Tuesday, March 10, 2020

ఆధ్యాత్మిక సాధనలో పురోగతి తృప్తి కలుగటంలేదు, ఏవిధంగా సరిదిద్దుకోవాలి ?ధ్యానం అనేది ఒక సాధనా విధానమా లేక ఫలితమా !?

ఆధ్యాత్మిక సాధనలో పురోగతి తృప్తి కలుగటంలేదు, ఏవిధంగా సరిదిద్దుకోవాలి ?"

సాధనలో అనుకున్నంత లోతుగా మనసులోకి (అంతర్ముఖంగా) వెళ్ళలేక పోతున్నానని ఒక భక్తుడు ఇలాగే శ్రీరమణమహర్షిని ప్రశ్నించాడు.

మనసు బాహ్య విషయాలపై బలమైన బంధంతో ఉండటమే అందుకు కారణమని మహర్షి సమాధానమిచ్చారు.

ఆధ్యాత్మిక సాధనలో కోరుకున్న ఫలం రావటం లేదని మనం చింతిస్తూ ఉంటాం. కానీ అందుకు అడ్డంగా ఉన్న విషయాలను గుర్తించి వాటిని వదిలించుకోలేక పోతున్నాం.

జపం, ధ్యానం వంటి సాధనలపై మనసు నిలబడటంలేదని చాలామంది అనుకుంటారు. కానీ అప్పటికే మనసు మరేదో విషయంపై నిలిచి ఉండటమే ఇందుకు కారణమని అర్థం చేసుకోరు.

చేతితో పట్టుకున్న వస్తువును వదలకుండా, ఎదురుగా కనిపించే పండును అదే చేతితో అందుకోవటం సాధ్యంకాదు. మన మనసు ఒక విషయంపై లగ్నం కావటం లేదంటే అంతకన్నా ఇష్టమైన మరేదో వ్యాపకం అప్పటికి మన మనసును ఆక్రమించుకున్నదని అర్థం !

ధ్యానం అనేది ఒక సాధనా విధానమా లేక ఫలితమా !?

ధ్యానం అనేది ఒక విధానం కాదు. శాంతిగా ఉన్నప్పుడు మనసుకున్న స్థితి పేరు ధ్యానం. ధ్యానం అనగానే కేవలం దైవపరమైన విషయంగా, ఆధ్యాత్మిక సాధనగా అనిపిస్తుంది. కానీ ధ్యానం నిత్యజీవితంలో అంతర్భాగం.

ధ్యానం అనే పదం వినగానే అది మనకి సంబంధించినది కాదని, లేదా అది ఎప్పుడో ఒక ప్రత్యేక సమయంలో ఒంటరిగా కూర్చొని చేసే ప్రక్రియగా అనిపిస్తుంది. కానీ మన జీవితంలో శాంతి లభించే ప్రతిక్షణం జరుగుతున్నది ధ్యానమే !

ఒక వ్యక్తి కళ్ళు మూసుకుని తనకిష్టమైన రూపాన్ని, నామాన్ని, విషయాన్ని స్మరిస్తూ ఇతరుల ఆలోచనలు ఏవీ రానిస్థితికి చేరుకుంటున్నాడు. ఆ స్థితిని అతను ధ్యానం అంటున్నాడు.

అయితే ఒక పనిలో నిమగ్నమైన వ్యక్తి మరో ఆలోచన ఏదీ రానంతగా అందులో లీనమైపోతే పొందే శాంతి కూడా అలాంటిదే !

------రమణ మహర్షి బోధనలు నుండి..

No comments:

Post a Comment