Wednesday, October 16, 2024

 Vedantha panchadasi:
బ్రహ్మాద్యాః స్తంబపర్యంతాః ప్రాణినోఽత్ర జడా అపి ౹
ఉత్తమాధమ భావేన వర్తన్తే పటచిత్రవత్ ౹౹5౹౹

5. పటచిత్రమునందు 
బ్రహ్మ విష్ణువు మొదలగు శ్రేష్ఠములైన చిత్రములు,
నీరు తృణములు మొదలగు సామాన్య చిత్రములు ఉన్నట్లే శుద్ధ బ్రహ్మము నందును బ్రహ్మాది దేవతలు గడ్డి గరిక వంటి సామాన్య ద్రవ్యములు ఆరోపింపబడుచున్నది.
బ్రహ్మ మొదలు గరిక వరకు చేతనాత్మకము,ఉత్తమము.పర్వతములు నదులు మొదలగునవి జడాత్మమకములు,అధమములు.

చిత్రార్పిత మనుష్యాణాం వస్త్రాభాసాః పృథక్ పృథక్ ౹
చిత్రధారేణ వస్త్రేణ సదృశా ఇవ కల్పితాః ౹౹6౹౹

6. ఈ పటచిత్రమునందలి మనుష్యులకు మరల వివిధములగు వస్త్రములు, చిత్రమునకు ఆధారమైన వస్త్రము వంటివే,కల్పింపబడును.
ఆ కల్పిత వస్త్రములు వస్త్రాభాసలు.

ఒక్కసారి పరిమితి నెలకొన్నచో పిదప ఇతరపరిణామములు దానివెంట సంభవించును.
అవి భౌతిక,మానసికవ్యాధులు.
సముద్రము పైభాగమున తరంగములు ఆవిర్భవించి పిదప బుడగలు మొదలగు వానిని సృజించును.

 పటచిత్రమునందు భగవంతునివంటి శ్రేష్ఠమైన చిత్రాములు  ,తరువాత వివిధ రకములైన సామాన్యచిత్రములు కూడా  ఉంటాయి. మానవులచిత్రములు,అందులోని మానవ బొమ్మలకు వస్త్రములు,
ఆ వస్త్రములకు మళ్ళీవివిధములైన రంగులును, అలంకరణకు ఆభరణములు ఇలా ప్రతిది కల్పననే.ఆ కల్పితములన్ని అభాసలు.

అలాగే శుద్ధ బ్రహ్మమునందు కూడా
బ్రహ్మాది దేవతల నుండి గడ్డి గరిక వంటి సామాన్య ద్రవ్యముల వరకు ఆరో పింపబడుచున్నవి.ఇందులో చేతనాలు(ఉత్తమమైనవి),
జడాలు(అధమములు) వరకు ఉన్నవి.

శుద్ధ చైతన్యము కేవలచైతన్యమయము,జ్ఞేయవిషయరహితము,సర్వవ్యపియునగు చిదాత్మ స్వచ్ఛము,దాని వెలుగులో సర్వజీవులు తమ నిజాత్మను తెలిసికొందురు.

మనస్సుగా,బుద్ధిగా,ఇంద్రియములుగా,అట్టి ఇతర సర్వభావనలుగా తన స్వరూపము నిషేధింపబడిన (తిరస్కరింపబడిన) పిదప శుద్ధ చైతన్యమయిన బ్రహ్మము నేను అని తెలియవలెను.

బ్రహ్మము ఏకము కావున ద్వితీయత్వాదులు ఎచటనుంచి వచ్చును.అవిద్యా కల్పితమైన వ్యవహారంలో బ్రహ్మ పరిణామం ఎన్నో రూపాలలో కనబడవచ్చు. కానీ పారమార్థక రూపంలో బ్రహ్మమొక్కటే.నామరూపాలు లేవు.

నీ ఆత్మయే పరబ్రహ్మ అని తెలుసుకోవటం వల్ల మోక్ష ఫలసిద్ధి కలుగుతుందని పరిణామ శ్రుతి బోధిస్తున్నది.       

No comments:

Post a Comment