* *తల్లి పెంపకం*
"గాయత్రి" మంచి అందం, అణకువ, చదువు, సంస్కారం గల ఒకపేద బ్రాహ్మణయువతి. చిన్నతనంలోనే తండ్రి చనిపోయాడు. తల్లి తనకు ఉన్నదాంట్లో జాగ్రత్తగా కుటుంబం నడిపి ఆమెకు చదువు, సంస్కారం నేర్పించింది. గాయత్రి కూడా అనేక ఒడిదుడుకులకు తట్టుకుని నిలబడి చాలా కష్టపడి ఇంజనీరింగ్ పూర్తిచేసి హైదరాబాద్ లో ఒక మంచి సాఫ్టువేర్ కంపెనీ లో నెలకు లక్షరూపాయల జీతంతో ఉద్యోగం చేస్తోంది.
ఒకరోజు తల్లి గాయత్రి ని పిలిచి .. "అమ్మా నాకు ఒంట్లో ఓపిక తగ్గిపోతోంది, నీకు పెండ్లి చేసి ఒకఅయ్యచేతిలో పెడితే నాకు బాధ్యత తీరి మనశ్శాంతిగా ఉంటుంది. ఆ తరువాత కృష్ణ,రామ.. అనుకుంటూ శేషజీవితాన్ని గడిపేస్తాను అని చెప్పింది... "గాయత్రి" సరే అమ్మా నీ ఇష్టం... అని చెప్పింది.
బంధువుల ద్వారా, తెలిసినవారి వారి ద్వారా .. సంబంధాలు వెదకటం ప్రారంభించింది గాయత్రి తల్లి. కొంతకాలానికి విజయవాడలో ఒక సంబంధం ఉంది.. మంచి సాంప్రదాయ కుటుంబం, కుర్రవాడు అందగాడు, గుణవంతుడు, హైదరాబాదు లోనే వేరే సాఫ్టువేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు నెలకు లక్షా ఏబదివేల రూపాయల జీతం.. ఒక్కడే కొడుకు, మంచి ఆస్తిపరులు అని తెలుసుకుని, తన సుముఖత తెలియచేసింది.
తమ వాస్తవ స్థితి,గతులను కూడా వారికి వివరించి వారికి సమ్మతం అయితే అమ్మాయిని చూసుకోవటానికి రమ్మని కబురు పంపింది గాయత్రి తల్లి. నిజానికి గాయత్రి కుటుంబం ఆర్థికంగా స్థితిపరులు కాదు.. సొంత ఇల్లుగాని, పొలాలు గాని, స్థలాలు గాని... ఏమీ లేవు. ఉద్యోగంలో చేరిన తరువాత గాయత్రి ఏర్పరచుకున్న కనీస అవసరాలకు సరిపడా చిన్న చిన్న బంగారు వస్తువులు తప్ప.. ఉన్నదానితో సర్దుకుని కష్టపడి పైకివచ్చి.. మంచి, మర్యాద.. అందం,అణకువ గల సంప్రదాయాలతో కూడిన "పెంపకం" ఆమెది...
ఒక మంచిరోజు చూసుకుని గాయత్రిని చూడటానికి "శరత్" తో పాటు అతని తల్లితండ్రులు, మరికొందరు ముఖ్య బంధువులు.. అందరూ కలిసి హైదరాబాద్ లోని గాయత్రి ఇంటికి వచ్చారు. గాయత్రి తరుపు బంధువులు కూడా అక్కడకు చేరుకున్నారు...
సాంప్రదాయ ప్రకారం శరత్ కుటుంబానికి స్వాగతం పలికి మర్యాదలు చేసి. గాయత్రిని ముస్తాబు చేసి వారిముందు కూర్చోబెట్టారు. శరత్ మరియు వారి కుటుంబ సభ్యులు గాయత్రి అందాన్ని చూసి చాలాసంతోషంతో అమ్మాయి మాకు నచ్చింది. మీ స్థితి గతులు నాకు చెప్పారు.. కట్న కానుకలు మాకు అవసరం లేదు. భగవంతుడి దయవలన మా స్థితి బాగానే ఉంది. అమ్మాయి మా కుటుంబంలో కలిసిపోతే చాలు. అని శరత్ తండ్రి తన నిర్ణయాన్ని చెప్పేశాడు.
