Wednesday, April 29, 2026

 హాస్య కథానిక 
రచన... ఎం.వి.ఉమాదేవి 
కథా శీర్షిక...
*పారిపోయిన పెళ్ళికూతురు!!*

     అదో పెద్ద కల్యాణ మండపం. పెళ్ళి తంతు కాసేపట్లో ప్రారంభం కానుంది. అంతలో మండపానికి కుడి వైపున్న పెళ్ళికూతురి రూములో నుండి కలకలం రేగింది. 

లోనికెళ్ళి వస్తున్న వారు వింత విషయం తెలిసినట్టు ముక్కున వేలేసుకుని వస్తున్నారు. 

" ఏమైంది అమ్మాయ్?" చుట్టాలలో ఒకావిడ అడిగింది ఆదుర్దాగా. 

"పెళ్ళికూతురు పారిపోయింది!" క్లుప్తంగా చెప్పిన ఆమె వెళ్ళి సీట్లలో కూర్చున్న వారితో విషయం చెప్తుంది.

"రామ రామా! లవ్ మ్యారేజ్ అంటిరీ. అందర్నీ ఒప్పించి చేసుకుంటూ ఉంటే, ఇలా ఎందుకు చేస్తారో ఈ అమ్మాయిలు?" ఒకాయన తల పట్టుకుని మండపం మెట్లమీద కూలబడ్డాడూ.

"చూస్తారేం?వెళ్ళి పోలీస్ రిపోర్ట్ ఇవ్వండి. వాళ్ళు బస్, రైల్వే స్టేషన్లు చెక్ చేసి పట్టుకుంటారు. ఎంత పరువు నష్టం రెండు పక్కలా?" ఒకరు అరుస్తూ ఉంటే ఇంకోరు శాంతింప జేసేడు.

అంతలో పెళ్లికొడుకు ముఖంవేలాడేసికొని వచ్చాడు.
"ఏవోయ్? మీ మధ్య ఫోన్ తగాదాలేమైనా జరిగాయా? మంచి పిల్ల అసలు అట్లా ఎందుకు పారిపోయిందో?"  ఆరా తీస్తే అదేమి లేదన్నాడు అతగాడు .

" కాసేపట్లో పెళ్లి ఉంటే ఏమి లేకుండా మా పిల్ల ఎందుకు పారి పోయింది? మేం గొప్ప సంప్రదాయ కుటుంబమే. మీ మోహం మండా!మీరే ఏదో చేసి ఉంటారు! " పిల్ల మేనత్త దులిపేసింది. 

"నువ్వుండవే కాంతం ! అసలు ఇంతకు ముందుగా ఏం జరిగిందో చెప్పి చావండి!"  ఒక బామ్మగారు అరిచింది. 

" మామూలుగా బ్యూటీ పార్లర్ నుండి వచ్చిన పెళ్లికూతురు, ఆమె ఫ్రెండు పెళ్లికొడుక్కి బ్రైడల్ మేకప్ చూపించాలని అటు రూములోకి పోయారు. తలుపు తీసిన పిల్ల మామగారు "మీ మొహం మండా! రాండి లోపలికి!"; అన్నాడట. 

అంతలో ఎవరండీ వచ్చింది అనే అత్తగారికి " ఓసి నీ మొహం మండా! ఆ వచ్చినావిడ ఎవరనుకున్నావ్? కాసేపట్లో కాబోయే కోడలు!" అని చెప్పేడు కూడా.

దాంతో ఆవిడ సంతోషంగా "అరె మీ మొహం మండా! లోపలకి పిలవకుండా వాకిట్లో ఉంచారు ఏమిటి?" అందిట.
అంతలో పెళ్లికొడుకు వచ్చి చూసి, "మీ మొహం మండా! కుర్చీలు వెయ్యండి. జాహ్నవి, ఫ్రెండు కూర్చుంటారు. అని మర్యాద చేసినా కూడా, కూర్చోలేదట.

" మేకప్, చీర కట్టు ఎలా ఉందనీ మీకు చూపాలని వచ్చేమండి!" అన్నదిటా పిల్ల ఫ్రెండు ఊర్మిళ.

" మీ మోహం మండా! మేకప్పు చాలా బాగుంది, ఎంత ఫీజు వసూలు చేసేరు?" అన్నాడట పెళ్ళి పెద్ద.

" ఇదేమిఖర్మనే తల్లీ? వీళ్ళకి అందరికి ఊతపదం *నీ మొహం మండా!"*  నేనా? పిచ్చెక్కి పోతుంది. అయినా అతనితో ఫోన్లో మాట్లాడుతూ ఉంటే తెలియలేదా? " గుసగుసగా అడిగిందిట ఊర్మిళ.

" వాట్సాప్ మెసేజ్ లు మాత్రమేనే ఊర్మిళా!  సంప్రదాయము కోసం పెళ్లికి ముందు ముఖాముఖి మాట్లాడుకోలేదు మేం!" అంటూ జాహ్నవి వెర్రిగా చూస్తూ ఉంటే ఓ చిన్న పిల్ల వచ్చి జాహ్నవి పూల జడ పట్టుకొని చూస్తూ,.. "నీ మొహం మండా, ఎంత బాగుందో పిన్నీ ఈ పూల జడ?" అందిట.
ఆమాట్నా పెళ్ళికూతురు, ఫ్రెండు లేచివెళ్లారట!  ఇక వాళ్ళు కనపడలేదు. చుట్టాలు అందర్నీ రిసీవ్ చేస్తూ, క్యాటరింగ్ అజమాయిషీ చూస్తూ గమనించుకోలేదు. అదీ విషయం! " ఒకరు వివరించారు.

" ఇదేం సంబంధం మీ మొహం మండా! మా వైపు నా ఒక్కదానికే ఈ ఊతపదం! మగ పెళ్ళి వారి ఇంట్లో అందరికీ అదే ఊత పదమైతే ఎట్లా?" పిల్ల మేనత్త తిడుతూ ఉంటే...
పెళ్ళికొడుకు, ఫ్రెండ్స్ అర్జంట్ గా పెళ్ళికూతుర్ని వెతకడానికి వెళ్ళేరు!!

No comments:

Post a Comment