Wednesday, October 16, 2024

****🌹కుండలిని సిద్ధ మహా యోగము🌹: మూలం : కపాల మోక్షం, శీర్షిక : నా స్వాధిష్టాన చక్రం అనుభవాలు - అనుభూతులు

 🌹కుండలిని సిద్ధ మహా యోగము🌹:
మూలం : కపాల మోక్షం

 
అనుభవం మరియూ అనుభూతి :  శ్రీ పరమహంస పవనానంద



శీర్షిక : నా స్వాధిష్టాన చక్రం అనుభవాలు - అనుభూతులు



స్వాధిష్టాన చక్రం అనుభవాలు :

ఈ చక్ర జాగృతి, శుద్ధి,ఆధీన,విభేదన సమయాలలో నాకు కలిగిన భావాలు,అనుభవాలు నిజాయితిగా నా డైరీలలో వ్రాసుకోవడము జరిగినది.అందరికి తెలియాలనే ఉద్ధేశ్యముతో వాటిని యధాతధముగా ఇక్కడ ఇవ్వడము జరిగినది. తప్పుగా అనుకోవద్ధు. వీటి వలన ఎవరికైన ఇబ్బంది లేదా బాధ కలిగితే నన్ను క్షమించండి.
అలాగే ఈ చక్రానుభవాలు, ఈ దైవికవస్తువులు అనేవి మీకు మీ ఆరాధన బట్టి వస్తాయి. మీ ఆరాధన అనగా నిరాకార ఆరాధన అయితే మీకు ఈ చక్రానుభవాలు మాత్రమే కలుగుతాయి. అదే మీది విగ్రహారాధన అయితే ఈ చక్రానుభవాలతో పాటుగా ఈ చక్ర దైవికవస్తువులు వస్తాయి. లేదా ఈ వస్తువులున్న క్షేత్రదర్శనాలైన కలుగుతాయని గ్రహించండి. కాని తప్పని సరిగా ఈ చక్రానుభవముతో పాటుగా ఈ చక్రదైవిక వస్తువు ఏదో ఒకటి తప్పని సరిగా సాధకుడు పొందవలసి ఉంటుంది. ఈ చక్రానుభవాలు అలాగే ఈ చక్ర దైవికవస్తువులు అనేవి మీ గతజన్మ సాధన బట్టి ఈ చక్ర జాగృతి, శుద్ధి, ఆధీన, విభేదనలకి సంబంధించి ఆయా సాధన స్ధితిని బట్టి వస్తాయని గ్రహించండి.
 .


