Wednesday, April 29, 2026

 *గోదావరి స్టేషన్*

🚆

రచన : ఎల్. ఆర్. స్వామి 

గోదావరి జలాలలో మునిగి వచ్చిన గాలి నన్ను తాకి బాగా చలి వేసింది. చీర కొంగు తల మీద నుంచి కప్పుకొని బెంచి మీద నుంచి లేచాను.

నిర్జీవముగా వుంది పార్క్. జాతర ముగిసిన మరునాటి గుడిప్రాంగణములా వుంది. జీవితాలకు విద్యుద్దీపాలని అలంకరించే పిల్లలు కేరింతలుకొడుతూ ఆడుకొని వెళ్ళిపోయారు. ఆడుకుంటున్న పిల్లల మోముల్లో విరిసిన ఇంధ్రధనస్సు లు చూసి మురిసిపోయిన పెద్దలు కూడా ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. వెలుగు రేఖలు సమంగా పడని చోట కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ తమ కంటూ ఓ ప్రపంచాన్ని సృష్టించుకున్న యువజంటలు కూడా కదలిపోయాయి.

ఇంకా అక్కడ వుండటము నా వల్ల కాలేదు. బయటకు నడిచాను. పూర్ణేందు వనే బొట్టు చెరిగిపోయిన ప్రపంచము అమావాస్య చీకటిలోకి జారుతోంది.

రోడ్డు మీదకు వచ్చాను. ఇప్పుడు ఎక్కడకు వెళ్ళటము ?

ఇంటికి వెళ్తే..ఏముంది, ఇంట్లో...

నాలాగే ఏ నిముషములోనైనా కూలిపోవ టానికి సిద్ధముగా వున్న ఇంట్లో చేసేదే ముంది ? పెచ్చులు ఊడిపోయి, రంగులు వెలసిపోయిన, గోడలని చూస్తూ కూర్చోవటము తప్ప చేసేదేముంది?

లేదు. నేను ఇంటికి వెళ్లలేను.

ముందుకి నడిచాన నాలుగు అడుగులు వేసానో, లేదో ఆగిపోయాను. రోడ్డు మలుపు తిరగే చోట గుమిగూడి ఉన్నారు జనము. ఏవేవో మాటలు వినబడుతు న్నాయి.

"ఏమైంది?" గబగబ నడిచి వాళ్ళని సమీపించి అడిగాను.

నా మాటలు ఎవరూ పట్టించుకోలేదు. నన్ను అదోలా చూసి వాళ్ళ మాటల్లో వాళ్లు మునిగిపోయారు. ముసలిదానికి జవాబివ్వటమేమిటనేది కాబోలు వాళ్ళ భావము.

"కళ్ళు, కాళ్ళూ పని చెయ్యని వాళ్ళు ఇంట్లో పడి ఏడవవచ్చు కదా?” నూనుగు మీసాల యువకుడు ఒకడన్నాడు "రోడ్డు మీదకు వచ్చి మమ్మల్ని ఏడిపించట మెందుకు?"

"ఏ రాచకార్యాలు మునిగిపోతాయని వీళ్లు రోడ్డు మీద తిరుగుతున్నారో!" మరొకడు వంతపాడాడు.

"నాకూ అదే అర్ధము కావటము లేదురా" మరో యువకుడు అన్నాడు.

"తిరిగినంత కాలం తిరిగారు కదా? కళ్ళూ, కాళ్ళూ ఆడనప్పుడయినా, ఇంట్లో పడి వుండవచ్చుకదా?"

మరికొంత దూరము ముందుకుసాగేను అప్పుడు కనబడింది, ఆ దృశ్యము చేతి కర్ర సహాయంతో లేవటానికి ప్రయత్నిస్తోంది రోడ్డు మీద పడిన ముసలావిడ. సుమారు ఏడుపదులు సంవత్సరాలు దాటి ఉండవచ్చు ఆవిడకి.

"నన్నెందుకురా ఆడిపోసుకుంటారు" చేతి కర్ర రోడ్డు మీద నుండి తీసుకుని మెల్లగా అడిగింది "నువ్వు కదా వచ్చి నన్ను గుద్దేసింది?"

