🕉️ అష్టావక్ర గీత 🕉️
అధ్యాయం 18
శ్లోకము 51
అకర్తృత్వమభోక్తృత్వం స్వాత్మనో మన్యతే యదా | తదా క్షీణా భవస్త్యేవ సమస్తాశ్చిత్త వృత్తయః ||
తనలో ఉందనుకుంటున్న ఆత్మ నిజానికి కర్తా భోక్తా కాదని తెలుసుకున్న జ్ఞానిలో సర్వభావసంచలనాలూ సమసిపోతాయి.
ఆధ్యాత్మికసాధనలో అభివృద్ధి సాధిస్తున్నకొద్దీ, ఉపాధిమీదా ఉపాధిచే చూడబడే ప్రపంచంమీదా దృష్టితగ్గి వీటికి ఆధారమైన ఆత్మమీదే దృష్టిని అధికంగా నిల్పడం జరుగుతుంది. సర్వానికీ అధిష్ఠానమయిన ఆత్మగా తన్ను తాను సదా తెలుసుకుంటూ ధ్యానించడంలో క్రమంగా తన శారీరిక చర్యలకు తాను కర్తననీ భోక్తననీ భావించడం తగ్గిపోతుంది. ఈ విధమయిన భావనా పరిణామ క్రమమే మనోబుద్ధులను శాంతపరచే మహౌషధం. పూర్తిగా శాంతించిన మనస్సులో అహంకారం నశిస్తుంది.
అయితే ఈ విధంగా ఆత్మనుగూర్చి విచారణ చేయడంకూడా ఆలోచన తోనే 'నేను ఆత్మను' అనే అవగాహనగానీ, 'అనంతమైన ఆత్మలో కర్త భోక్తలు లేరనే" అవగాహనకానీ, ఆలోచనలే అయినప్పటికి వాటిలో అద్భుతమైన శక్తి ఇమిడి ఉంది. ఇలా సదా ఆత్మవిచారణ చేయడంతో అహంకారం బలహీనమయి నిశ్చలత్వం దాలుస్తాయి. అహంకారమే శారీరిక కర్మలను తనవిగానూ, మనో బుద్ధుల చలనాన్ని తనదిగానూ భావిస్తూ, కర్తృత్వ భోక్తృత్వ భావాలను పెంచుకుంటూ సుఖ దుఃఖాల ననుభవిస్తూ ఉంటుంది. ఆత్మ విషయమయిన ఆలోచన ఏకాగ్రంగా తగినంతకాలం మనస్సులో ఉంటే ఇతర ఆలోచనలన్నిటినీ నశింపజేయడమేకాక తానుకూడా చివరగా అదృశ్యమయిపోయి, ఆత్మానుభవం సిద్ధిస్తుంది. కేవలం తార్కికంగా ఒక సిద్ధాంతాన్ని నిలబెట్టడానికి ఉద్దేశింపబడిన మాటలు కావివి, వేదాంత విద్యార్థులు గరళంలా ఆ వాదాన్ని మింగనూలేక కక్కనూ లేక బాధపడే అవసరమూ లేదు, గుడ్డినమ్మకం అంతకంటే కాదు! సత్యా న్నన్వేషించే సునిశితమూ తీక్షణమూ అయిన ఏ బుద్ధిచేతనయినా తార్కికంగా ఆమోదింపబడేదే.
ఆత్మ విషయమైన ఆవగాహన, నిశితంగా పరిశీలిస్తే ఆలోచనేకాదు. ప్రతి ఆలోచనకు ఆధారంగా ఒక వసువో విషయమో ఉంటుంది. నామం రూపం వేరుగా ఉండజాలవు. మిగిలిన ఆలోచనలకు భిన్నంగా ఆత్మపరమైన ఆలోచన విషయాల గురించికాక, విషయికి సంబంధించి ఉండడంతో ఇది ఆధార శూన్య మయిన ఆలోచన అవుతోంది. పరస్పరాధారంగా గుర్తింపబడే ఈ ద్వంద్వ ప్రకృతిలో ఆధార శూన్యమయిన ఆలోచనను---ఆలోచన అనలేము. నప్పటికీ మనోభావాలు నశించడంలో చివరిదనదగిన ఈ అఖండమైన ఆత్మ ఆకార వృత్తి సాధకునికి ఊతకఱ్ఱవలె సహాయపడి, స్వస్వరూపస్థితిలో నిష్ట కలిగిస్తుంది.
కర్తృత్వ భోక్తృత్వ భావాలు పూర్తిగా నశించగానే అహంకారం అదృశ్య మయిఅహంగా సర్వభూతాత్మగా సత్ చిత్ ఆనందంగా మిగిలిపోతుంది. ధ్యాని ధ్యేయమూ ఐక్యమయిపోతాయి. నదిసాగరంలో కలిసిపోయి అభిన్నంగా ఏకంగా జలమయినట్లు, ఇదే జీవబ్రహ్మ ఐక్యంగా అభివర్ణించబడుతుంది.🙏🙏🙏
No comments:
Post a Comment