అక్టోబర్ 28: మా గురుదేవులుని అడిగితే “నాయనా! నువ్వు ఎప్పుడైతే ఈ స్వాధిష్టాన చక్రం జల సిద్ధి వచ్చినదో లేదో పరీక్షించినావో ఆనాటి నుండి ఈ చక్రం నెమ్మదినెమ్మదిగా బలహీన పడుతూ వస్తోంది.అది ఎప్పుడైతే బలహీనమైనదో ఆనాటినుండి నీకు మత్తు పానీయాలు, మత్తు పదార్థాల సేవనం ఆలోచనలు, సైకో తరహా లక్షణాలు నీలో ఏర్పడినాయి. ఇంకా బలహీనపడి ఉంటే నయం కాని వ్యాధులు, మూత్ర వ్యాధులు,మర్మాంగ వ్యాధులు, మానసిక వ్యాధులు కలుగుతాయి. కాబట్టి శలభాసనం, మార్జాలాసనం, మకరాసనం, భుజంగాసనం ఆసనాలు వేస్తూ ఆరునెలలపాటు పెరుగన్నం తింటే ఈ చక్రం బలపడుతుంది” అని చెప్పటం జరిగినది.దానితో మరో ఆరు నెలల పాటు ఆయన చెప్పినట్లుగా చేసాను. అప్పుడు నాకు ధ్యానంలో ధన సంబంధ ఆలోచనలు, మత్తు పదార్థాల సేవనం ఆలోచనలు,  మత్తు పానీయాలు సేవనం  ఆలోచనలు తగ్గటం ఆరంభించి నాయి. ధ్యానం మీద తిరిగి ధ్యాస పెరిగినది.
P17:
జనవరి 10: ఈ రోజు నాకు హిమాలయాలలో దొరికే విష్ణు సాలగ్రామం దొరికినది. దానిని పూజలో ఉంచాను.
జనవరి 30: ఈ రోజు నాకు కాశీక్షేత్రము నుండి లక్ష్మి గవ్వలు వచ్చినాయి. వీటితో గవ్వల ప్రశ్నలు వేయటం ఆరంభించాను.
ఫిబ్రవరి 18: ఈరోజు నాకు రామేశ్వర క్షేత్రములో నుండి లక్ష్మీ శంఖం వచ్చినది. పూజలో ఉంచినాను.
మార్చి 2:ఈ రోజు నా ఇంటికి వెంకన్న స్వామి సహిత మహాలక్ష్మి విగ్రహ మూర్తి వచ్చినది.నవరాత్రి పూజలో,శ్రావణ మాస పూజలో,దీపావళి పూజలో లక్ష్మిపూజ చెయ్యడం ఆనవాయితీగా అయినది.
నవంబరు 10:ఈ రోజు లక్ష్మి దీపావళి.లక్ష్మి పూజ అయినది.విచిత్రంగా నాకు ధ్యానములో వైకుంఠములో ఉన్న లక్ష్మి నారాయణ మూర్తి సజీవ మూర్తిగా నన్ను ఆశీర్వదించినట్లుగా లీలగా అనిపించినది. ఆపై శూన్యములో అదృశ్యమైనారు. అంటే లక్ష్మి నారాయణలు గూడ శాశ్వతము గాదని నాకు అర్ధమైనది.
ఇంతటితో ఈ చక్ర జాగృతి, శుద్ధి,ఆధీన,విభేదన అనుభవాలు సంపూర్తి అయినాయి.కాని ఈ అనుభవ భావాలు కలిగినపుడు నాకు వివిధ రకాల ధ్యాన,ప్రత్యక్ష అనుభవాలు, అలాగే జ్ఞానస్ఫురణలు కలిగినాయి.వీటిని ఒకచోట చేర్చి మీకు అందిస్తున్నాను.జాగ్రత్తగా చదివి అర్ధము చేసుకోండి!
**************
నా స్వాధిష్టాన చక్రం అనుభవాలు :

మేమిద్దరము స్వాధిష్ఠాన చక్రము మీద దృష్టి పెట్టి దాన్ని జాగృతి చేసుకోవాలని ధ్యానం చేస్తున్న కూడా తిరిగి మహాగణపతి స్వరూపం ధ్యానమునందు తరచుగా ఇలా 41 రోజుల పాటు కనపడసాగింది.మా ఇద్దరికి కారణమేమిటో తెలియరాలేదు.అంటే మూలాధార చక్ర సాధన ఇంకా పూర్తి కాలేదా అనే సందేహంలో సతమతమవుతుండగా ఒక రోజు ధ్యానంలో ఒక తెల్లని దివ్య మణి కనిపించసాగినది.ఇది ఏమిటి క్రొత్తగా?ఈ మణిని ఎక్కడ ఎప్పుడు గూడ చూడలేదు అనుకుంటూ మా ధ్యానాలు వాడేమో శ్రీశైలంలో నేనేమో మా ఇంటిలో ధ్యానాలు చేస్తుంటే ఇలా మణి దర్శనాలు రావడము ఆరంభమైనది.దీని సంకేతము ఏమిటో మాకు అర్ధము కాలేదు.కొన్ని రోజుల తర్వాత ఈ మణి లోపల మాకు కనిపించే మహా గణపతి ఉన్నట్లుగా అగుపించడము ఆరంభమైనది.వామ్మో!ఇది ఏమిటి?మణి మరియు గణపతి కలిస్తే వచ్చేది గణపతిమణి అంటే మనకి గణపతిమణి గూర్చి ఏమైనా చెప్పాలని అనుకుంటున్నాడా?అసలు ఇంతవరకు శమంతక మణి,నాగ మణి,కౌస్తుభ మణి,రుద్ర మణి ఇలా వీటి గూర్చి పుస్తకాలలో చదివినట్లుగా గుర్తు. కాని ఎక్కడ గూడ ఈ గణపతిమణి గూర్చి చదివినట్లుగా లేదు అనుకుంటూ ధ్యానము చెయ్యడం ఈ గణపతిమణి రూపము కనపడటంతో దాని వెలుగులకి మా కళ్ళు మూసి ఉన్న గూడ తట్టుకోలేకపోవడముతో ధ్యాన భంగమై కళ్ళు తెరవడము ఈ మధ్య చాలా తరచుగా జరుగుతున్నది.ఇది ఇలా ఉండగా ఒక రోజు నా దగ్గరికి కాశీఖండము పుస్తకము నా దగ్గరికి వచ్చింది. దాని మొదటి పేజీ తీయగానే దానిపైన మహా చింతామణి గణపతి అని ఉంది. దాని ఫోటో కూడా ఉంది.దానిని చూడగానే నాకు వెంటనే స్ఫురణ వచ్చి అంటే ఇన్నాళ్లు మనకి ధ్యానములో కనిపించేది గణపతి మణి కాదని చింతామణి గణపతి అన్నమాట.