నేను చుట్టూ దృష్టి మళ్ళించాను రోడ్డు వారగా పడి వుంది, ఒక స్కూటర్. ఆ స్కూటర్ని ఆనుకొని నిలబడి వుంది ఓ పాతికేళ్ళ అమ్మాయి.

"నువ్వెళ్ళమ్మా, ఈవిడ మాటలతో మనకేం పని".

రోడ్డు మీద పడి ఉన్న స్కూటర్ని పైకి లేపి ఆమెకి అందిస్తూ అన్నాడు ఒక కుర్రవాడు "ఆవిడ రోజులు ఎప్పుడో గడిచిపోయా యి"

నిజమే ! ఆవిడ రోజులే కావు ఆవిడ లాంటి మాలాంటి ముసలివాళ్ళ రోజులు ఎప్పుడో గడిచిపోయాయి.

కానీ కృంగి, కృశించిపోయేలా ప్రవహించి నా, గోదావరి జీవనదియని ఇరువైపుల జనానికి ప్రాణదాయని అని బ్రతుకు చూడని కుర్రవాళ్ళకి ఏమి తెలుస్తుంది.
వీళ్ళు ఇక మారరు.

జనాన్ని దాటుకుంటూ ముందుకు నడిచాను. ఎదురుగా ఉన్న గోదావరీ స్టేషన్ చేరుకోవటమే నా లక్ష్యం.

చీకటిగా వుంది స్టేషన్ ఆవరణ. జీవితపు వసంతకాలములో వచ్చిపోయే అతిధుల కోసము, చుట్టాల కోసము అహర్నిశలూ శ్రమపడి, అలసిపోయి, అకాల వార్ధక్య ములోకి జారిపోయి, నీరసముగా పడుకున్న అతివలా ఉంది స్టేషన్. ఏ మాటలు అన్నా ఎదురు తిరగరనే ధైర్యము వల్ల ముసలి వాళ్ల మీద విసిరే దుర్జ్భాషితాలలా స్టేషన్ చుట్టూ చెత్తాచెదారము విసరేసి వున్నాయి.

మెల్లగా అడుగులు వేసి ప్లాట్ఫారము ఎక్కాను.. ఏ నిముషములోనయినా ఆగిపోయే ముసలి వాని గుండెలా వెలిగి ఆరుతోంది ఒకే ఒక ట్యూబ్ లైట్. ఒకప్పుడు సరకులమ్మిన దుకాణాలు సందడిగా ఉన్న ఆఫీసు గదులు, ఖాళీగా గాలి తీసిన బెలూన్లలా ముడుచుకు పోయి ఉన్నాయి.

ముందుకి నడిచాను ప్లాట్ఫారము మీద నిద్రపోతున్న ముసలి కుక్కలు ఓసారి బద్ధకముగా కళ్ళు తెరచి చూసి మళ్ళీ పడుకున్నాయి.

రోజూ ఆ ప్లాట్ఫారము మీద గంటల తరబడి కూర్చోవటమ నాకు అలవాటు. ఏ బండి ఆగని గోదావరి స్టేషన్ నా బ్రతుకుకు ప్రతీకలా అనిపిస్తూ వుంటుంది నాకు.

ఒక కుర్చీ మీద నడుము వాల్చాను. కాళ్ళూ చేతులు నొప్పిగా వున్నాయి. సాయంత్రము నాలుగు గంటల నుంచీ తిరుగుతూనే ఉన్నాను. ఏమీ తినలేదు. త్రాగలేదు కళ్ళుమూతలు పడుతున్నాయి

పట్టీ పట్టని నిద్రలో ఎవరో లేపినట్లు తోచింది. కర్రతో ఎవరో పొడిచినట్లు బలవంతముగా కనురెప్పలు విప్పాను. ఎదురుగా నిలబడి విన్నాడు గుబురు మీసాల హెడ్డు.

“ఏమిటే ముసలీ నీకు రోజూ చెప్పాలా, ఇక్కడ తొంగో కూడదని? యిదేమన్నా నీ బాబుగాడి సొమ్మా." కర్రతో మరోసారి పొడిచాడు హెడ్డు.

