‘ఏం బన్నీ, తలుపు కొట్టావు? ఎవరైనా అటెస్టేషన్ సంతకాల కోసం వచ్చారా?’ బాత్రూమ్ తలుపు సగం తెరిచి, సబ్బుకళ్లు సగం మూసి అడిగాను.
‘ఎంతసేపు స్నానం? మళ్ళీ టైమైపోయిందంటూ పరిగెడతావు. త్వరగా రా!’ అంది కాస్త గట్టిగానే.
‘అయిపోయింది. క్రిములతో క్లైమాక్స్ ఫైట్‌లో ఉన్నాను. 99% తొలగిపోయాయి. డెట్టాల్ మరొకసారి పనిచేసింది’ అంటూ మళ్లీ తలుపేసేశాను.
‘మ్రోగింది వీణా.. పదే పదే...’ పల్లవందుకున్నానో లేదో పదే పదే ఫోన్ మోగింది. హాస్పిటల్ నుంచి.
‘చెప్పు నారాయణా! ఏంటి సంగతి?’ అన్నాను స్పీకర్ ఆన్ చేసి.
‘సార్, చింతకాయలు తింటారేట్సార్? తెస్తాను’
‘చింతకాయలా? అవేం తింటాం?’
‘పచ్చడీ గట్రా సేస్తారేమో కద్సార్?’
‘అవుననుకో, కానీ ఒకసారి తనని కనుక్కోవాలి. చెప్తా!’ అంటూ కాల్ కట్ చేశాను.
నీళ్లోసుకుంటోంటే చింతకాయలు తింటారా అని ఫోనేవిఁటో? 😝😂
వెర్రభిమానం ఈ నారాయణకి. ప్రతివారం ఏదో ఒకటి తెచ్చి పడేస్తుంటాడు. పచ్చి శనక్కాయలు, పచ్చి జీడిగింజలు తెచ్చిపోశాడు ఆమధ్య. అటువంటివాటిని చూసే చాలా రోజులైంది. వాటన్నిటికీ బోలెడంత శుశ్రూష చేసేటప్పటికి రంగారావుగారు, విజయరామయ్యగారు దిగొచ్చారు.
స్నానానికి ముగింపువాక్యం పలికి టర్కీ తువ్వాలందుకున్నాను. ‘ఏవిఁటో, మనకిష్టం ఉన్నా లేకున్నా ఈ ’ఇటాలియన్’ కమోడ్‌లు, టర్కీ టవళ్లు, చైనా ఫోన్లు వాడక తప్పట్లేదు’ అనుకుంటూ బయటపడ్డాను.
‘పొంగల్ వేడిగా ఉంది. త్వరగా రా! గంటలు గంటలు పౌడర్రాసుకుంటూ కూర్చోక!’
అవమానము. ఘోర అవమానము. ఇహ్హీ...!
అయ్యారే, నేనేల పాండ్సు రాసుకోవలె? రాసితినిపో, అదియేల అద్దములు, స్పీకర్లు, కంప్యూటర్లపైన బడవలె! పడెనుపో, అదియేల తనకంట పడవలె? పడెనుపో, నన్నేల ఏడ్పించవలె? ఏడ్పించెనుపో, నేనేల ఎన్నటికీ మారకుండవలె?
యధావిధిగా మళ్ళీ ఫోరెన్సిక్ టీమ్ వాళ్లలా గదిలో అన్నిటిమీదా పౌడర్ చల్లేసి ఉన్నంతలోనే సుందరంగా తయారై బయటికొచ్చాను. మరీ సాధారణంగా తయారైతే పేషెంట్లు గుర్తుపట్టి చావట్లేదసలు. గుద్దుకుంటూ పోతున్నారు మొహాల్ మండా!
ఈ ఎండల్లో చొక్కాలాగూలే కష్టం. ఉన్నవే విప్పేసుకుని ‘పఠాన్’ సినిమాలో దీపికాలా పడుకొనే ఉండాలనిపిస్తోంది. అటువంటిది మా డాక్టర్లందరూ తెల్లకోట్లేసుకుని తిరగడం ఎంత ఊష్టమసలు?
