🙏🙏🙏🌼🌼🌼🌼🙏🙏🙏
*🌼 ఒక యోగి ఆత్మకథ-24*
*(🖌️రచన :- శ్రీ పరమహంస యోగానంద)
*🌼6-అధ్యాయం*
*🌼టైగర్ స్వామి*
“వాళ్ళ ఊహల్లో అల్లుకొన్న మరో కథ ఏమిటంటే, జంతువులన్నీ కలిసి పులుల స్వర్గానికి పెట్టుకున్న మొర ఫలించి రాజా-బేగం అవతరించిందట. పులిజాతి కంతకూ తలవంపులు తెస్తున్న వెరపులేని ద్విపాద పశువును శిక్షించడానికి అది సాధనమట!
జూలులేని, కోరలులేని మానవ మాత్రుడొకడు, పంజాలతోనూ బలిష్టమైన అవయవాలతోనూ ఉండే పులిని సవాలు చెయ్యడానికి సాహిసించడమా! అవమానానికి గురి అయిన పులులన్నిటి విద్వేషవిషమూ సాంద్రీభూతమయి ఏర్పడ్డ శక్తికి, గుప్త నియమాల్ని పనిచేసేటట్టు చేసి, పులుల్ని దండించే గర్విష్ఠిని మట్టుపెట్టడానికి తగినంత చలనం వచ్చిందనీ పల్లెప్రజలు ప్రకటించారు.
“మనిషికీ మృగానికి మధ్య జరిగే ఈ పోట్లాటకు యువరాజే నిర్వాహకుడిగా వ్యవహరిస్తున్నాడని కూడా నా నౌకరు చెప్పాడు. వేలకొద్ది ప్రేక్షకజనం పట్టడానికి వీలయిన డేరా, ఆయనే దగ్గరుండి వేయించాడట; తుఫానుకు కూడా తట్టుకోగలిగేటంత దిట్టంగా వేయించాడు.
దాని మధ్యలో బ్రహ్మాండమైన బోనులో రాజా-బేగం ఉంది; బోను చుట్టూ కాపుదల గది ఏర్పాటయి ఉంది. బోనులో బందీగా ఉన్న పులి, నెత్తురు తోడుకుపోయేటంత భయంకరంగా గర్జిస్తోంది. దానికి కోపంతో బాటు ఆకలి రగిలించడం కోసం తిండి అడపాతడపా పెడుతూ వచ్చారు. బహుశా, నేనే దానికి విందు భోజనం అవుతానని అనుకొని ఉంటాడు ఆ యువరాజు!
“సాటిలేని ఈ పోటీని గురించి బాగా టముకు వేయించినందువల్ల, నగరంలోవాళ్ళూ బయటివాళ్ళూ కూడా తండోపతండాలుగా వచ్చి టిక్కెట్లు కొనుక్కున్నారు. పోట్లాట జరిగేనాడు, వందలాది జనం, టిక్కెట్లు దొరక్క వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. చాలామంది, డేరా కంతల్లోంచి చొరబడి గేలరీల కింద ఉన్న చోటకు చేరి కిక్కిరిసిపోయారు.”
టైగరు స్వామి కథ మంచి పట్టులోకి వస్తూంటే, నాలో ఉద్రేకం పెల్లుబుకుతూ వచ్చింది; చండి కూడా మూగబోయి శ్రద్ధగా వింటున్నాడు.
“ఒక పక్క రాజా - బేగం చెవులు చిల్లులుపడేలా గర్జిస్తోంది; మరోపక్క, కొంచెం కంగారుపడ్డ ప్రేక్షక జనం గోల చేస్తున్నారు. ఆ మధ్యలో నేను ప్రశాంతంగా ప్రవేశించాను. నడుముకు చుట్టి కట్టుకొన్న చిన్న గుడ్డ తప్ప నా ఒంటిని కాసుకోడానికి మరే బట్టలు లేవు. కాపుదల గది తలుపు గడియ తీసి లోపలికి నిబ్బరంగా వెళ్ళి మళ్ళీ బిగించాను.
