Monday, November 3, 2025

 *మహామంత్రి మాదన్న - 21* 
(చరిత్ర ఆధారిత నవల)
👳🏽

రచన : ఎస్.ఎమ్. ప్రాణ్ రావు


మీర్జా సయ్యద్ ప్రయాణ వేగు అందగానే గోలుకొండ కోటలో విషాదఛాయలు అలుముకున్నాయి. తెలియకుండానే వెన్నెముకలో చలి పుట్టుకు వచ్చింది. ఆ వస్తున్నవాడు సామాన్యుడు కాదు. కత్తి ఎంత బాగా తిప్పగలడో కపటమూ అంత బాగా నడుపగలడు. అన్నిటికంటే మించి శతృవులకి తెలియకూడని గోలుకొండ రహస్యాలు అతని గుప్పిటలో వున్నాయి. అందుకే కోటలోని యుద్ధ మందిరంలో అత్యవసర సమావేశం మొదలయింది.

'మీర్జా సయ్యద్ బయలుదేరాడు. ఆరువేల అశ్వికదళంతో, పదిహేను వేల కాల్బలంతో మూడు వందల ఏనుగులతో అపార ధన సంచులతో ఒక మహారాజులావస్తున్నాడు. అతను బొల్లారం చేరగానే స్వాగతం పలకడానికి మొగలు సైనికాధికారులు మాలోజీ, నౌస్రీ ఖాన్, షంషుద్దీన్ రంగు రంగుల పూలహారాలతో వేచి వున్నారు' చెప్పాడు రజాకులీ.

'ఒక్క సిపాయి కూడా వెంట లేకుండా వచ్చినా సరే, మీర్జా సయ్యద్ చేసే హాని గోలుకొండకి మరెవ్వరూ చెయ్యలేరు' అంది హయత్ బక్షీ బేగం.

'రాజమాతా మీరు చెప్పింది వాస్తవం. గోలుకొండ ఆయువు పట్టులు మీర్జా సయ్యద్ గుప్పిటలో వున్నాయి' అన్నాడు రజా కులీ.

'దానికి తోడు, గోలుకొండ అధికార యంత్రాంగంలో, సైన్యంలో ఆయన విధేయులు, ఆయన పట్ల మొగ్గు చూపే వారు ఇంకా వున్నారు. శతృవులతో చేతులు కలపడానికి వాళ్లు వెనుదీయరని నా అనుమానం' అన్నాడు మాదన్న.

'అది అనుమానం కాదు మాదన్నా. పచ్చి నిజం. గోలుకొండకి కీడు చేసిన నమ్మక ద్రోహులు ఎందరో వున్నారు. గతంలో జగదేకరావు నాయక్వారి, సైఫ్ ఖాన్, 
ఐసులముల్క్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. వారివల్ల జరిగిన నష్టాన్ని గోలుకొండ త్వరలోనే పూడ్చుకో గలిగింది. కానీ మీర్జా సయ్యద్ వల్ల జరిగిన నష్టాన్ని పూడ్చడానికి ఎవ్వరూ మిగలరు' అంది హయత్ బక్షీ బేగం ఆవేదన నిండిన గొంతుతో.

ఆలోచనలు ముప్పిరిగొన్న ఆమె మొహం లోకే చూస్తూ అంతా ఉండిపోయారు. ఎవరికీ మాట్లాడటానికి ధైర్యం చాలలేదు.

హయత్ బక్షీ బేగం తనే అందుకుంది. 'మీర్జా సయ్యద్, ఔరంగజేబు చెవులు కొరక్కముందే, మనం పై ఎత్తులు వెయ్యాలి' అంది.

'చెప్పండి' అన్నాడు రజా కులీ.

'అబ్దుల్లా, నువ్వు పంపిన రాయబారానికి సమాధానం ఎలా వచ్చిందో చూశావుగా. ఔరంగజేబు రాయబారి వేషంలో వచ్చి నీ ప్రాణాలు హరించాలనుకున్నాడు. రజా కులీ, మాదన్నలు ముందు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల శతృవు పాచికపారలేదు. అందువల్ల రాయబారానికి నువ్వు కానీ మరొకరు కానీ....

