Monday, November 3, 2025

 *కాలం మళ్ళీ  ఓ 60 సంవత్సరాలు  వెనక్కి  వెడితే*

*కుంపట్ల మీద వంట. ఉదయము ఆరు గంటల కల్లా  బాపట్లలో  మూడు కుంపట్లు  వెలిగేవి. బొగ్గుల మీద వంట. కాఫీ పనులు అవ్వగానే  ఒక కుంపటి మీద బియ్యము , రెండో కుంపటి మీద కూర మరియు  మూడో కుంపటి మీద పప్పు ఇలా విరామము లేకుండా  ఉదయము తొమ్మిది కల్లా  వంట పూర్తికావాలి.*

*అయిదుగురు పిల్లలము భోజనము  చేసి స్కూలుకు వెళ్ళాలి. నాన్నగారు  కూడా  ఉదయము  పది లోపు  భోజనము  చేసి కోర్టుకు వెళ్ళేవారు.*

*మా కుటుంబానికి  కాస్త ఉపశమనము  ఏమిటంటే  మా ఇంట్లో  ఎవ్వరికీ ఉదయము  టిఫిన్లు  చేసే అలవాటు లేదు  కనుక  మా ఇంట్లో  ఉదయమే  వంట ప్రారంభించేది మా అమ్మగారు.*

*ఇక  ఆ రోజుల్లో  శనివారము  రాత్రి  ఒక్కరోజే మొత్తము  కుటుంబం అంతా  ఉపవాసము.  పూరి , బంగాళ దుంప కూర , లేదా  దిబ్బరొట్టె  లేదా మినపదోశె  లేదా  పెసరట్టు  అల్లం చట్నీ . వీటిలో  ఏదో ఒకటి  శనివారము రాత్రి  మొత్తము  దాదాపుగా  పదిహేను మంది కుటుంబ సభ్యులకు అల్పాహారము* *తయారుచేయాలంటే అదీ  కుంపటి మీద రాత్రి వేళ ఎంత కష్టమో  కదా !!*

 *మధ్యాహ్నము  పిండి  రోట్లో రుబ్బాలి. మరి ఆ రోజుల్లో మిక్సీలు  / గ్రైండర్  లు  ఎక్కడివి ?*

*మా అమ్మ ఏ వంట చేసినా అద్భుతంగా  ఉండేది. వాస్తవానికి  ఎవరి అమ్మ చేతి వంట వారికి అద్భుతమైన   రుచే కదండి.*

*ఇక శనివారం రాత్రి  టిఫిన్ పెసరట్టు అయితే అదీ కుంపటి మీద కనుక అమ్మ కుంపటి వెలిగించి  దాని మీద పెద్ద పెనం పెట్టేది. కుంపటి పక్కనే పీట వేసుకుని కూర్చొని , ఎంతో ఓపికగా  పల్చగా రేకుల్లా  పెసరట్లు  ఒక్కొక్కటి  వేడి వేడిగా  వేసి పెట్టేది.  అలాగే మా అమ్మ  మైసూర్ పాక్ , బొబ్బట్లు , ముక్కల పులుసు  చేయడంలో  మా అమ్మ స్పెషలిస్టు.*

*ఇవ్వన్నీ  కుంపట్ల మీద వంటచేయడంలో మధురమైన తీయని  జ్ఞాపకాలు.*

No comments:

Post a Comment