Tuesday, November 4, 2025

"ఈతరం నిరంతరం పరుగే"

ఈతరం వారికి నిత్యం పరుగే
అనునిత్యం ఓ తొందరపాటే..
అంతటా స్వార్థపు నివాసాలే...
చూపులకందని సావాసాలే...
ఈతరం లోగిళ్ళలో 
అంతటా కృత్రిమ చెట్లకొమ్మలు...
గుమ్మాలకు ప్లాస్టిక్ తోరణాలే దర్శనమిస్తున్నాయి!..

అంతరిక్షయానంలో తిరుగుతున్నా  
అంతర్ముఖాన్ని కోల్పోతున్న 
నేటి కాలపు మనుష్యులు...
అందరూ స్వార్థం విడువని సహోదరులే...
మార్పును మాత్రం కొందరే కోరుకునే మహానుభావులు...
మనిషి మర్మంలో ఎన్నెన్ని రహస్యదారులో...
ఎన్నెన్ని అసూయద్వేషాలో
అంతటా ఓ కురుక్షేత్ర సంగ్రామమే!...

నేను అక్షరాయుధుడినై
లక్షల పదాల సంపదతో
నా అంతరంగాన్ని ఆవిష్కరిస్తుంటాను...
జీవితసుగంధాలను పంచుతుంటాను
అంతర్మధనంతో
అంతరాత్మను శుద్ధి చేస్తుంటాను...

గమ్యం తెలియని గమనం నాది..
లోకంలో జరిగే అవమానాలెన్నో!...
జరుగుతున్న అమానుషాలెన్నో!...
ఇరుకు హృదయాలతో గరుకు మనస్తత్వాలతో
నిత్యం తెలియని భయం భయంగా 
సాగిపోతోంది ఈ జీవితం!!...

నేనొక వ్యవస్థకు ప్రతినిధినై..నేటి వాస్తవ అవస్థను 
అందరి కళ్లముందుంచుతుంటాను...
అందరిలోనూ ఆధ్యాత్మికత పెరిగినా
అంతరాత్మ మాత్రం శుద్ధికావడం లేదు..

ఆనాడు ప్రతీకారం తెలియదు...
కక్ష సాధింపులంటే అసలే  తెలియదు..
ఎన్ని తరాలు మారినామానవత్వం మారలేదు...
నిజాన్ని ఎవరూ మార్చలేదు...
స్వప్నసాకారమై సత్యం జన్మిస్తూనే ఉంది!...

ఇప్పుడు కాలంతో పరుగులు తీసినా 
గమ్యం దొరకడంలేదు!...
బతుకంతా వెతలే మిగులుతున్నాయి...
మనసులో నిత్య కలవరంతో...
మోయలేని బతుకు భారమైపోతోంది!..

ఇప్పుడు అంతటా దౌర్జన్యపు 
సుడిగాలులు చుట్టేస్తున్నాయి... 
రెక్కలు కట్టి వేయబడుతున్నాయి!...
ఈ ఆశల పద్మవ్యూహంలో
మనిషి హృదయం 
నిత్య సునామిగా మారిపోతోంది!!...

ఎక్కడికెళ్ళుతుంది నేటితరం!..
ఏమై పోతోంది మానవనైజం!..
ఇలా అందరం చోద్యం చూస్తూ ఉండాల్సిందేనా!...
అందరి జీవితాలిలా బలి కావాల్సిందేనా!...
ఒకసారి మనమందరం ఆలోచించాలి!..

అంబటి నారాయణ
నిర్మల్
9849326801

No comments:

Post a Comment