'మరి ఎవరు వెడతారు మా సాహెబా' అడిగాడు సుల్తాన్ అబ్దుల్లా.

'నేను వెడతాను. ఔరంగజేబులా మారు వేషంలో వెళ్లాలనుకోను. నేను నేనుగానే వెడతాను. ఈ వర్తమానం ఔరంగజేబుకు పంపు. ఔరంగజేబూ ఒక అమ్మ కన్న కొడుకే. అందువల్ల తగవు తెంపడానికి వస్తున్న ఒక తల్లిని కాదనలేడు' అంటూ తన ఆసనంలోంచి లేచింది.
📖

పదహారు మంది బోయీలు మోస్తున్న రాజలాంఛనాలు గల పల్లకీ ఔరంగజేబు డేరా ముందు ఆగింది.

మొగలు సేనానులు హదీదాద్ ఖాన్, షాయిస్త ఖాన్, హయత్ బక్షీ బేగానికి స్వాగతం పలికారు. వినయంగా సలాం చేసి గుడారంలోకి తీసుకువెళ్లారు. ఆమెను
చూడగానే ఔరంగజేబు లేచి నుంచుని సలాం చేశాడు.

ఇద్దరూ కూచున్నారు.

'మా సాహెబా, మీరు ఈ వయసులో ఒంటరిగా శతృ శిబిరంలోకి వచ్చారంటే నమ్మశక్యం కాకుండా వుంది' అన్నాడు ఔరంగజేబు.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
'ఒంటరిగానే కాదు. నిరాయుధురాలిగా కూడా వచ్చాను'.

'ఇక్కడ మీకు ఏ అపాయమూ జరగదు. హామీ ఇస్తున్నాను' అన్నాడు ఔరంగజేబు.

'ఇప్పుడు జరుగుతున్న అపాయం కంటే మించిన అపాయం మరొకటి ఏమి ఉంటుందని భయపడాలి'.

ఎంతో తెలివిగలవాడని పేరు పొందిన ఔరంగజేబుకి కూడా ఆమె మాటలు పూర్తిగా అంతుపట్టలేదు. అందుకే 'మీరు వచ్చిన పని చెప్పండి' అన్నాడు.

'అవిధేయుడైన అధికారిని శిక్షించడం నేరమా' అడిగింది హయత్ బక్షీ బేగం.

'ఈ ప్రశ్న నన్నెందుకు అడుగుతున్నారు'

'ఎందుకు అడుగుతున్నానో తరువాత చెబుతాను. ముందు నేను అడిగినదానికి సమాధానం చెప్పు'.

ఔరంగజేబు ఆమె మొహంలోకి సూటిగా చూశాడు 'తప్పు కాదు' అన్నాడు.

'మరి ఆ తప్పుడు పని చేసిన అధికారి కొమ్ము కాయడం అంతకంటే పెద్ద తప్పు కద' సూటిగా అడిగింది హయత్ బక్షీ బేగం.

'మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారో అర్ధమయింది. మీర్జా మహమ్మద్ సయ్యద్ మాకు మితృడు. మితృడిని కాపాడాల్సిన బాధ్యత మా మీద ఉంది. అంతే కాదు. మా మితృడి శతృవు మాకు కూడా శతృవే' అన్నాడు ఔరంగజేబు కటు స్వరంతో.

'ఇన్కయాద్ నామా ప్రకారం మీ మితృలు మా మితృలు కావాలి. దాన్ని తిరిగేస్తే మా శతృవులు మీకు మితృలు కాకూడదు. ఇది ఆగ్రా, భాగ్యనగరాల మధ్య జరిగిన ఒప్పందం' అంది హయత్ బక్షీ బేగం.

