ఓం నమో భగవతే శ్రీ రమణాయ
భక్తుడు :
భగవాన్! ఎన్నిసార్లు ప్రయత్నించినా మనస్సును అంతర్ముఖం చేయలేక పోతున్నాను; ఎందువలన?
మహర్షి :
అది అభ్యాసం వల్ల, వైరాగ్యం వల్ల క్రమక్రమంగా అలవడుతుంది. మనస్సు ఒక ఆవు వంటిది. అది ఇతరుల పొలాల్లో మేతకు అలవాటుపడినది కావున తన సొంత గోశాలలో సులభంగా కట్టుపడదు. యజమాని దానికెంతో పచ్చిగడ్డి, ఇతర గ్రాసము ఎంత ఆశ చూపిననూ, మొదట తన సొంత గోశాలలో మేత మేయడానికి ఇష్టపడదు.
తరువాత కొంచెంగా గ్రహిస్తుంది. కాని ఎప్పటికప్పుడు తప్పించుకొనిపోయే స్వభావము కారణంగా దానిని అక్కడ ఉండనివ్వదు. యజమాని దానికి ఎన్నోసార్లు ఆశ చూపి, ఎట్లో దాన్ని గోశాలకు అలవాటు చేస్తాడు. ఆ తర్వాత దాన్ని గోశాలలో కట్టు కట్టకపోయినా కట్టు విడిచి వెళ్లదు.
అలాగే మనసు కూడ. ఒకసారి లోపల ఆనందం అనుభవిస్తే అటు తర్వాత బయటకు వెళ్ళదు.
No comments:
Post a Comment