🕉️ అష్టావక్ర గీత 🕉️
అధ్యాయము 18
శ్లోకం 52
శ్లో॥ ఉచ్ఛృంఖలా ప్యకృతిగా స్థితిరీరస్య రాజతే | నతు సంస్పృహ చిత్తస్య శాంతిర్మూఢస్య కృత్రిమా||
విధినిషేధాలనుండి విముక్తినందిన జ్ఞాని ప్రవర్తన సహజానందంతో ప్రకాశిస్తూ ఉంటుంది. అభ్యసించిన శాంతితో ఎంత నియమబద్ధంగా ప్రవర్తించినా కోరికలతో నిండిన మనస్సుగల మూఢుని చేష్టలు కృత్రిమంగానే ఉంటాయి.
ఇంద్రియానుభవాలద్వారా సుఖాన్ని సాధించాలనే కోరిక జీవన్ముక్తు నిలో ఉండదు. అతనిలో ఏ విధమయిన కోరికలూ ఉండవు. విధిని షేధాలతో పనిలేకుండా, స్వతంత్రంగా సహజంగా అతడు చరించగలుగుతాడు. ఆత్మానుభవనిష్ఠుడై శాంతస్వరూపంగా ఆనందంగా అద్వయమయిన తన స్వరూపాన్నే సర్వత్రా వీక్షిస్తూ ఉంటాడు.
అట్టి జ్ఞాని స్థితిని నిర్దేశిస్తూ మూడుని ప్రవర్తనను పోల్చి చూపిస్తున్నా రిక్కడ. తనలోని కోరికలనూ ఉద్రేకాలనూ అణచుకొని బాహ్యంగా శాంతంగా ఉన్నట్టుగా కనిపించే మూఢుని చర్యలలో కృత్రిమత్వం అడుగడుగునా స్ఫురిస్తూనే ఉంటుంది. ఇలా కృత్రిమంగా ప్రయత్నపూర్వకంగా శాంతంగా ఉన్నట్టుగా పైవారికి కనిపంచవచ్చు కానీ, అతని అంతరంగం అశాంతితో నిండి ఉంటుంది, ఆత్మానుభవం అట్టివారికి గగన కుసుమమే అవుతుంది.
నిజమైన సాధకుడు ఇటువంటి కృత్రిమపు శాంతిని హర్షించకూడదు, ఆశించకూడదు. నిజమైన శాంతి ఆత్మానుభవంలోనే లభిస్తుంది. సరైన జ్ఞానం వలననే ఆత్మానుభవం సిద్ధిస్తుంది. అప్పుడు మాత్రమే అహంకారం అంతరిస్తుంది.🙏🙏🙏
No comments:
Post a Comment