ఔరంగజేబు ఆమె మొహంలోకి చురుకుగా చూశాడు. 'మీ శతృవులు మాకేమవుతారో నిర్ణయించాల్సింది మీరు కాదు, మేము. ఆ అధికారం మాది' అన్నాడు మాట మాటను నొక్కి పలుకుతూ.

'అలాంటి అధికారం మీకు ఇన్కయాద్ నామా ఇవ్వలేదు' అంది హయత్ బక్షీ బేగం ఏమాత్రం తడబాటు లేకుండా.

'సాహెబా మీరు తొందరపడుతున్నారు. నేనెవరో మీకు తెలుసా' అడిగాడు కోపంగా.

'నువ్వెవరో నాకు తెలుసు. అలాగే నేనెవరినో కూడా నాకు తెలుసు. షాజహాను చక్రవర్తి మూడవ కుమారుడు, దక్కన్ సుబేదారు అయిన మొహియుద్దీన్ మహమ్మద్ ఔరంగజేబుతో నేను మాట్లాడు తున్నాను. ఇహపోతే, నేనెవరో చెబుతాను విను. నేను ఒక సర్వం సహ చక్రవర్తి కూతురిని. మరొక సర్వం సహ చక్రవర్తికి పట్టమహిషిని. ప్రస్తుతం రత్నగర్భ అని పొగడబడుతున్న ఈ మొత్తం గోలుకొండ సామ్రాజ్యాన్ని ఏలుతున్న సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్షా కి తల్లిని'.

'మీరు హద్దులు దాటుతున్నారు' అన్నాడు ఔరంగజేబు కోపంగా. 

'నేను దాటలేదు. నువ్వు వేసుకున్న డేరా నా ఇలాకాలోనే వుంది'.

'మా సాహెబ్' ఆగ్రహంతో ఊగిపోతూ అరిచాడు ఔరంగజేబు.

'సుబేదార్ సాబ్, నా కొడుకు రాయబారాల ఊసు ఎత్తక యుద్ధానికి తలపడితే, నేను సంతోషపడేదాన్ని. దురదృష్టవశాత్తు అలా జరగలేదు. అందుకే నేను వచ్చాను. నువ్వు చాలా మత గ్రంథాలు ఆమూలాగ్రం గా చదివావని, ఖురాన్ని ఔపోశన పట్టావని జనం చెప్పుకుంటారు. అంతటి పాండిత్యం వున్న నీకు, నేను మతధర్మం బోధించడం వెర్రి సాహసమే అవుతుంది. అయినా ఒక ప్రశ్న అడుగుతాను. తోటి ముసల్మాను రాజు మీదికి అకారణంగా దండెత్తడానికి ఇస్లాం నీకు ఏ కత్తి అందించిందో చెప్పు'.

ఆ ప్రశ్నకి ఔరంగజేబు ఏ మాత్రం చలించ లేదు. ఎంతో ప్రశాంత స్వరంతో 'సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్షా షియా' అన్నాడు.

'షియాలు ముసల్మానులు కారా, వారికి పాలించే హక్కు లేదా' సూటిగా అడిగింది హయత్ బక్షీ బేగం.

ఔరంగజేబు సమాధానం కోసం తడబడ్డాడు. మొహంలో కోపం పొంగుకు
వచ్చింది.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
ఔరంగజేబు ఏదో అనేలోపలే హయత్ బక్షీ బేగం అందుకుంది. 'సమాధానం నేనే చెబుతాను విను. పాలించడానికి సున్నీలకి ఎంత హక్కు వుందో షియాలకు అంతే హక్కు వుంది. అయితే దురాక్రమణ చేసే హక్కు ఎవరికీ లేదు. సరే, నువ్వు చక్రవర్తి కుమారుడివి. నీ మర్యాదకి, హెూదాకి భంగం రాకుండా ఒప్పందం చేసుకుందాం. నువ్వు అడిగినట్లు కోటి రూపాయలు కాక, డెబ్బయి లక్షలు యుద్ధ పరిహారంగా గోలుకొండ చెల్లిస్తుంది. సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్షా ప్రస్తావించినట్లు నా రెండవ మనుమరాలని నీ కొడుకు మహమ్మద్ సుల్తాన్ కి ఇస్తాం. కట్నంగా రెండున్నర లక్షల హుణాలతో పాటు, రామగిరి జిల్లాని కూడా అరణంగా ఇస్తాం. ఒప్పందానికి అంగీకరిస్తే ఇరుపక్షాలలో అసలు ఏమాత్రం రక్తపాతం ఉండదు” అంది హయత్ బక్షీ బేగం ఏ మాత్రం లొంగుబాటు ధ్వనించని స్వరంతో.

