251వ భాగం
🕉️ అష్టావక్ర గీత 🕉️
అధ్యాయము 18
శ్లోకం 39
నా శాంతిం లభతే మూఢో
యతశ్శమితు మిచ్ఛతి|
ధీరస్తత్త్వం వినిశ్చిత్య సర్వదా శాంతమానసః||
మనసును నియమించి శాంతిని సాధించాలి అనుకునే తెలివిహీనునికి అది ఎన్నటికీ సాధ్యం కాదు .సత్యాన్ని నిశ్చయంగా తెలుసుకున్న జ్ఞాని మనసు ఎప్పుడు శాంతపూర్ణంగా ఉంటుంది.
భూతాన్ని చూసి భయాందోళనతో విహల్వమైన మనసు కనిపించేది స్తంభమే అని నిశ్చయ జ్ఞానంతోనే శాంతిస్తుంది .ఆత్మ జ్ఞాని మాత్రమే భావనాతీతమైన పరమ శాంతిని అనుభవించగలరు. మూఢుడు శాంతిని వాంఛించి మనసును నియమించాలని ప్రయత్నిస్తాడు. ప్రయత్నము ఉన్నచోట శ్రమ అశాంతి ఉండనే ఉంటాయి. అందుకే శాంతిని కోరుతూ అశాంతిపాలు అవుతున్నాడు. అంతేకాక సాదింపబడేది దూరమయ్యే అవకాశం కూడా ఉంటుంది .మూడుడు శాంతిని సాధించాలని కోరుకొని మనసును నియమించడానికి శ్రమిస్తాడు. ఆ శ్రమకు బహుమానముగా శాంతి లభిస్తుందని భ్రమపడతాడు. ధ్యానించాలనే బలమైన భావమే మనసులో మరింత బలవంతంగా చేస్తుంది. నిప్పును ఆర్పటానికి నీరు అనుకొని పెట్రోలు వాడటం వంటిదే ఇది కాగలదు . అగ్నికి ఆజ్యం తోడ్పడినట్లే మనసుకు ధ్యానం కూడా కాగలదు. మనసుచే మనసు ఎన్నటికీ నియమింపబడదు. మనసు భావానికి ఎన్నడూ లోబడదు. మనోబుద్దులను అధిగమించటమే వాటిని వశము చేసుకొనే ఏకైక మార్గము .శాస్త్రము సహాయముతో ఆత్మ తత్వాన్ని అర్థంచేసుకొని భావాతీతము భావనాధారము అయిన నిశ్చల శాంతి లో ఆత్మగా నిలిచి ఆనందంగా జీవిస్తారు. జ్ఞానులు ఆత్మ తత్వాన్ని అర్థం చేసుకోవడమే మనసును అధిగమించడము.🙏🙏🙏
No comments:
Post a Comment