హెడ్డువాడు బాగా పరిచయమే. ఆగని ట్రైన్లని చూస్తూ స్టేషన్లో గంటలు గడిపే నాతో అప్పుడప్పుడు కబుర్లు ఆడుతూ వుంటాడు. అతను 'టీ' కని సిగరెట్లు కనీ అయిదు, పదీ తీసుకుంటూ వుంటాడు. నిన్ననే వాడికి పాతిక రూపాయలిచ్చాను ఆ డబ్బు పుచ్చుకున్నప్పుడు ఎంత బాగా మాట్లాడాడు.

మెల్లగా లేచాను వాడిని నాలుగు తిట్టాలనీ, ఛడామడా దులపాలనీ నోరు తెరచాను కానీ..

అంతలో గుర్తుకువచ్చింది. వాడు పుచ్చుకున్నది పాతిక రూపాయ లేగా ! 

తన జీవితమంతా పుచ్చుకున్న కొడుకు ఏమి చేసాడు !?

పది సంవత్సరాల క్రితము ఇక్కడే బండి ఎక్కాడు వాడు. ఉద్యోగములో చేరి రెండు నెలలు పోయాకా వచ్చి నన్ను తీసుకొని వెళతానన్నాడు, కానీ వాడు రాలేదు. ఇప్పుడు గోదావరీ స్టేషన్లో బళ్ళే ఆగటం లేదు.

చీర కొంగుతో కళ్ళు ఒత్తుకున్నాను.

ప్రపంచములోని వెలుగుని తన గుప్పెట్లో పెట్టుకొని, పశ్చిమార్ణవములోనికి దూకుతున్న సూర్యుడిని చూస్తూ ఇంటి గుమ్మం దగ్గర నిలబడ్డాను. నేను ఏదో బండి ఆగిన శబ్ధము విని తల ఎత్తి చూసాను. నలుగురు ఆయనను మోసు కొని వచ్చి గుమ్మం దగ్గర పడుకోపెట్టారు. నా కళ్ళు తిరిగియి ఎంతసేపు అలా గడిచిపోయిందో తెలియదు. తెలివి వచ్చినప్పుడు ఇల్లంతా హడావిడిగా వుంది చుట్టాలు, స్నేహితులూ, ఇంటి నిండా వున్నారు.

"పాపం సముద్రములో పడిపోయారట" వీధి గుమ్మం అవతల పడుకోపెట్టిన అతని కళేబరాన్ని చూసి వెళ్ళేవారి మాటలు నా చెవిలో పడ్డాయి నాకు. నేను కదలలేదు చుట్టూ వున్న ప్రపంచము ఓ పెద్ద సున్నాలా అనిపించింది.

"జరిగిందేమో జరిగిపోయింది" ఓ ముసలావిడ నా దగ్గరకు వచ్చి అంది. "బాధపడితే పోయిన ఆయన వస్తారా, అమ్మా"

"ఎంతో కొంత చదువుకున్న దానివి, నీకు చెప్పదగ్గ దానిని కాదనుకో" మరో ముసలావిడ అంది. "ఓ పది సంవత్సరా లు కష్టపడ్డానంటే నీ కొడుకు చేతికి అందివస్తాడు, ఆ తర్వాత నీ కష్టాలు తీరిపోతాయి.

నిజమే! వీడు ఎదిగితే ఇంక కష్టమే ముంటుంది!

నేను లేచాను శక్తి కూడకట్టుకుని ముందు కి నడిచాను. శుక్లపక్షవు చంద్రునిలా దిన దిన ప్రవర్ధుడయ్యాడు వాడు పదిహేను సంవత్సరాలలో పూర్ణ చంద్రునిలా ఎదిగాడు.

ఇంజనీరింగ్ చదివాడు గుజరాత్లో మంచి ఉద్యోగము వచ్చింది. ఉద్యోగానికి బయలుదేరుతూ వాడన్న మాటలు ఇంకా నా చెవిలో గింగురుమంటున్నాయి.
https://chat.whatsapp.com/L1U7VgqJf648XU8zen6US2
ఈ ఫ్లాట్ఫారము మీదే బండి ఆగింది, ఆ రోజు బండి బయలుదేరక ముందు బండి లో నుంచి చేతులు బయటకి చాచి నా కన్నీళ్ళు ఒత్తుతూ అన్నాడు వాడు.

