*||నా దేశాన్ని మేలుకొలుపు తండ్రీ||*
*ఎక్కడ పవిత్ర నదుల్లో శవాలు ప్రవహించవో…*
*ఎక్కడ సామాన్యుల మృతదేహాలను శ్మశానాలు తిరస్కరించవో…*
*ఎక్కడ నిరుపేదలను కాసుల ఆసుపత్రులు నిరాదరించవో…*
*ఎక్కడ ప్రాణం కంటే ప్రాణవాయువు ఖరీదు కాదో…*
*ఎక్కడ అత్యవసర మందులు నల్లబజారులో బందీకావో…*
*ఎక్కడ ఆరోగ్యం అంగడి సరుకు కాదో, ఎక్కడ ప్రజారోగ్యం కంటే ఎన్నికల ప్రయోజనాలే పరమావధి కావో,*
*ఎక్కడ దేశం కంటే కొందరు వ్యక్తులు గొప్పవారు కాలేరో,*
*ఎక్కడ అసత్యాలూ ఆర్భాటాలూ అహంకారాలూ ఏలికలకు ఆభరణాలు కావో,*
*ఎక్కడ బడులూ ఆస్పత్రుల కంటే గుడులు గొప్పవి కావో,*
*ఎక్కడ సైన్స్ మీద అజ్ఞానం పెత్తనం చేయదో,*
*ఎక్కడ సత్యానికీ నిర్భయత్వానికీ సంకెళ్ళు పడవో,*
*ఎక్కడ దేశద్రోహం దేశభక్తిగా.. దేశభక్తి దేశద్రోహంగా చెలామణి కావో,*
*ఎక్కడ త్యాగాన్ని స్వార్థం.. నిజాయితీని నిర్లక్ష్యం..,*
*దేశ లాభాన్ని సొంత లాభం కబళించవో,*
*అక్కడ ఆ సుందర సుప్రభాత స్వేచ్ఛా స్వర్గంలో …*
*నా దేశాన్ని మేలుకొలుపు తండ్రీ..!!*
(రవీంద్రుడి జ్ఞాపకంలో..)
No comments:
Post a Comment