ఈ సందర్భంగా సెల్ఫ్ హెల్ప్ బుక్స్ గురించి నేను చదివిన ఒక ఆర్టికల్ పోస్ట్ చేస్తున్నాను.
పుస్తక విపణిలో వ్యక్తిత్వ వికాసం పేరిట వేడివేడి పకోడీల్లా వందలాది పుస్తకాలు అమ్ముడుపోవడం ఆశ్చర్యమేస్తుంది. ఇంతటి ఘనమైన ఆధ్యాత్మిక, సాంస్కృతిక సంపద గల తెలుగు జాతికి విడిగా వ్యక్తిత్వ వికాసమంటూ ఓ కొత్త విషయంలా నేర్పవలసిన అవసరం ఏమిటో అర్థం కాదు. ఉగ్గుపాలతో నేర్చిన సుమతీ, వేమన శతకాల్లోని వ్యక్త్విత్వ వికసన పాఠాలు కాలం చెల్లిపోయాయా? వాటిని మించిన తత్త్వబోధ ఈ పుస్తకాల్లో ఏముంది? ప్రస్తుతం చలామణీ అవుతున్న పుస్తకాలను పరిశీలించే ముందు అసలు వ్యక్తిత్వ వికాసం పరిధి ఏమిటో అర్థం చేసుకోవాలి. మనిషి సంపూర్ణ మానవుడిగా ఎదగడం అని అనుకుంటే వ్యక్తిగా సమాజం పట్ల బాధ్యత కలిగి వుండాలి. పుట్టిన దేశానికి ఋణపడి ఉండాలి. కన్న తల్లిదండ్రులను, తోడబుట్టిన వారిని అంటిపెట్టుకొని ఉండాలి. ఇలా ఎన్నో చెప్పుకోవచ్చు. మరి ఈ ‘వికాసం’ పుస్తకాల్లో ఏముందో వాటి పేర్లే సగం చెబుతాయి. కొన్ని మెట్లు ఎక్కితే విజయం, విజయానికి అభయం అనడంలో దాగిన ‘విజయం’ ఎవరికి? వ్యక్తికా? వ్యక్తి భాగమయిన సమాజానికా? వ్యక్తిగత అభివృద్ధికి, వ్యక్తిత్వ వికాసానికి సంబంధం ఏమిటి? వింతైన పేర్లలో మరికొన్ని - నెంబర్వన్ అవడం ఎలా? నిన్నటి దాకా శిలనైనా? 30 నిమిషాల్లో మిమ్మల్ని మీరు మార్చుకోండి! విజయపథ గర్జన, మీ జీవితాన్ని మార్చుకోవడానికి ఒక నిమిషం చాలు! ఎంతో ఆకర్షణీయమైన పేర్లు ఇవి.
సామాజిక బాధ్యతను ఏమాత్రం మోయకుండా కాల్పనిక జగత్తులో, క్షుద్ర సాహిత్యంలో యువతను ఉత్కంఠభరితుల్ని చేసిన రచయితలు ఎత్తిన మరో అవతారమే ఇది. వారి చేతికి దొరికిన మరో మంత్రదండమే ‘వ్యక్తిత్వ వికాసం’. కొందరు సైకాలజిస్టులు రాసినవైనా ప్రయోజనం మాత్రం నేతి బీరకాయ చందమే.
అయిదారు మెట్లలో విజయం దొరుకుతుందంటే ఆశపడనిదెవరు? పైగా ‘ప్రసిద్ధ’ రచయితలు అబద్ధమాడతారా! యువత ఎగబడడం, లక్షలాది ప్రతులు అమ్ముడుబోవడం తథ్యమే. అయితే అందులో మారిన శాతమెంత? వింతేమిటంటే ఒక రచయిత ఓ అడుగు ముందుకేసి - ‘నా తొలి పుస్తకం చదివి 10వేలమంది విజేతలైనారు. ఇది రెండో పుస్తకం. అంతకంటే ఎక్కువమంది విజేతలు అవుతారని ఆశ’ అని ముందుమాటలో రాసుకున్నాడు. ఈ లెక్కలు ఎక్కడివి? పాఠ్యపుస్తకాలు వదిలేసి అందరూ వీరి పుస్తకాలు చదివితే అందరూ విజేతలే కదా!