"బాధపడకమ్మా, ఓ రెండు నెలల్లో ఇల్లు చూసి నిన్న తీసికెళతానుగా".

బండి వెళ్ళిపోయింది. అంతవరకు చక్కని వెన్నెలను అందించి మబ్బు తెర వెనుక జారుకున్న చంద్రుని వెలుగులో అడుగులు వేసాను, ఇంటి వైపు.

రోజులు గడిచిపోయాయి. ఆరు నెలలు తర్వాత వచ్చింది, మొదటి ఉత్తరము. వాడు అమెరికా వెళతాడట! ఆశగా ఉత్తరాన్ని అటూ, ఇటూ తిప్పి చూసాను, వాడి చిరునామా ఎక్కడా కనబడలేదు.

గట్టిగా నిట్టూర్చి కళ్ళు ఒత్తుకున్నాను.

బ్రతుకు వేగము పుంజుకుంది. సైకిలు మీద వెళ్ళినవారు స్కూటర్లోకి మారారు. రోడ్డు నిండా కనబడిన సైకిల్ రిక్షాలు ఆటోలకి, దారి ఇచ్చి కనుమరుగయి పోయాయి. అక్కడక్కడా కారులు కూడా కనబడుతున్నాయి.

గోదావరి స్టేషన్లో ఆగే బళ్ళ సంఖ్య తగ్గిపోయింది. మానవ సంబంధాలను కలపటము కోసము సంత్సరాల క్రితం నిర్మించిన వారధి బలహీనమైపోయింద ట!

చూపు మందగించింది, కానీ ఎదురు చూపు మానలేదు. ప్రతీ రోజూ వచ్చి ఈ బల్ల మీద కూర్చుంటూనే ఉన్నాను.

ఇక్కడే కనబడ్డాడు ఓరోజు సుబ్బారావు, సుబ్బారావు మా ఈడు వాడే, అమెరికా లో వుంటుంన్నాడని విన్నాను.

నా మనస్సుకి పట్టిన ముసురు ఊరంతా పాకినట్లు అయింది. ఆరోజు చిన్న తుంర్లు కూడా పడుతున్నాయి. వాన జల్లు నుంచి తప్పించుకోవటముకోసమని కొంత దూరములో వున్న బల్ల వైపు నడుస్తూ వుంటే కనబడ్డాడు సుబ్బారావు.

"మీరు మీరు.. " అతను సుబ్బారావు అవునో, కాదో అనే అనుమానముతో నా గొంతు తడబడింది.

"నేను సుబ్బారావునే సీతా" సుబ్బారావు అన్నాడు. "బాగున్నావా" అని నేనడగను ఎందుకంటే నువ్వెలాగున్నావో నాకు తెలుసుకదా." అతను చేతిలో వున్న పైపు ఓసారి నోట్లో పెట్టుకొని గట్టిగా పొగపీల్చి అన్నాడు.

"నీ కొడుకు గురించి నువేమి అడగబోతు న్నావో నాకు తెలుసు, పాపం పిచ్చిది తల్లి మనస్సు" సుబ్బారావు ఓ నిమిషము ఆగాడు. ఆ తర్వాత అన్నాడు “వాడికి ఏమిటమ్మా! బ్రహ్మాండముగా వున్నాడు. దొరసానిని పెళ్ళి చేసుకున్నవాడికి అమెరికాలో లోటేమిటమ్మా!"

ఆకాశము ఓసారి వురిమింది. ఆ వురుముకు తట్టుకోలేక నేను, చెవులు మూసుకున్నాను.

పెనుతుఫానే వీచింది. అంతవరకు మూగగా ఓ పాయలా రోదిస్తూ వెళ్ళిన గోదావరీ తల్లి, గుండెలోని దుఃఖము కట్టలు తెంచుకొని ప్రవహించి ఒడ్డున వున్న యిళ్ళని జలమయము చేసింది.

వివరము విని వచ్చింది మా చెల్లెలు. తనతో రమ్మని బలవంతము చేసింది.

