Saturday, November 1, 2025

 ఓం నమో భగవతే శ్రీ రమణాయ

   నా పేరు త్రివేణిగిరి. వివాహమైన మూడు మాసాలలోనే శరీరం అంతా కుష్టు వచ్చింది. జీవితం నరక ప్రాయమైంది.
   
    అరుణాచలంలో ఎవరో విభూదిస్వామి తగ్గిస్తారంటే వెళ్ళాను. తీరా వెళ్ళాక అంతా మోసం అని తెలిసింది. ఇంతలో ఎవరో రమణ మహర్షి పేరు చెప్పారు. నేను ఆ పేరు వినటం అదే మొదటిసారి. మహర్షి అనుగ్రహంతో నీ రోగం పోతుంది అని  కొందరు అన్నారు. 
   
     నేను రమణాశ్రమంలోకి వెళ్ళి రమణులు ఉన్న హాలులోకి ప్రవేశించబోయాను. ఒక ఆశ్రమ సేవకుడు నా వికృత ఆకారము చూసి అసహ్యంతో లోపలికి వెళ్ళకుండా చెయ్యి అడ్డం పెట్టాడు. నేను పట్టలేని బాధతో నిరాశతో కిటికీలోంచి మహర్షిని చూస్తూ ఉద్వేగంతో పెద్దగా ఏడ్చాను. నా దౌర్భాగ్యానికి నా ఏడుపు విని మహర్షి కిటికీలోంచి నా వైపు దయతో చూసి లోపలకు రమ్మని సైగ చేశారు. 

     నేను నమస్కరిస్తూ ఏడుస్తూ వెళ్ళి మహర్షి రెండు కాళ్ళ మీద పడిపోయాను. మహర్షి కరుణతో నన్ను లేవనెత్తి నా శరీరమంతా చేతులతో తడిమి విభూతి ఇచ్చారు. అక్కడఉన్న భక్తులు 'నీవు అదృష్టవంతుడవు; మహర్షి ఎవరినీ తాకరు; ఎవరికీ విభూతి ఇవ్వరు' అన్నారు. 

      'నిజంగా నేను అదృష్టవంతుడినే. మూడు నెలల్లో నా రోగం మాయమైపోయింది. ఏమిచ్చి మహర్షి ఋణం తీర్చుకోగలను నేను? ఇప్పుడు పిల్లాపాపలతో సుఖంగా ఉన్నాను. మహర్షి అనుగ్రహం ఎవరిమీద ఎప్పుడు ఎలా పడుతుందో ఎవరూ చెప్పలేరు.'

No comments:

Post a Comment