నిజానికి వికాసమంటే అందరినీ ప్రేమించడం. తన పిల్లలకన్నా ఇతరులు ముందుంటే ఈర్ష్య పడకుండా ప్రోత్సహించడమూ. భారతీయ తత్త్వవేత్తల బోధనలను గాలికొదిలి విదేశీ రచయితలు ‘పర్సనాలిటీ డెవలప్మెంట్’ పేరిట రాస్తున్న కూతలన్నింటినీ తెలుగులో అనువదించి వండి వార్చడం జాతి ద్రోహం అనదగ్గదే. ఇన్ని పాఠ్యపుస్తకాలు, సిద్ధాంత గ్రంథాలు, పలకా బలపం పట్టి చదివిందంతా జీవితంలో విజయాలు సాధించడానికి పనికి రానిదై పోయింది. నేటి యువత షార్ట్ రూట్లో జాక్పాట్ కొట్టడానికి ఉబలాటపడి ఉన్న కాస్త చిల్లర సొమ్మును దోపిడీపాలు చేసుకుంటున్నారు. మరో మెట్టు ఎక్కితే విజయం సొంతమని నమ్ముతూ ఎండమావుల్ని చూసి చెంబు బోర్లేసుకుంటున్నారు. అసలు విజయం అంటే ఏమిటి? గెలుపంటే ఒక మనిషి హాయిగా, ఆనందంగా, తక్కువ సమస్యలతో, మంచి సంబంధాలతో, నలుగురి మధ్య మంచి పేరుతో, ఉన్నంతలో ఇతరులకు సహాయం చేస్తూ, ఆరోగ్యం కాపాడుకుంటూ, తన సమయాన్ని, సహనాన్ని, సమృద్ధిని తన అదుపులో పెట్టుకొని ప్రశాంతంగా జీవించడం అని ఓ కోణంలో చెప్పుకోవచ్చు. ఇవన్నీ 30 నిమిషాల్లో ఓ పుస్తకం చదివితే సాధ్యపడతాయా? లభించే చిన్నపాటి లాభాన్ని సర్వరోగ నివారిణిలా ప్రచారం చేయడం యువతను మోసం చేసినట్లే కదా? ఇలా వస్తున్న పుస్తకాలు రాయడం తేలిక. ఇతర భాషల్లో కుప్పలు తెప్పలుగా సమాచారం లభిస్తుంది. కాస్త ఇంగ్లీషు పరిజ్ఞానం, తెలుగు భాషపై పట్టు, ఆసక్తికరంగా రాయగలగడం తెలిస్తే ఇక యువతకు నిషా ఎక్కించడం చిటికెలో పని. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తత్త్వవేత్తల కొటేషన్లకు కాస్తంత సొంత చాపల్యం కలిపి పిసికితే ఓ పుస్తకం సిద్ధం. కాపీరైట్ల సమస్యే లేదు. ఒక్కొక్క మెట్టు పెంచుతూ చదువరి కూలబడేదాకా ఎన్ని మెట్ల పుస్తకమైనా రాయొచ్చు. ‘పట్టు దప్పి అగాధంలోకి జారిపోతున్నవారిని పట్టుకొని పైకిలాగి ఉన్నత శిఖరాలకు చేర్చే విజ్ఞాన సంజీవిని ఈ పుస్తకం’ అని ముఖచిత్రంపై ఉన్న ఈ వాక్యాల ఆకర్షణకు పుస్తక ప్రతుల అమ్మకాలు పట్టుతప్పాయి. 12వ ముద్రణగా యాభైవేల ప్రతులు మార్కెట్లోకి వచ్చాయి. ఇంతకన్నా మంచి లాభసాటి వ్యాపారం రచనా వ్యాసాంగంలో ఎక్కడా లేదు. గొప్ప గొప్ప పత్రికల కాలమిస్టులకు, టీవీ చర్చల్లో పాల్గొనే మేధావి పాత్రికేయులకు కూడా ఇంత సంపాదన లేదు. ఇదే అదునుగా కొత్తగా వస్తున్న స్వామీజీలు, గురువుల బోధనలను కూడా వారి శిష్య బృందం వ్యక్తిత్వ వికాసం ముసుగులో ప్రచారం చేసి లాభాలు గడిస్తోంది.
రెండు వందలకు పైగా మార్కెట్లో ఉన్న ఈ పుస్తకాల్లో ఉన్న విషయం మాత్రం ఒక్కటే. అది విజయానికి మెట్లు వేయడం. ఒక పుస్తకం కొని చదివాక దానితో విజయం లభించక, అది మరో పుస్తకంలో దాగి ఉందేమోనని చదువరి కొత్త పుస్తకం వెంటపడ్తాడు. చివరకు అదొక వ్యసనమై ఆ పుస్తకాల చుట్టూనే తిరుగుతుంటాడు. లేనిచో ఇన్ని లక్షల పుస్తకాలు అమ్ముడుపోవడం అసాధ్యం. ఇప్పుడు పుస్తక విక్రయ కేంద్రాల్లో సైతం ఈ పుస్తకాలకు ప్రత్యేక విభాగం. ప్రవేశం వద్దే వీటి దర్శనం. ఆ తర్వాత ఆధ్యాత్మికం. ఆనక సాహిత్యం. కథ, కవిత, నవలలు సాహిత్యంలో ప్రధాన అంగాలైనా అమ్మకాలను బట్టే దుకాణాల్లో చోటు. ఒక ప్రముఖ రచయిత రాసిన ‘వికాస’ పుస్తకం పలు భారతీయ భాషల్లోకి అనువదింపబడి రెండు కోట్లకు పైగా