాదా? ఆందోళన వద్దు అబ్బాయి పరీక్ష తప్పాడని.. వాడొక ఎడిసన్ కాగలడేమో! అసూయ వద్దు, పక్కిoటి అమ్మాయి కలెక్టర్ అయిందని..మనమ్మాయి జాతికి వన్నె తెచ్చే ఝాన్సిలక్ష్మిభాయి కావచ్చు.. మొహం మాడ్చేయ వద్దు.. ఎదురింటి అమ్మాయి మెడిసిన్ సీటు కొట్టేసిందని..నీ మనుమరాలు సమాజ రుగ్మతలకు మందు వేస్తుందేమో.. బ్రతుకు పొలిమేర బాల్యం అన్నాడో మహనీయుడు. బాల్యం అన్నిటిని ఆమోదించే వయస్సుకూడా. పిల్లల్ని ఎలా కావాలంటే అలా తీర్చిదిద్దుకోవచ్చునంటాడు వాట్సన్. అబ్రహం లింకన్ తన పిల్లవాన్ని ఎలా తీర్చిదిద్దాలో టీచర్లకు లేఖరాసాడు. నెహ్రూ లేఖలు ఇందిరమ్మను ఏంతో ప్రభావితం చేసాయంట. ఈ మధ్యే ఒక అధ్బుత విషయం చదవడం జరిగింది. ఒక మాస్టారు హాస్టల్ లో వుండి చదువుకుంటున్న తన కొడుక్కి ప్రతిరోజూ ఒక కార్డు పోస్టు చేస్తాడంట. ఆ అబ్బాయి ఎలా తప్పు చేయగలడు? చిన్నప్పుడు పిల్లలు ఏడుస్తారని ఉపేక్షిస్తే తరువాత పెద్దలు ఏడవాల్సివుంటుంది. ఏమో చాలామంది అంటారు గురువులే అన్నీ చేసేయగలరని..కాని నేను నమ్ముతాను ఆదిగురువులైన తల్లిదండ్రులే పిల్లల నుదిటి రాతను రాయగలరని. పరీక్షల్లో కొడుక్కి స్లిప్పులందించే ‘నువ్వు నాకు నచ్చావ్’ నాన్నలు, మందు కొడితే పెద్దతప్పేమీ కాదని సమర్ధించే ‘ప్రేమమ్’ మామయ్యలూ పిల్లల భవిష్యత్తును తీర్చి దిద్దుతున్నారో, తగలేస్తున్నారో వారికే తెలియాలి. లోహాలకు తుప్పు పట్టకుండా పూత వేస్తున్నాం.. పిల్లలు తప్పు చేయకుండా వాతలేయలేమా??? పుస్తక పఠనం చికెన్ పలావ్ కన్నా రుచికరమైందని, మొక్కల్ని పెంచడం రోడ్లమ్మట తిరగటం కన్నా ఆనందమని, తరగతిలో గురువుగారి ‘సెహభాష్’ అనే మెప్పు సిగరెట్, మందు కన్నా గొప్పకిక్ ఇస్తుందని తెలుసుకోగలిగితే పిల్లలు పిశాచాలుగా కాక పిడుగులుగా తయారుకాగలరు..
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
No comments:
Post a Comment