"మేమేమన్నా పరాయివాళ్ళమా చెప్పు. నా పిల్లలు నీ పిల్లలు కాదా?" నా చెల్లెలు అంది "వాడు పోతే పోయాడు మాతో వుండవచ్చుకదా?" ఉండాలనే అనుకున్నాను.
https://chat.whatsapp.com/L1U7VgqJf648XU8zen6US2
ఆ వుద్దేశముతోనే దాని వూరు వెళ్ళాను. అంతా బాగుంటే ఉద్యోగం బదిలీ చేయించుకోవాలని కూడా అనుకున్నాను కానీ..

"పెద్దమ్మ వాళ్ళ వూరు ఎప్పుడు వెళు తుందమ్మా?" బయటికి వెళ్ళి వస్తున్న నేను ఆ మాటలు విని ఆగిపోయాను.

"ఊరు వెళ్ళదమ్మా ఇక్కడే వుంటుంది"

"ఎందుకని?"

"పెద్దమ్మకి ఎవరూ లేరు కదమ్మా, మనం తప్ప, అందుకే ఇక్కడ వుంటుంది"

"నా కిష్టంలేదమ్మా" ఆధునిక చదువులు, సంస్కారములు" మారిపోయిన స్వార్థానికి బానిసయిన అమ్మాయి ఖచ్చితంగా అంది.

"అలా అనకూడదమ్మా, పెద్దమ్మని మనం చూడకపోతే మరెవరు చూస్తారు?"

"అది నాకు తెలీదు. అసలే ఇల్లు ఇరుకు, దానికి తోడు ఆవిడ దగ్గు ఒకటి రాత్రంతా నిద్రపోనివ్వటమే లేదు"

"మందు లేసుకుంటే దగ్గు తగ్గిపోతుందిలే"

"దగ్గుకంటే మందు తీసుకుంటుంది కానీ అవిడ ఆలోచనలకి మందులు వాడలేము కదమ్మా?" ఓ నిముషము మాటలూ ఆగి పోయాయి. నేను ఇంటిలోకి అడుగు పెట్టాను.

"నేను జీన్సు వేసుకుంటాను, జుత్తు కత్తిరించుకుంటాను, అది నా ఇష్టం, ఆవిడ ఇష్టం కాదు కదా? అవన్నీ పెద్దమ్మ కి ఎందుకమ్మా?"

"కూరంతా అలా ఏరిపారేస్తావేమిటి?" నా అడుగుల సవ్వడి వినటం వల్ల కాబోలు మాటమారుస్తూ అంది మా చెల్లెలు.

"చూడమ్మా బాగాచూడు ఇదేమీ కూర కాదు, కరివేపాకు "కూరలో కరివేపాకును ఏరిపారేయక తినేస్తారా?"

"అక్కడ నా స్థానము ఏమిటో నాకు అర్థమయింది. ఆరోజే బయలుదేరాను మా వూరికి.


"ఇంకా ఇక్కడే తొంగున్నావన్నమాట నిన్ను నిన్ను. ..." మళ్ళీ వచ్చాడు హెడ్డు.

మెల్లిగా లేచి ముందుకు నడిచాను. ప్లాట్ఫారము దిగి పట్టాలు దాటి గోదావరీ ఒడ్డున నడిచి వెళితే ఇల్లు చేరుకోవచ్చు.

ప్లాట్ ఫారము దిగాను. జీవితములో దాటవలసిన వివిధఘట్టాల లాంటి పట్టాలు, ఒకటి వెనక ఒకటి కనబడ్డాయి. దృష్టినానించి మెల్లిగా పట్టాలు దాటు కుంటూ ముందుకు సాగాను. ఆఖరి పట్టా దాటుతూ వుంటే గుండె జారిపోయింది. ఎదురుగా అతివేగముతో వస్తోంది ట్రైన్!

కళ్ళు తిరగిపోయాయి పట్టాల మధ్యన పరచిన రాళ్ళకు కాళ్ళు తగిలి అవతల పడ్డాను.
https://chat.whatsapp.com/L1U7VgqJf648XU8zen6US2
కళ్ళు తెరచినప్పుడు ఓ నులక మంచము మీద పడి వున్నాను. ప్రపంచాన్ని కబళిం చిన చీకటి పూర్తిగా తొలగిపోయింది.