ఇది మీ ఇంట్లో ఉంటే అన్ని రకాల చింతలు తొలగిస్తాడు.అందుకే ఈ మణికి చింతామణి అనే పేరు వచ్చినట్లుగా మహాశివుడుకి ఉన్న అన్ని రకాల చింతలు డుండి గణపతి తీర్చటం వలన ఆయనకి చింతామణి గణపతిగా స్వయంగా మహా శివుడే నామకరణం చేసినట్లుగా ఈ పుస్తకములో చదవడము జరిగినది. అంటే మూలాధార చక్ర సాధన పరిసమాప్తి అయింది అనటానికి సూచనగా చింతామణి గణపతి వస్తాడని మాకు అర్థమయింది. కానీ ఎలా?ఈ కాలంలో అది ఎక్కడ ఉంది? అది మాకు ఎలా వస్తుంది? అది తీసుకుంటే మాయలో పడతామా లేదా మాయ దాటుతామా? ఏమీ అర్ధం కాని స్థితి అన్నమాట.అక్కడ ఇదే పరిస్థితిలో శ్రీశైలంలో మా జిజ్ఞాసి కూడా ఉన్నాడు. వాడికి అది చింతామణి గణపతి అని తెలిసినది.
వాడికి దాని మీద ఏదో తెలియని ఆసక్తి మొదలై దానిని ఎక్కడ ఉన్న ఎలాగైనా సంపాదించాలనే ఆశ పుట్టింది.ఆశ మాయ అంటే ఇదే కాబోలు. ఆశ, భయము, ధన, కాంత, స్పందన మహామాయలు వస్తాయని యోగులు తమ అనుభవాల ద్వారా లోకానికి తెలియ చేసినారు. ఇందులో మనవాడు అలాగే నేనుగూడ మాకు తెలియకుండా చింతామణి చూడాలని ఆశ నాకు ఉంటే దానిని ఎలాగైనా పొందాలని ఆశ వాడికి కలిగినది. మేము ఆశ మాయలో కూడా ఉన్నామని గ్రహించలేని స్థితి అన్నమాట.ఇలా కొన్ని రోజుల తర్వాత మా వాడికి ధ్యానంలో చింతామణి ఎక్కడ ఉందో ఏ రూపంలో ఉందో కనపడ సాగింది. వెంటనే వాడు తనకి ధ్యానములో కనిపించిన చోటుకి వెళితే అక్కడ నల్లటి, తెల్లని,జేగురు శిల ముక్క కనపడినది.దానిని చూస్తుంటే కూర్చుని ఉన్న గణపతి ఆకారంగా ఉంది కానీ అది మణి లాగా మెరవడం లేదని మణికాంతులు లేవని నాకు టెలిపతి ద్వారా తెలియజేసినాడు. నాకు దాంతో ఎలాగైనా దానిని ఒకసారైనా చూడాలని ఆశ కలిగినది.కానీ ఆ అవకాశమే లేదు. మేమిద్దరం కూడా మా సాధన పరిసమాప్తి అయ్యేదాకా ఒకరినొకరు ప్రత్యక్షంగా ఎదురు పడకూడదని అనుకున్నాము కదా.! కానీ లే, ఏమి చేద్దాం అనుకున్నాను. వాడికి దొరికిన శిలను వాడు పరీక్షలు చెయ్యటం మొదలు పెట్టినాడు. “నాకు ఆకలి వేస్తుంది నీవు నిజముగా చింతామణివి అయితే ఈ చింతను తొలగించు” అనగానే ఎవరో భక్తుడు ఇక్కడికి వచ్చి చక్కెర పొంగలి ప్రసాదంగా ఇచ్చి వెళ్లినాడట. అయితే ఇప్పుడు “నాకు విపరీతమైన దాహం వేస్తోంది దాని చింత తీర్చు” అనుకోగానే “స్వామి! నా దగ్గర మంచినీళ్లు డబ్బాలు మూడు దాకా ఉన్నాయి. అవి నాకు అవసరం లేదు. బరువు తగ్గుతుంది కదా.