Tuesday, November 4, 2025

 కాఫీ కబుర్లు సంఖ్య 1027 (అక్టోబర్ 30 - 2025) -- జాతీయ పొదుపు దినోత్సవం -- 1924లో ఇటలీలో మొదటి ప్రపంచ పొదుపు దినోత్సవాలు జరిగినప్పుడు ఏటా అక్టోబర్ 31వ తేదీన అంతర్జాతీయ పొదుపు దినోత్సవంగా ప్రకటించారు.  ప్రజలలో పొదుపు అలవాటు చేయడం, విద్యార్థుల్లో పొదుపు గురించి అవగాహన కల్పించడం దీని ఉద్దేశ్యం.  దేశంలో నేడు జాతీయ పొదుపు సంస్థ ఎన్నో పొదుపు పథకాలను పోస్టాఫీసుల ద్వారా విజయవంతంగా అమలు చేస్తోంది.  అన్ని బ్యాంకులు తమ సేవింగ్స్ ఖాతాల ద్వారా పొదుపు అలవాటును ప్రోత్సహిస్తున్నాయి.  ఈ పొదుపు దినోత్సవం ప్రనంచ మంతటా అక్టోబర్ 31న జరుగుతుంది.  1984లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఈరోజే హత్యకు గురై మరణించడంతో మన భారతదేశంలో మాత్రం పొదుపు దినోత్సవం ఈరోజు అక్టోబర్ 30న నిర్వహిస్తున్నారు.  ధనం విలువ తెలుసుకుని పొదుపు చేయడం చాలా అవసరం.  పదవీ విరమణ చేసిన తర్వాత నెలసరి ఆదాయం ఉండేలా బాగా ముందునుంచి ప్రణాళికలు వేసుకోవాలి.  మన ఆదాయంలో కనీసం 20-25 శాతం పొదుపు చేస్తే రేపటి భవిష్యత్తుకి ఇబ్బంది ఉండదు.  పొదుపు కేవలం మనీ మేటర్స్ లోనే కాదు.  అన్నింటిలో ఉండాలి.  నీరు కరెంట్ కూడా పొదుపుగా వాడటం అలవాటు చేసుకోవాలి.  అలాగే ఆహారం కూడా.  ఏదీ వృధా కాకూడదు.  అందరికీ అవసరమే గనుక అందరికీ ఉపయోగపడే విధంగా పొదుపుగా వాడుకోవాలి.  పొదుపు లేని జీవితం, అదుపులేని నోరు కష్టాల పాలే.  చాలా సమస్యలు నోటి మాట వలనే వస్తుంటాయి.  గనుక మాటలు కూడా పొదుపుగా ఉండాలి.  ఎంత అవసరమో అంతే అందరూ మాట్లాడితే కోపాలు ద్వేషాలు పంతాలు పట్టింపులు లకి చోటు ఉండదు.  పొదుపు మన చేతల్లో పనుల్లో కూడా అవసరమే.  కాస్త పొదుపు వంటి జాగ్రత్తగా మన పనులు చేసుకుంటే అన్నీ సజావుగా సాగుతాయి.  అరవై దాటిన భర్తలు తప్పనిసరిగా మాటలు చాలా చాలా పొదుపుగా వాడాలి.  లేకపోతే ఈసడింపులు విసుర్లు విసుక్కోవడాలు ఇంట్లో తప్పవు.  గనుక పొదుపు అదుపు అందరికీ ముఖ్యమే.  మనశ్శాంతికి సరియైన మార్గాలు ఇవి. -- ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న సోదర సోదరీమణులకు జన్మదిన శుభాకాంక్షలు..  మీలో ఎవరిదైనా ఈరోజు అక్టోబర్ 30న పుట్టినరోజు ఐతే ఎస్సెమ్మెస్ చేయగలరు.. మీ కుటుంబ సభ్యులలో ఎవరిదైనా సరే పేరు తెలుపుతూ ఎస్సెమ్మెస్ చేయగలరు..  అందరికీ హేపీ డే..  ---- గాదె లక్ష్మీ నరసింహ స్వామి (నాని) విజయనగరం ఫోన్ 99855 61852..

No comments:

Post a Comment