Tuesday, September 2, 2025

 *జీవిత సత్యం.....* 

*ఓ ముగ్గురు స్నేహితులు పర్యటన నిమిత్తం ఇతర దేశానికి వెళ్లారు. అక్కడ ఒక పెద్ద హోటల్లో 75వ అంతస్థులో రూమ్ బుక్ చేసుకున్నారు. ఆ హోటల్ నిబంధనల ప్రకారం రాత్రి పదకొండు గంటల కల్లా రూంకు చేరుకోవాలి. పదకొండు దాటితే లిఫ్ట్ పనిచేయదు. ఈ విషయం తన కస్టమర్లకు ముందుగానే చెప్పారు హోటల్ నిర్వాహకులు. ఆలస్యంగా వచ్చిన వాళ్లుపై అంతస్థులకు వెళ్లాలంటే చుక్కలు చూడాల్సిందే. మొదటి రోజు ముగ్గురు స్నేహితులూ సమయానికి చేరుకున్నారు. కాని రెండవరోజు కాస్తంత ఆలస్యమైంది. వచ్చేసరికి లిఫ్ట్కు తాళం వేసి ఉంది. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. 75 అంతస్థులంటే మాటలా? అయినా చేసేదేమీ లేదు. గదికి వెళ్లాలంటే కాళ్లకు బుద్ధి చెప్పాల్సిందే. అలసట తెలియకుండా ఉండడం కోసం ఒక స్నేహితుడు జోకులు చెప్పడం, సరదాగా ముచ్చట్లు, కథలు చెప్పడం ప్రారంభించాడు.* 

*అలా సరదాగా ఆడుతూ పాడుతూ పాతిక అంతస్థులు సునాయాసంగా అధిగమించారు. తరువాత, రెండవ స్నేహితుడు బంధాలు, బాధ్యతలకు సంబంధించిన వాస్తవ గాథలు వినిపిస్తుండగా మరో పాతిక అంతస్థులు అధిగమించారు. ఇక చివరి పాతిక అంతస్తులు మిగిలాయి. మూడవ స్నేహితుడు బాధలు, కష్టాలు, కడగండ్లకు సంబంధించిన కథలు, జీవన సత్యాలను విడమరిచి చెబుతుంటే, వాటిని జీర్ణించుకోడానికి ప్రయత్నిస్తూ పడుతూ లేస్తూ, ఆపసోపాలు పడుకుంటూ ఎగోలా తమ గది వరకూ చేరుకున్నారు. తీరా పైకి వెళ్లిన తర్వాత గది తాళాలు కింద వాహనం లోనే మరిచి వచ్చామన్న సంగతి గుర్తొచ్చింది వారికి.*

*ఖచ్చితంగా ఇలానే ఉంది ఈనాటి మన పరిస్థితి. మన జీవితకాలంలోని మొదటి ఇరవై పాతిక సంవత్సరాలు బాల్యం, యవ్వనం, చదువు, ఆట పాటల్లోనే గడిచిపోతోంది. మిగతా పాతిక సంవత్సరాలు కుటుంబం, ఉద్యోగం, వ్యాపారం, బంధాలు, బాధ్యతలతో గడిచిపోతోంది. ఇక మిగిలిన పాతిక సంవత్సరాలు బాధలు, నొప్పులు, వృద్ధాప్యం, ఆరోగ్య సమస్యల తో జీవితం భారంగా గడుస్తోంది. చివరికి గమ్యానికి చేరుకునేసరికి ఏమీ మిగలడం లేదు. రిక్త హస్తాలతోనే సమాధికి చేరిపోతున్నాం. అప్పుడు గాని అసలు విషయం గుర్తుకురావడం లేదు. ప్రాపంచిక జీవన వ్యామోహం లో పడి సత్కర్మలు అనే తాళం చెవులు మరిచిపోయి వచ్చామని. అసలు వెంట తేవలసిన వాటినే తీసుకురా లేదని. మరలా వెళ్లి తీసుకురావడానికి అవకాశమే ఉండదు. అయినప్పటికీ కొంతమంది అడుగుతారట.. ప్రభూ! మాకు మరొక్కసారి అవకాశాన్ని ప్రసాదించు. మమ్మల్ని ఇహలోకానికి పంపు. మేము ఎలాంటి తలబిరుసుతనానికి పాల్పడకుండా నువ్వు చెప్పినట్లే నడుచుకుంటాము అని మొరపెట్టుకుంటారట. కాని వారికి అలాంటి అవకాశమే ఇవ్వబడదు. అందుకని చావుపుట్టుకల మధ్య ఉన్నటువంటి ఈ జీవన వ్యవధిని సద్వినియోగం చేసుకుంటూ సత్కర్మలు ఆచరించడానికి ప్రయత్నించాలి. సమాధికి చేరడానికి ముందే తగిన ఏర్పాట్లు చేసుకోవాలిట.*..



         *ఆధ్యాత్మిక అన్వేషకులు*

No comments:

Post a Comment