కాపీలు అమ్ముడుబోయిందని ఒక ఆన్లైన్ పుస్తక విక్రేత ధ్రువీకరించడం నమ్మశక్యంగా లేదు. వీటికి తోడుగా శిల్ఖెరా, అరిందమ్ చౌదరీ వంటి మేనేజిమెంట్ గురుల పుస్తకాలు కూడా తెలుగులోకి అనువదింపబడి మంచి వ్యాపారం, ప్రచారం పొందాయి. అవి చదవడం, ఆచరించడం పక్కనపెట్టి పుస్తకాల అరలో అలంకరించడం ఓ మోజుగా మారింది. ఈ పుస్తకాల్లో పేర్కొన్నట్టు వాటి అక్షరాలకు అంత శక్తి ఉంటే విజేతలతో దేశం నిండిపోయేది. నిజంగానే అందులో ఓ జీవన క్రమాన్ని, వికసించే విధానాన్ని వివరించినా అవి మన కాల పరిస్థితులకు, ఆర్థిక, సామాజిక, రాజకీయ స్థితిగతులకు సమాంతరంగా ఉండాలి. కొటేషన్లు చదవడానికి ఆకర్షణీయంగానే ఉంటాయి. జీవితానికి అన్వయించుకొనే వేళ దారులు మారతాయి. ఒకే విషయంపై ఇన్ని పుస్తకాలు రావడానికి కారణం - రచయితల్లో ఎవరి చమక్కులు వారికి, ఎవరి అక్షర లాఘవం వారికి ఉండటమే. విఠలాచార్య జానపద సినిమాలన్నీ ఒకే కథగా ఉన్నా అత్యధిక హిట్టు కావడానికి కారణం ఆయన దర్శక ప్రతిభ. ఈ ‘విజయ సోపానాల’ కథ కూడా అంతే! గొప్ప రచయితలు గొప్పగా రాసినా ఈ పుస్తకాల మాటున సామాజిక ప్రయోజనం కన్నా వ్యక్తిగత లాభమే ఉంది. ‘వ్యక్తిత్వ’ వికాసం పరిభాష రీత్యా గొప్ప విషయమే. దేశ పౌరుల్లో అది సాధించడానికి నిజాయితీగా కృషి చేసి సామాజిక సంస్కర్తగా పేరు సంపాదించవచ్చు. ఈ పుస్తకాల ప్రచురణలో ఆ చిత్తశుద్ధి ఇసుమంత కూడా కానరాదు.
అవకాశాలు తక్కువ, ఆశావహుల సంఖ్య అధికమవుతుండటం ఈ పుస్తక రచయితలకు వరమైంది. యువతకు ఓటమి నెదుర్కొనే మనోధైర్యాన్ని, జీవించడమంటే అందలాలు ఎక్కడమొక్కటే కాదని చెప్పవలసిన అవసరం ఉంది. ఏటా చదువు పట్టా పట్టుకొని బయటికొస్తున్న విద్యార్థుల్లో అందరికీ సమాన ఉద్యోగ అవకాశాలుండవు. వారివారి సామర్థ్యపు విలువలను బట్టి చిన్న, పెద్ద ఉద్యోగాల్లో సర్దుకొని ఉండవలసిందే. చదువుకు తగ్గ ఉద్యోగం దొరుకుతున్న వారి సంఖ్య ఇరవై శాతం మించి ఉండదు. ఈ శాతం పెరగాలంటే దానికెన్నో రంగాల అభివృద్ధి అవసరం. నేటి ప్రభుత్వాలు ఆ కృషి జరిపితే యువతకు అవకాశాలు వాటంతటవే దక్కుతాయి. ఏ సోపానపు పుస్తకం తిరగేయాల్సిన అవసరం ఉండదు.
నిజానికి వ్యక్తిత్వ వికాసం అవసరమున్న వర్గాలు మన దేశంలో చాలా ఉన్నాయి. స్వార్థమే పరమార్థంగా ఏలుతున్న రాజకీయ నాయకులకు, అధిక లాభాలు దండుకుంటూ ధనికులు అవుతున్న పారిశ్రామికవేత్తలకు, విద్య పేరిట ఫీజుల రూపంలో తల్లిదండ్రుల గోళ్లూడగొడుతున్న ప్రైవేటు విద్యాసంస్థల అధిపతులకు, దొంగ లెక్కలు చూపి పన్నులు ఎగ్గొడుతున్న వ్యాపారులకు, లంచంతో చేయి తడపందే ఫైలు ముట్టని అధికారులకు ఈ పాఠాలు అవసరం. ‘నిజాయితీగా బతకడం ఎలా?’ అనే శివ్ఖెరా పుస్తకం లక్షల కాపీల్లో అమ్ముడుపోయింది గాని అందులో ఒక్క శాతమైనా నిజాయితీగా బతకడానికి సిద్ధపడ్డారా అనేది అసలు విషయం.
వ్యక్తిత్వ శుద్ధికి పాల్పడుతున్న ఈ రచయితలకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే పై వర్గాల్లో మార్పు కోసం కృషి చేయాలి. తద్వారా యువతేం ఖర్మ దేశమే బాగుపడుతుంది. అందాకా జారుడుమెట్లు ఏవో, గెలుపు మెట్లు ఏవో యువతను స్వయంగా తెలుసుకోనియ్యాలి. ఎవరికైనా స్వీయ అనుభవాలను మించిన పాఠం ఉండదు.
Reference : whatsapp message

No comments:
Post a Comment