గాయత్రి ఒక్కసారి శరత్ వంక చూసి "నేను మీతో మాట్లాడాలి"... అనేసరికి ఒక్కసారిగా అందరూ ఖంగుతిన్నారు అన్నీ సవ్యంగా జరిగిపోతున్నతరుణంలో ఈ అమ్మాయి ఇలా మాట్లాడింది ఏమిటి? అసలు శరత్ ఆ అమ్మాయికి నచ్చాడా లేదా? లేకపోతే తను ఎవరినైనా ప్రేమించిందా? తనకు ఈ పెళ్లి ఇష్టం లేదా? పెళ్లి కాగానే వేరే కాపురం పెట్టాలని, అత్తమామలబాధ్యత తనకువద్దు అని కాని! తనజీతం తనఇష్టం.. అని షరతులు పెడుతుందా?? ఎవరికీ అర్ధం కాక అయోమయం లో ప్రశ్నార్థకంగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు. అన్నీ కుదుర్చుకున్న తరువాత ఇబ్బంది పడేకంటే, ఇపుడే ఆ అమ్మాయి ఆలోచన, అభిప్రాయం తేలిపోతుంది లే అని అందరూ ఆలోచిస్తున్నారు. గాయత్రి తల్లి తను ఊహించనివిధంగా గాయత్రి అడిగిన ఆ మాటకు నిశ్చేస్టురాలై ఖంగారుగా ఆమెవైపు చూస్తోంది.
శరత్ తండ్రి తేరుకుని శరత్ కు వెళ్లి మాట్లాడమని సైగచేశాడు. శరత్ లేచి గాయత్రి వైపు చూసి ఆ ప్రక్క గదిలోకి వెళ్ళి మాట్లాడుకుందామా! అని అడిగాడు. గదిలోకి వెళ్ళి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఈ విషయం అందరికీ తెలియాలి కాబట్టి ఇక్కడే మాట్లాడుకుందాం... మీరు కూర్చోండి అని చెప్పింది. అందరి ముఖాలలోను రంగులు మారుతున్నాయి... ముఖ్యంగా గాయత్రి తల్లిముఖంలో ఖంగారు మరింత పెరిగింది. ఆమెకు వళ్లంతా చెమటలు పట్టాయి. శరత్ కూడా అయ్యోమయ్యంగా చూస్తూ తండ్రిప్రక్కన సోఫాలో కూర్చున్నాడు.
గాయత్రి లేచి తనకు కాబోయే మామగారి దగ్గరకు వెళ్ళు వినయంగా పాదాలకు నమస్కరించి. మీ విశాలహృదయానికి నా నమస్కారాలు. మా ఆర్థిక పరిస్తితి అంతా తెలిసి కూడా నన్ను మీ ఇంటి కోడలిగా చేసుకోవటానికి ఇష్టపడి... విషయాన్ని రేపు మాపు అని సాగదీయకుండా మీ నిర్ణయాన్ని యిక్కడే చెప్పినందుకు ముందుగా ధన్యవాదాలు.
నేను చదువుకున్న ఆడపిల్లను కాబట్టి నాకు కొన్ని అభిప్రాయాలు, కోరికలు ఉంటాయి. వాటికి మీరు అంగీకరిస్తే మాత్రమే ఈ పెళ్లికి నేను అంగీకరిస్తాను. అని తెగేసి చెప్పింది. అలాగేఅమ్మా నువ్వు ప్రశాంతంగా కూర్చుని నీఅభిప్రాయాన్ని నిర్భయంగా చెప్పవచ్చు.. అన్నాడు శరత్ తండ్రి "రామయ్య".
మా నాన్న నా చిన్నతనం లోనే చనిపోయాడు మాతోపాటు మానానమ్మ కూడా ఉండేది, మా అమ్మ మా నానమ్మను (అంటే ఆవిడ అత్తగారిని) ఓర్పుగా, నేర్పుగా ఎలా చూసుకునేదో నేను చూసాను తద్వారా నేను మా అత్త,మామ లను ఎలా చూసుకోవాలో తెలుసుకున్నాను. మా నానమ్మ మాకు మంచి మార్గదర్శి గా ఉండేది, నాకు మంచి నీతి కథలు చెప్పేది అందువలననే నేను మంచి, చేడు తెలుసుకోగలిగాను.
నేను మీ అబ్బాయిని వివాహం చేసుకుంటే మీరుకూడా తప్పనిసరిగా మాతోనే కలిసి ఉండాలి. ప్రతినెలా మా ఇద్దరిజీతాలు తెచ్చి మీచేతికి ఇస్తాము మీకు ఓపిక ఉన్నంతవరకూ డబ్బు నిర్వహణలో మీ అనుభవంతో కూడిన మెళకువలు మాకు నేర్పాలి. నేను తెలిసిగానీ, తెలియక గాని ఏదైనా పొరపాటు చేసినా, మాట్లాడినా ఒక తండ్రిలా నన్ను మందలించి నా తప్పును నాకు తెలియచేయాలి, సరిదిద్దాలి.... నేను ఉద్యోగం వచ్చాక ఇప్పటివరకూ సంపాదించిన డబ్బు మొత్తం కూడా మీకే ఇస్తాను, మీకు నచ్చినవిధంగా మీరే మా పెళ్లి చేయాలి... ఇలా ఉండటం చేయటం మీకు సమ్మతం అయితే ఈ వివాహానికి నేను సమ్మతిస్తాను.. అని చెప్పింది.