ఈ బాటిల్స్ తీసుకోండి” అంటూ ఒక యువకుడు వచ్చి వాటర్ బాటిల్స్ ఇచ్చాడట. ఈసారి ఇలా కాదనుకొని దుఃఖ చింత లేకుండా చెయ్యి చూద్ధాం అనుకున్నాడట. కొన్ని నిమిషాల తర్వాత ఎవరో పిలిచినట్లు ఒక సాధువు తన దగ్గరికి వచ్చి “స్వామి! మీరు కూడా సన్యాస దీక్ష లో ఉన్నారా? మంచిది. ఇంత చిన్న వయసు లోనే దీక్ష తీసుకున్నారా? మంచిది. ఆశా మోహాలు చేదించి పరమాత్మ వైపు నడవాలని అనుకుంటున్నారు. మీలాంటి వారికి మాలాంటి వారికి చింతలు తప్పడం లేదు. ఆకలి దప్పికలు బాధలు ఉండనే ఉంటాయి. కానీ దుఃఖ బాధ కూడా ఉంటుంది. ఏమీ లేదు స్వామి! కొన్ని సంవత్సరాల నుండి నేను ఒకరితో కలిసి సాధన చేస్తున్నాను. రాత్రి వాడికి ఉన్నట్టుండి విపరీతమైన ఆయాసం వచ్చి గుండెనొప్పి అంటూ గుండె పట్టుకొని చనిపోయాడు. వాడిని అలా చాలా దగ్గరగా చూసిన వాడిని, వాడి చావును కూడా చూసే సరికి ఆపుకోలేని దుఃఖం వస్తుంది. అన్నీ వదిలేసిన మనకి దుఃఖం  దేనికి స్వామి. దానిని కూడా వదిలేయాలి. స్వామి! వదిలేయాలి అంటూ వీరావేశముతో అతనికి చెప్పి దుఃఖమును జయించాలి జయించాలి దానికి చింత తొలగించుకోవాలి” అంటూ వెళ్ళిపోయాడట. మన వాడికి నోట మాట రాలేదట. దీనిని ఏమి అడిగితే, అది తీరుస్తుందని మనకున్న చింతలు తొలగిస్తుందని గ్రహించి దానికి నమస్కారాలు చేస్తూ “చింతామణి గణపతి! నన్ను క్షమించు. నీవు నా దగ్గరికి వచ్చి గంట కూడా కాలేదు. అంతలోనే నా మనస్సుకి ఎన్నో కోరిక చింతలు కల్గించావు. వాటిని తీర్చావు. అదే నీవు నా దగ్గర ఉంటే నా బ్రతుకు లేని పోని కోరికలతో గడిచిపోతుంది. నన్ను క్షమించు.నిన్ను భరించడం నా వల్ల కాదు. నేను కోరిక లేని వాడిలాగా మారాలని అనుకుంటున్నాను. నువ్వేమో కోరికలు తీర్చే వాడి లాగా ఉన్నావు. కోరిక లేని వాడికి కోరిక ఇచ్చే వాడితో ఏ పని ఉంటుంది. నువ్వు అవునా కాదా అని పరీక్షించినందుకు నన్ను క్షమించు. నువ్వు నాకు ఎక్కడ దర్శనమిచ్చినావో నిన్ను అక్కడే ఉంచుతాను అని దానిని తీసుకొని ఏ మాత్రం ఆలోచించకుండా యధాస్థానంలో పెడుతుండగా ఆ రాతి నుండి కొన్ని రకాలైన మెరుపు కాంతులు రావటం గమనించాడట. దానిని దొరికిన చోట పెట్టి వెనుతిరిగి చూడకుండా ముందుకు సాగిపోయాడని నాకు వివరాలు తెలియ చేసినాడు.
కనీసం వాడైనా ఈమణిని చూశాడు గదా, అనుకుంటూ బాధతో ధ్యానంలో కూర్చోగానే ఏదో గుడి… దాని ఆవరణము 2 వెంకన్న శిలా మూర్తులు కనపడసాగాయి. ఇది ఎక్కడ ఉంది? ఇది ఏమి గుడి? ఇది ఎందుకు కనబడుతుందో అనుకొని ధ్యాన భంగమై కళ్ళు తెరవడం జరిగినది.ఇదే దృశ్యము కొన్ని రోజులపాటు నన్ను ధ్యానములో వెంటాడింది. అప్పుడు ఈ గుడి గూర్చి విచారించగా చిన్నతిరుపతి( ద్వారక తిరుమల) వెంకన్న స్వామి అని తెలిసినది.