ఉదయ సూర్యుని వెచ్చని కిరణాలు, ఊడిపోయిన తాటాకుల సందులలో నుంచి వచ్చి నన్ను పలకరించాయి. కళ్ళు తెరచి చూసాను ఎదురుగా నిలబడి వున్నాడు ఓ కూలివాడు.

“ఒసే, అమ్మగారు లేచారే” నేను కళ్ళు తెరవటము చూసి అతను ఆనందముతో అరిచాడు "టీ నీళ్ళు పట్రావే”.

ఒక ఆమె నా దగ్గరకు వచ్చింది చేతిలో ఒక చిన్న కేరియర్ గిన్నె, చంకలో నెలల పిల్ల.

"టీ తీసుకోండి అమ్మగారు" ఆమె కేరియర్ గిన్నె నాకు అందించింది "టీ తీసుకుంటే బాగుంటుంది, ఓపిక వస్తుంది".

నేను ఆ ఇద్దరినీ చూస్తూ పడుకున్నాను అసలు కదలలేదు.

"టీ మేము చేసింది కాదు అమ్మగారు మీ కోసము హొటలు నుంచి తెచ్చాము తీసుకోండమ్మగారు".

నేను ఇష్టములేకపోయినా 'టీ' అందుకో వలసి వచ్చింది.

"నాకు పనిటయిము అయిపోనాది, నేను వెళతాను, నువ్వు వుండిపోయి అమ్మ గారిని జాగ్రత్తగా చూసుకో". అతను వెళ్ళిపోయాడు.

వాళ్ళిద్దరూ గోదావరి పై కొత్తగా నిర్మించే వంతెన కోసం, పని చేసే కూలీలట. నన్ను రోజూ ఆ రోడ్డు మీద చూస్తూ వుంటారట! అంతే కాదు నా గురించిన వివరాలు కూడా వాళ్లకి తెలుసట!
https://chat.whatsapp.com/L1U7VgqJf648XU8zen6US2
నులక మంచం మీద అసహనముగా కదిలాను, "నేను ఇంటికి వెళ్ళాలి" మంచము దిగుతూ ఉంటే పరుగెత్తుకొ చ్చింది ఆమె.

"కదలకండమ్మా, మీరు పడుకోండి"

"లేదు నేను ఇంటికి వెళ్ళాలి"

"ఒద్దమ్మగారు ఉండండి. ఇంటి దగ్గర మీకు ఎవరున్నారని? ఇక్కడే వుండండి.
మాకు కలిగింది మేము పెడతాము".

నేను ఆశ్చర్యముతో చూస్తూ ఉండిపో యాను. లక్షలు సంపాదిచే కొడుకు చెప్పని మాట దీని నోటి నుంచి రావటమే మిటి ? సంపాదించే కొద్దీ, డబ్బు మీద ఆశ పెరుగుతుందని చెప్పటము నిజమే కాబోలు !

నేను మెల్లగా అడుగులేసాను. తడక తలుపు దాటుతూ వుంటే కాళ్ళకి ఏదో మెత్తగా తగిలినట్లు తోచింది. వొంగి చూసాను. సంవత్సరము నిండని ఆమె బాబు నా పాదాలని తడుముతున్నాడు.

హృదయము స్పందించింది, కానీ ముందుకి సాగాను. అ పసికందు చేతులు నా పాదాలను విడచిపెట్టలేదు. పాదాలకి తగిలే చీర అంచులని పట్టుకొని లాగుతు న్నాడు. బోసినవ్వులు నవ్వుతున్నాడు. మనకు తెలియని వాడి భాషలో ఏవేవో చెబుతున్నాడు.

నాలో ఏదో చెప్పలేని స్పందన!

హఠాత్తుగా వాడిని ఎత్తుకున్నాను. వాడిని ఎత్తుకుని ముందుకు నడిచాను. ఇంటి వైపు కాదు, ఇరువైపులా వున్న మావన సంబంధాలను కలపటానికి, కొత్త వారది నిర్మిస్తున్న కూలీల వైపు.

*సమాప్తం*

꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
*కథల ప్రపంచం* 

https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe

*తెలుగు భాషా రక్షతి రక్షితః* 

*1 YEAR SUBSCRIPTION 120/-
phone pe & Gpay to 9849656434*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂

No comments:

Post a Comment