గాయత్రి మాటలు విన్న అక్కడ ఉన్న అందరికీ కంటిచూపే గాని నోటిమాట లేదు... తన కూతురు తెలిసీ తెలియక ఏమి మాట్లాడుతుందో మంచి సంబంధం పోతుందేమో అని ఖంగారులో ఉన్న గాయత్రి తల్లికి ఆమె సంస్కారానికి, ఉన్నతమైన ఆలోచనకు ఆనందభాష్పాలు ఆగలేదు.
కాబోయే మామ "రామయ్య" గారు గాయత్రి మాటలకు, ఆలోచనకు, సంస్కారానికి మహాదానందభరితుడై... భార్య "జానకమ్మ" కుమారుడు "శరత్" వంక చూసి అమ్మాయి తన అభిప్రాయం సూటిగా చెప్పింది, తనతో నేను ఏకీభవిస్తాను, మరి మీసంగతి ఏమిటి అని అడిగాడు.
గాయత్రి పెంపకానికి ఆమె తల్లిని అభినందిస్తూ .... పెళ్లికాకముందే వేరుకాపురం గురించి ప్రస్తావిస్తూ... పెళ్లి కాగానే మీ అమ్మ అలా అన్నది, మీ నాన్న ఇలాఅన్నాడు .. అని కుంటిసాకులతో వేరు కాపురం కోసం సతాయించే ఆడపిల్లలు ఉన్న ఈరోజుల్లో... వేరుగా ఉంటున్నా ఫోన్ చేసి ఏమికూర వండావు అని అడిగినా.. మీ అమ్మ ఏమి కూర వండావు అని అడిగింది... నాకు కూర వండటం రాదా... అని వంకరగా ఆలోచించే ఈరోజుల్లో. మాజీతాలతో పాటు మీ పెన్షన్ కూడా మాకు ఇస్తే మేము ఇల్లు కొనుక్కుంటాం, కారు కొనుక్కుంటాం అని పీడించే ఈ రోజుల్లో మాజీతం మీకే ఇస్తాము వాటిని వినియోగించటం మీరే మాకు నేర్పండి ... నా పెళ్లి ఘనంగా చేసుకోవాలి అని గొంతమ్మ కోరికలు పెట్టుకునే ఈరోజుల్లో నా దగ్గర ఉన్న డబ్బుకుడా మీకే ఇస్తాను మీకు నచ్చిన విధంగా పెళ్లి చేయండి అని చెప్పిన నీ ఉన్నతమైన సంస్కారానికి నా అభినందనలు గాయత్రి... కానీ నాదికూడా ఒక షరతు ఉంది అదికూడా మీరు అంగీకరించాలి అని గాయత్రి తల్లి వైపు తిరిగింది... ఇంత సంస్కారవంతమైన ఉన్నత ఆలోచనలతో పెంచిన మీ... కాదు, కాదు... మనగాయత్రి తో పాటు మీరుకూడా మాతోనే ఉండాలి. మరి మీరు ఇంకొక మాట మాట్లాడవద్దు... అని తన నిర్ణయాన్ని చెప్పింది జానకమ్మ. అందరూ సంతోషంగా గాయత్రిని అభినందించి నిశ్చయ తాంబూలం ఇచ్చి భోజనాలు పూర్తిచేసి, వీలైనంత త్వరగా వివాహం జరిపిద్దాం అని చెప్పి బయలుదేరారు.
ఒక వారంలో మంచి ముహూర్తం చూసి ఘనంగా శరత్&గాయత్రి లకు వివాహం జరిపారు. నాలుగు పడకగదులు, హాలు, వంటగది, పూజగది గల మంచి ఇల్లు అద్దెకు తీసుకుని సంతోషంగా జీవనం సాగించారు.
ఇలాంటి ఉన్నత ఆలోచనలకు ముఖ్యమైనది పెంపకం
నీతి:- పిల్లలు ప్రతిదీ నిశితంగా గమనిస్తారు.
మనం మన తల్లి,తండ్రులను... అత్త,మామలను ఎలా చూస్తే రేపు మనలను కూడా వారు అలాగే చూస్తారు
No comments:
Post a Comment