ఆయన అక్కడికి ఎందుకు వెళ్ళమని చెబుతున్నాడో నాకు అర్థం కాలేదు.కానీ విచిత్రంగా మా కుటుంబ సభ్యులు అంతా కలిసి దానిని అలాగే దాని చుట్టు ప్రక్కల ప్రాంతాలలో గుడులు కూడా చూడాలని అనుకుని ప్రయాణం కట్టారు. మేము బస్సెక్కాము.బస్సు ద్వారకా తిరుమల చేరుకుని దిగి దిగగానే పుస్తకాలు అమ్ముకొనే కుర్రాడు నా దగ్గరికి వచ్చి “అన్నా!అన్నా! ప్రొద్దుట నుండి ఒక పుస్తకం కూడా అమ్ముడుపోలేదు. కనీసం నువ్వైనా ఈ పుస్తకమును కొను” అంటూ వాడే ఒక పుస్తకం తీసి నా చేతిలో పెట్టాడు.వీడు ఏమిటి? నాకు కావలసిన పుస్తకాలు కొననియ్యకుండా వాడికి కావలసిన పుస్తకం అమ్ముతున్నాడు అనుకుని చూస్తే అది ఆ క్షేత్రమునకు సంబంధించిన పుస్తకము కావటంతో మారు మాట్లాడకుండా కొనటం జరిగినది. అందులో చూస్తే కపిలమహర్షి భక్తికి వెంకన్న స్వామి దర్శనం ఇవ్వడం అది కూడా పాదాలు భూమిలోనే ఉండిపోవటంతో పాద మూర్తి కోసం మరొక వెంకన్న విగ్రహమూర్తి ఉంచినారని ఈ మహర్షి దగ్గర చింతామణి ఉండేదని దానిని ఆయన పాదాల క్రింద ఉంచడం జరిగిందని అందుకే మొదటి విగ్రహ మూర్తికి పాదాలు కనిపించకుండా ఏర్పాట్లు చేశారని రాత్రిపూట గుడి తలుపులు మూసివేసిన తర్వాత లైట్లు ఆరి పోయిన తర్వాత సుమారు అర్ధరాత్రి 12 గంటల తర్వాత గాలి గోపురం శిఖరం నుండి కాంతులు ఈ మణి నుండి బయటకు వస్తాయని చదవగానే ఓహో! ఈ విధంగా మహాగణపతి తన చింతామణి మహత్యమును చూపబోతున్నాడా అనుకొని ఇక్కడ ఏమి కోరుకుంటారో వారి చింతలు బాధలు తొలగుతాయని కొస మెరుపుగా వ్రాయటం జరిగింది. ఇక్కడ కోరడానికి ఏముంది మోక్షప్రాప్తి తప్ప అనుకుని కాటేజికి చేరుకోవడము ఆయన దర్శనం చేసుకోవటం అర్ధరాత్రి ఎప్పుడు అవుతుందా అని ఎదురు చూడటం జరిగింది.రెండు రోజుల వరకు నాకు ఏమీ కనిపించలేదు. పైగా గుడి లైట్లు వేసి ఉన్నాయి. కానీ వాటిని ఆపండి అని చెప్పలేము కదా అనుకుంటూ నిరాశగా ఎదురుచూశాను.
మరో రోజు అనుకోకుండా గుడి పరిసరాలు అంతా కరెంట్ పోవటం ,వాళ్లు జనరేటర్ కోసం వెళ్ళటం మిగిలిన ఈ కొద్ది సమయంలో చిమ్మ చీకటిలో గాలి గోపురం కలశం వైపు నేను అనుకోకుండా చూడటం… అతి సన్నని చిన్నకిరణము దాని మీద నుండి పైకి ఒకటి అడుగు మేర ప్రసరిస్తుందని తెలియగానే నాకే ఆశ్చర్యమేసి ఒకటికి మూడు సార్లు కళ్ళు నులుపుకొని తీక్షణంగా చూసే సరికి సరిగ్గా ఖచ్చితంగానే కనపడింది. కాకపోతే గుడి చుట్టూ బల్బుల వెలుగు వలన ఈ అతి సన్నని కాంతి పుంజము కనబడటం లేదని గ్రహించేసరికి అకస్మాత్తుగా మళ్లీ కరెంటు రావటము అది మళ్లీ బల్బుల వెలుగుల కాంతులలో ఈ మణి కాంతి కలసి పోవడముతో ఈ విధంగానైనా చింతామణి చూపినందుకు మహాగణపతికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ యాత్రను ముగించుకొని ఇంటికి వచ్చి యధావిధిగా ధ్యాన ప్రక్రియ సాధనలో మునిగిపోయాను. నాకు కలిగిన ఈ చింతామణి అనుభవము టెలిపతి ద్వారా మన జిఙ్ఞాసికి చెప్పడం జరిగినది. అలాగే అమెరికా డాలర్ నోటు వచ్చినట్లు అనగా చింతామణి శిల బొమ్మ దాని వెనుక ఉందని చెప్పటం జరిగినది.