ఔరంగజేబు ఆలోచనలో పడ్డాడు. యుద్ధం కొనసాగితే తను గెలవడు. ఆగ్రాలో తనను ఓడించడానికి ఇప్పటికే కుట్ర జరుగుతోంది. చక్రవర్తి అండదండలు పుష్కలంగా వున్న దారాషుకో, అతని పక్షపాతి అయిన జహనారా ఇప్పటికే పావులు కదుపుతు న్నారు. తనను బలహీనపరచడానికి అన్ని కుట్రలు పన్నుతున్నారు. ఇక్కడ తను ఎంత ఎక్కువగా బలహీనపడితే, ఢిల్లీ గద్దె మీద తన హక్కు అంత దిగజారిపోతుంది. అదీగాక యుద్ధం విరమించమని చక్రవర్తి పంపిన ఫర్మానాని తను ఇంకా తొక్కి వుంచలేడు. దాన్ని చక్రవర్తి అవిధేయతగా భావిస్తే మొదటికే ముప్పు వస్తుంది. అందుకే యుద్ధం చెయ్యకూడదు. యుద్ధం చెయ్యకుండా గోలుకొండ గద్దె తన వశం కావాలి. ఎలా? 

ఔరంగజేబు కళ్లు మెరిసాయి. వెంటనే 'మీరు పెద్దవారు. ఇంత దూరం వచ్చారు. మీ మాట కాదనను. అయితే నా మాటను
కూడా మీరు మన్నించాలి' అన్నాడు.

'ఏమిటది'.

'మీ మనుమరాలిని నా కోడలిగా స్వీకరించ డానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అయితే ఒక షరతు'.

'చెప్పు'.

'సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్షాకి మగపిల్లలు లేరు. సుల్తాన్ తదనంతరం నా కొడుకు మహమ్మద్ సుల్తాన్ని సింహాసనానికి వారసుడిగా గుర్తిస్తూ ఒప్పందం జరగాలి. అలా అయితే సంధికి నేను సానుకూలం' అన్నాడు ఔరంగజేబు.

హయత్ బక్షీ బేగం చాలాసేపు మాట్లాడలేదు.

'మీ నిర్ణయం మీదే ఈ సంబంధం సాధ్యపడుతుంది' అన్నాడు ఔరంగజేబు.

'సరే. అంతా దైవేచ్ఛ. అబ్దుల్లా కుతుబ్షాకి ముందు ముందు మగ సంతానం కలగక పోతేనే, గోలుకొండ గద్దెకి మహమ్మద్ సుల్తాన్ వారసుడవుతాడు. మరో మాట లేదు' అంది హయత్ బక్షీ బేగం.

'అలాగే' అన్నాడు ఔరంగజేబు మరో గత్యంతరం లేక.
👳🏽
*సశేషం*

꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
*కథల ప్రపంచం* 

https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe

*తెలుగు భాషా రక్షతి రక్షితః* 

*ఏడాది చందా 120/-, ఫోన్ పే & గూగుల్ పే నెంబర్ 9849656434*

*1 YEAR* *SUBSCRIPTION 120/-*
*phone pe & Gpay to 9849656434*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂

No comments:

Post a Comment