Friday, May 1, 2020

అహం బ్రహ్మాస్మి

🕉అహం బ్రహ్మాస్మి

నేను' అంటే ఎవరు?
మనిషినెవరు సృష్టించారు?
భగవంతుడు...

అని భగవంతుడు చెప్పాడా? మనం అనుకుంటున్నాం...

అంటేఎవరూ సృష్టించలేదు.

ప్రతిమనిషీ 'నేను' అనుకుంటూ తనకొక ప్రత్యేక గుర్తింపును, ఉనికిని తనకు తాను సృష్టించుకుంటున్నాడు.

నిజానికి మనిషికి, అంటే మనకు తెలీదు. నిజానికి చాలామందికి తెలుసు. ఏమిటీ భిన్న వ్యక్తీకరణ? నిజమే అయితే రెండూ నిజమే. తెలీని అమాయక స్థితిలో చాలామంది తెలిసీ చెప్పలేని ఆత్మస్థితిలో మరెంతోమంది ఉంటున్నారు.

మధ్యస్థ మిడిమిడి జ్ఞానం మనను అయోమయంలో పడేస్తోంది. తెలిసీ ఇంకా చెప్పగల స్థితిలో ఉండి చెప్పే మహానుభావుల అభిప్రాయం...

'నేను' అంటే దేహస్థితి కాదు.
బాహ్యస్థితి కాదు. ఆది లేని, అంతం లేని ఆత్మ ధృతి. నివురుగప్పిన నిప్పులా లోలోన ప్రజ్వరిల్లుతున్న మహాకాంతి దీపం.

ఎన్నడూ వాడని అనంత శాంతి పుష్పం. దేహం అంటే సప్త ధాతువులు, పంచ కోశాలు, వాయువులు, నాడులు. ఆత్మను కప్పిఉంచిన ఆధారాలు.

ఔను... బంగారు పళ్లానికి కూడా గోడ చేర్పు కావాలి. వజ్రానికీ బంగారు ఆభరణపు ఆధారం కావాలి.

జీవాత్మకు దాన్ని నిలిపి ఉంచగల ఉపాధి కావాలి. అదే దేహం. పంచకోశ నిర్మిత దేహం. పంచభూత సమన్విత దేహం.
ఆ మహోన్నతమైన ఆత్మస్థితిని, స్థాయిని ధరించగల ఒక వజ్రకవచం, ఒక అమృత కలశం కావాలి. కాబట్టే
రక్త మాంస సంతులితమైన దేహాన్ని డెబ్భైరెండు వేల నాడులతో, పంచకోశాలతో, వాయువులతో, ఇరవైతొమ్మిది తత్వాలతో, ఆధ్యాత్మిక హృదయంతో (కుడివైపున ఉంటుంది), మేరు దండంతో, దానిలోని షట్ చక్రాలతో,
ఇడా పింగళ సుషుమ్ననాడులతో, సహస్రార కమలంతో అత్యున్నతంగా, పరమోత్కృష్టంగా అలంకరించాడు భగవంతుడు.

వాటన్నింటినీ కాపాడేందుకు, సమన్వయం చేసేందుకు రుధిరం, మజ్జ, అస్థులు, నేత్రాలు, చక్రాలు,జిహ్వ...
ఒకటేమిటి అంగుళమంగుళాన ఒక అధిష్ఠానదేవత. అంటే ఆత్మ శాశ్వతం అయినప్పుడు, ఎవరూ సృజించనిదైనప్పుడు దాని ఉపాధి అయిన శరీరాన్నిమాత్రం మరెవరో సృష్టించారా? ఆలోచిద్దాం...

సాలెపురుగు తన చుట్టూ తన రక్షణ కోసం తానే అందమైన, భద్రమైన గూడు అల్లుకుంటుంది. అవసరం తీరిపోయాక ఆ గూడును మళ్ళీ తనలోకే లయం చేసుకుంటుంది. ఆత్మ అవధానమూ అంతే.

అమృతాత్మ స్వరూపుడైన మానవుడు ఒక్కసారి కుబుసంలా తన దేహకోశాన్ని విస్మరిస్తే, విదిలిస్తే, వదిలేస్తే ఆత్మ కుండలిని తేజో విరాజమానం అవుతుంది.

దేహం రక్షక పత్ర సమానం. సుందర సుకుమార సుమాన్ని ధరించినంత మాత్రాన అదే పుష్పమై పోదు. రక్షక పత్రాలు వాలిపోవలసిందే. రాలిపోవలసిందే. పుష్పం జగజ్జేయ మానంగా వికసించి వెలిగిపోవలసిందే.

మనిషి 'నేను'ను శరీరమే అనుకున్నప్పుడు,
ఆదేహ భావంతో తాదాత్మ్యం చెందినప్పుడు...
ఆదేహాన్ని సృజించినవాడు... అనుమానమేల...
ఆభగవంతుడే.

'నేను' ఆత్మే అనుకున్నప్పుడు
ఆత్మకు జనన మరణాలు లేవు. సృజన సంహారాలు లేవు. ఆత్మ శాశ్వతుడే. స్వయంభువే.
ఈ సృష్టిలో ఒక శాశ్వత నియమం ఉంది. ఏ పదార్థాన్నీ ఎవరూ సృష్టించలేదు. నాశమూ చేయలేరు.

ఆ శక్తి ఒక్క భగవంతుడికి మాత్రమే ఉంది.
ఎవరైనా దేన్నైనా
సృష్టించారంటే మరో చోటునుంచి తెచ్చుకోవటమే.
నాశనం చేశారంటే మరో రూపంలోకి మార్పు చెందటమే.

వాయువు నీరవుతుంది. నీరు మంచు అవుతుంది, మళ్ళీ మంచు నీరవుతుంది.
నీరు వాయువవు తుంది.కేవలం మార్పు అంతే. ఉన్నదేదో ఉంది. అది పోదు.లేనిదేదీ రాదు.

మనిషి కృత్రిమ 'నేను'లోంచి బయటపడాలి.
స్వయంభువు జాగృతం కావాలి.

మహితాత్మకం కావాలి. దానికి... ఈ శరీరంతో తాదాత్మ్యం చెందిన మనిషిసాధన (ధ్యానసాధన ) తో కొంత- దేహభావంలోంచి తొలుచుకుని ఆత్మభావంలోకి చేరుకోవాలి. నేను అసలు నేనులోకి తాదాత్మ్యం చెందితే ఇక నేను, నీవు, దేహం, సృజన, మరోటీ మరోటీ... ఏదీ లేని శుద్ధాత్మ. అంతా...
అహం బ్రహ్మాస్మి!🕉

No comments:

Post a Comment