స్వాధిష్టాన చక్రం జాగృతి:

ఇక నా ధ్యానం అంతా తిరిగి స్వాధిష్ఠాన చక్రము మీద పెట్టేసరికి లక్ష్మీనారాయణుడు కనిపించాడు. అది కూడా నీడలాంటి లీలారూపముతో కనిపించి కనిపించనట్లుగా కనిపించాడు.ఇలా కొన్ని రోజుల తర్వాత నాకున్న నా ఉద్యోగం పోయినది. చేస్తున్న ఉద్యోగం పోయేసరికి మనస్సు వికలమైంది. మరోచోట ఎన్ని ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న నాకు రావటం లేదు. ఇక ఉద్యోగ ప్రయత్నాలు మాని వేయాలని నిర్ణయం తీసుకోవటం జరిగినది. ఇంతలో మా శ్రీమతి కూడా అప్పటి దాకా తను చేస్తున్న ఉద్యోగంలో మార్పులు వచ్చాయి. కొన్నాళ్లపాటు అన్ని భరించి చేసినది కానీ తర్వాత ఏమి చేయలేని పరిస్థితి. నా ఉద్యోగం పోయిన మూడు సంవత్సరముల దాక చేస్తుండేది. కానీ అనుకోకుండా ఆమెకి కూడా ఉద్యోగ సమస్యలు వచ్చే సరికి తను కూడాఉద్యోగము వదిలే స్థితికి చేరుకుంది. అసలే స్వాధిష్టాన చక్రం సాధన చేస్తున్న సమయంలో మనని ఆర్థికంగా దెబ్బ తీసే విధంగా మా రెండు ఉద్యోగాలు పోయాయి. అప్పటిదాకా ఉద్యోగ ప్రయత్నాలులో ఉన్న నాకు తను పూర్తిగా మానివేసి తను పూర్తిగా సాధన కోసమే సమయం కేటాయిస్తానని ఖరాఖండిగాచెప్పేసింది. తనను ఇంకా ఇబ్బంది పెట్టకూడదని తను ఉద్యోగం సమయంలో తనకు వచ్చిన నాకు వచ్చిన జీతం కలిపి ప్లాట్ తీసుకోవటం జరిగినది.సుమారుగా 5 సంవత్సరముల పాటు EMI కట్టడం జరిగింది.అనుకోని అవాంతరాల వలన మా ఉద్యోగాలు పోవటంతో EMI కట్టలేని పరిస్థితి రావటం ఏకకాలంలో జరిగినాయి. ధన మాయ ఎలా ఉంటుందో చెప్పడానికి ఇంత వివరంగా చెప్పటం జరుగుతుంది. అనగా స్వాధిష్ఠాన చక్రము రీత్యా ధన మాయ ఎలా ఉంటుందో చెప్పడం అన్నమాట. విచిత్రం ఏమిటంటే ఆమె ఉద్యోగంను తీసినది గూడ నారాయణమూర్తి అనే వ్యక్తి అయితే నా ఉద్యోగంను తీసినది గూడ లక్ష్మీనారాయణ అనే వ్యక్తి కావడం విశేషం. నా ఉద్యోగ ప్రయత్నాలు పూర్తిగా విరమించి నానా రకాల వ్యాపార ప్రయత్నాలు చేసినా కూడా అవి కూడా కలిసి రాక పోవడం అది కూడా మానుకొని ధనమునకు ఇంత ఇబ్బందులు పడవలసినదేనా అనుకొని మంచినీళ్ళే ఆహారంగా అనుకునే స్థితికి చేరుకున్నాము.    

No comments:

Post a Comment