మనిషి నెత్తురు పసిగట్టింది పులి. చువ్వలు ఫెళఫెళలాడేటంతగా రొద చేస్తూ ముందుకు ఉరుకుతూ నాకు మహోగ్రంగా స్వాగతం ఇచ్చింది. జాలీ భయమూ కలగలుపుగా కలిగిన ప్రేక్షకుల్లో నిశ్శబ్దం ఆవరించింది-- మహోగ్రమైన క్రూరమృగం ముందు నే నొక గొర్రెపిల్ల మోస్తరుగా కనిపించాను.
“ఒక్క క్షణంలో నేను బోనులోకి ప్రవేశించాను; కాని నేను తలుపు మూస్తూ ఉండగానే రాజా-బేగం నిలువునా నా మీదకి వచ్చిపడింది. నా కుడిచెయ్యి ఘోరంగా చీలుకుపోయింది. పులికి అన్నిటికంటె ఇష్టమైన మానవరక్తం చేతినుంచి వరదలా ప్రవహించింది. ఆనాడు సాధువు చెప్పిన జోస్యం నిజమవుతున్నట్టు అనిపించింది.
“అంతకు ముందెన్నడూ ఎరగనంత తీవ్రమైన గాయం మొట్టమొదటిసారిగా అవడంతో మెరుపుదెబ్బ తిన్నట్టయి, తక్షణమే నేను తేరుకున్నాను. నెత్తురు ఓడుతున్న వేళ్ళు దాని కంటికి కనబడకుండా ఉండాలని, అంగోస్త్రం కింద పెట్టేశాను. ఎడమచేత్తో విసురుగా, ఎముకలు విరిగేలా ఒక్క గుద్దు గుద్దాను. దాంతో పులి వెనక్కి తిరగబడి బోనులో వెనకతట్టున గింగిరాలు తిరిగి మళ్ళీ నా ఎదటికి వచ్చింది. పిడిగుద్దులకు మనం పెట్టింది పేరు; ఆ పిడుగుద్దులతో దాని నెత్తిమీద దబదబా మొత్తాను.
“చాలాకాలం పాటు సారా చిక్కని తాగుబోతుకి మళ్ళీ అది చిక్కితే, మొదటి పీల్పు ఎంత వెర్రెత్తిస్తుందో, రాజా-బేగంకు నెత్తుటి రుచి అంత వెర్రెత్తించింది.
మధ్యమధ్య చెవులు గళ్ళుపడేలా గాండ్రిస్తూ, కోపంతో రెచ్చిపోతూ నామీద విరుచుకు పడింది. వాడిగా ఉన్న పంజాలూ కోరలూ గల ఆ పులిముందు నేను, ఒంటిచేత్తో కాసుకోవలసి ఉన్నందువల్ల దాని వాతపడే పరిస్థితిలో పడ్డాను. అయినా దానికి దిమ్మ తిరిగేటట్టు దెబ్బ తియ్యకపోలేదు.
ఇద్దరమూ చావో బతుకో తేల్చుకోవలసినంత తీవ్రంగా పెనుగులాడుతున్నాం. బోను బోనంతా గందరగోళమయి పోయింది; నెత్తురు అన్ని వైపులకీ చిమ్మేసింది. బాధా కసీ కలిసిన గాండ్రింపులు దాని గొంతులోంచి వెలువడుతున్నాయి.
" ‘కాల్చండి! ‘పులిని చంపండి!’ అంటూ ప్రేక్షకుల్లోంచి కేకలు వినవచ్చాయి. ఈ పెనుగులాటలో మనిషి మృగమూ కూడా వడివడిగా తిరుగుతుండడం వల్ల, రక్షక భటుడు కొట్టిన తుపాకిగుండు గురి తప్పిపోయింది కూడా.
నేను నా సంకల్పశక్తి నంతనూ కూడగట్టుకొని భయంకరంగా హుంకరిస్తూ చిట్టచివరి చావుదెబ్బ కొట్టాను. పులి కూలబడి పోయి చడీ చప్పుడూ లేకుండా పడుకుంది.
“పిల్లిలాగ!” అన్నాను మధ్యలో, ఉండబట్టలేక.
నా మాటకు మెచ్చుకుంటున్నట్టుగా నవ్వారు స్వామీజీ. తరవాత, మంచి పట్టుగా సాగుతున్న కథ మళ్ళీ కొనసాగించారు
సశేషం:-🚩
No comments:
Post a Comment