అంచేత ఏప్రానదీ వేసుకోకున్నా చూడగానే ‘ఈయనెవరో ఈ హాస్పిటల్లో కాస్త పెద్దాయనేలా ఉన్నాడు. కొంచెం సైడిద్దాం!’ అని పదిమందీ అనుకునేలా రెడీ అవ్వడమనేది నా చేతిలోనే ఉంది.
డైనింగ్ టేబుల్ మీద రెండు గుంటల పళ్లెంలో పొగలు కక్కుతోంది పొంగలి. ఒక గుంటలో కారప్పొడి, మరో గుంటలో అదేదో పచ్చడీ కనబడుతున్నాయి.
‘బన్నీ, చింతకాయ్ పచ్చడి చేస్తావా?' అన్నాను అకస్మాత్తుగా.
ఒకసారి నావైపు ఉత్సాహంగా చూసి ‘ఎందుకు చెయ్యనూ, తప్పకుండా చేస్తాను!’ అంది.
నా ఎడంకన్ను అదిరింది. ఏదో తప్పు జరుగుతోందని అర్ధమైంది.
‘........అదికాదు బన్నీ, నే చెప్పేది నిజమైన చింతకాయ పచ్చడి సంగతి. నారాయణ ఫోన్ చేశాడు. కాయలిస్తాట్ట!’
‘ఎవరండీ ఆ నారాయణ? అన్నీ మూలపదార్ధాలే తెస్తాడెప్పుడూ? బైప్రొడక్ట్స్ గురించి తెలీదా అతనికి? మొన్న నువ్వు తెచ్చిన జీడిగింజల్ని వారంరోజులపాటు ఎండబెట్టి వాచ్‌మన్‌కిచ్చాను. వాళ్ల దగ్గర బొగ్గులుంటాయి కదా, కాల్చివ్వమని. ఈ ఉద్యోగాలు చేసుకునే ఆడవాళ్లకి ఇవన్నీ అవసరమా చెప్పు? అటువంటివన్నీ తీరిగ్గా నువ్వు రిటైరయ్యాక చేద్దువుగాని’
‘పోన్లెద్దూ, ఏదో ప్రేమ. ఉద్యోగం వేయించి కుటుంబాన్ని నిలబెట్టానని మాటిమాటికీ ఇలా వేయించుకోడానికి ఏవో తెచ్చిస్తుంటాడు. చెప్పినా వినడు. సరే, వద్దంటే చెప్పు. ఇంకెవరికైనా ఇచ్చేస్తాడు’
‘సరే, తెమ్మనండి. ఏవో తిప్పలు పడతాం గీతా, నేనూ’ అంది నా నుదుటన బొట్టుపెడుతూ.
షూస్ పాలిష్ చేసుకోవాలి. ఫుట్‌ప్రింట్స్ షాపుకెళ్లిన ప్రతిసారీ పాలిష్ డబ్బా ఒకటి కొనడం, అది బా....గా ఎండిపోయి కరువొచ్చిన రాయలసీమలో బీడుభూమిలా పగుళ్లొచ్చాక పారెయ్యడం. అంతే తప్ప వాడిందీ పాడూ లేదు.
లిఫ్ట్ దగ్గరకి రాగానే అడిగింది
‘ఏమన్నా మర్చిపోయావా?’
‘హఁ హఁహ, అవునోయ్! నా మామూలేదీ?’ అంటూ శోభన్‌బాబులా గొంతు మార్చి అడిగానో లేదో
‘క్యారేజి మర్చిపోయావురా మగడా! లోపల సోఫా పక్కనుంది వెళ్లి తెచ్చుకో!’ అంటూ లిఫ్ట్ డోర్ తెరిచి ఉంచింది మళ్ళీ కిందకెళిపోకుండా!
#ఈపొద్దుముచ్చట్లు (నిన్నటివిలెండి. ‘ఇవాళ ఆదివారం కదా? హాస్పిటలుకెళ్లారా?’ అంటూ వచ్చేత్తారు మళ్లీ)
✍🏻...కొచ్చెర్లకోట జగదీశ్
No comments:
Post a Comment